పారిశ్రామిక సిరి.. కనిగిరి
ABN , Publish Date - Mar 23 , 2025 | 11:53 PM
రాష్ట్రంలోనే పారిశ్రామికగిరిగా కనిగిరి రూపాంతరం చెందనుంది. అందుకు ఒక్కొక్క అడుగు ముందుకు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాధాన్యంగా కనిగిరి అభివృద్ధికి అడుగులు శరవేగంగా పడుతున్నాయి. అందులో భాగంగా పారిశ్రామికంగా కనిగిరిని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చూపుతున్న చొరవ కనిగిరికి మైలురాయిగా నిలవనుంది.

నియోజకవర్గంలోని దివాకరపల్లిలో బయోగ్యాస్ కంపెనీ
5 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి
బీడు భూముల రైతులకూ ఆదాయ వనరు
సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషితో రిలయన్స్ సంస్థ అంగీకారం
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర చొరవతో శరవేగంగా ఏర్పాట్లు
చంద్రబాబు సహకారం.. ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రచొరవతో...
కనిగిరి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోనే పారిశ్రామికగిరిగా కనిగిరి రూపాంతరం చెందనుంది. అందుకు ఒక్కొక్క అడుగు ముందుకు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాధాన్యంగా కనిగిరి అభివృద్ధికి అడుగులు శరవేగంగా పడుతున్నాయి. అందులో భాగంగా పారిశ్రామికంగా కనిగిరిని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చూపుతున్న చొరవ కనిగిరికి మైలురాయిగా నిలవనుంది. నియోజకవర్గంలోని పీసీపల్లి మండలంలోని దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న మంత్రి లోకేష్ రిలయన్స్ ఇంటిగ్రేటెడ్ బయోగ్యాస్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో కనిగిరి ప్రాంతంలో దాదాపు 5వేల మందికి పైగా ఉపాధి లభించనుండగా, మరో 5వేల మందికి పరోక్షంగా ఉపాధి చేకూరనుంది.
గత టీడీపీ ప్రభుత్వంలోనే కృషి
2014లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలోనే కనిగిరికి పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేసేందుకు అప్పటి సీఎం చంద్రబాబు అత్యంత చొరవ చూపారు. అందులో భాగంగా కనిగిరి ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటు కోసం వేలాది ఎకరాలు భూమిని కూడా గుర్తించి ఏపీఐఐసీకి అప్పగించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కనిగిరి అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం కొలువుదీరగా అనతికాలంలోనే ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చొరవతో పారిశ్రామికంగా ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ కంపెనీ ఆసక్తిగా ముందుకొచ్చింది. అందుకు అనువుగా వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని వినియోగించుకుంటే అటు సంస్థకు ఇటు కనిగిరి ప్రాంతానికి ఎంతో మేలు చేకూరుతుదని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర చంద్రబాబుతో విన్నవించారు. దీంతో రిలయన్స్ సంస్థ అంగీకారంతో పాటు సీఎం చంద్రబాబు సహకారంతో పీసీపల్లి మండలంలో దాదాపు 12వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి అందులో రిలయన్స్ ఇంటిగ్రేటెడ్ బయోగాస్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు.
ప్లాంట్ ఏర్పాటుతో రైతులకు మేలు
ప్లాంట్ ఏర్పాటు చేస్తే కనిగిరి ప్రాంతంలోని బీడు భూములు కూడా పరోక్షంగా వినియోగంలోకి వస్తాయి. బీడు భూముల్లో సైతం గడ్డిని పెంచి ఆయా గడ్డిని ప్లాంట్‌కు ఇచ్చే ఏర్పాట్లపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. దీంతో రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరనుంది.
శరవేగంగా భూమి పూజకు పనులు
ప్లాంట్ నిర్మాణానికి ఏప్రిల్ 2న శంకుస్థాపన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం మూడు భాగాలుగా ఆయా భూమిని విభజించి ఎక్స్‌కవేటర్లతో చదును చేస్తున్నారు. జంగిల్ క్లియరెన్స్‌కూడా చేస్తున్నారు. ఆ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం కోసం మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవచూపి విద్యుత్ అధికారులను అప్రమత్తం చేసి ఆ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆ శాఖాధికారులను ఆదేశించారు.