Share News

వైభవంగా ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:39 PM

శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల శుక్రవారం దర్శి పట్టణంలో వైభవంగా జరిగింది. వేదపండితులు స్వామి వారికి తెల్లవారుజాము నుంచి అభిషేకం, లక్ష తమలార్చన చేశారు.

వైభవంగా ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల
టీడీపీ, జనసేన ఏర్పాటు చేసిన విద్యుత్‌ ప్రభలు

పూజలు చేసిన పలువురు ప్రముఖులు

దర్శి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల శుక్రవారం దర్శి పట్టణంలో వైభవంగా జరిగింది. వేదపండితులు స్వామి వారికి తెల్లవారుజాము నుంచి అభిషేకం, లక్ష తమలార్చన చేశారు. మహిళలు పొంగళ్లు పొంగించి స్వామికి నైవేధ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్యలు పూజలు నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సూచనల మేరకు ట్రస్టు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఇతర సేవా సంస్థలు అన్నదానం, మజ్జిగ, స్వీట్లు పంపిణీ చేశారు. మొత్తం మూడు విద్యుత్‌ ప్రభలను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఆవరణలో టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో విధ్యుత్‌ ప్రభలు ఏర్పాటు చేయగా అద్దంకి రోడ్డులో వైసీపీ తరఫున విద్యుత్‌ ప్రభను ఏర్పాటు చేశారు. వీటిపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా గుడిలో జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు ఆమెకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌, టీడీపీ నాయకుడు డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, తహసీల్దార్‌ ఎం శ్రావణ్‌కుమార్‌, డీఎస్పీ లక్ష్మీనారాయణలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజాకార్యక్రమంలో సీఐలు వై రామారావు, రాఘవేంద్ర, డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, ఆర్‌ఐ పరిటాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:39 PM