రీసర్వే పటిష్ట అమలుకు చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:32 PM
క్షేత్ర స్థాయిలో రీ సర్వే ప్రక్రియను పటిష్టంగా అమలు జరిగేలా రెవెన్యూ అధికారులు, మండల సర్వేయర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు.

జేసీ గోపాలకృష్ణ ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : క్షేత్ర స్థాయిలో రీ సర్వే ప్రక్రియను పటిష్టంగా అమలు జరిగేలా రెవెన్యూ అధికారులు, మండల సర్వేయర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని మీకోసం కార్యక్రమం హాలులో బుధవారం రీసర్వే, పీజీఆర్‌ఎస్, పలు రెవెన్యూ అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్లు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, డిప్యూటీ తహసీల్దార్లతో జరిగిన సమావేశంలో జేసీ మాట్లాడారు. రీసర్వే పటిష్టంగా జరిగితే భూ సమస్యలు తగ్గుతాయన్నారు. గ్రామ సర్వేలో హద్దుల గుర్తింపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. భూ యజమానికి ముందుగా రీ సర్వే గురించి తెలియజేయాలన్నారు. సర్వేలో తప్పులు లేకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు కింద జిల్లాలోని 38 మండలాల్లో 38 గ్రామాలను పైలెట్ గ్రామాలుగా ఎంపిక చేసుకొని సర్వేను ప్రారంభించినట్లు తెలిపారు. రీసర్వేపై ప్రతి గ్రామంలో అవగాహన ర్యాలీలు, గ్రామసభలు నిర్వహించాలన్నారు. పీజీఆర్‌ఎ్‌సలో వచ్చిన వినతులపై సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో ఆ సమస్యను పరిశీలించి అర్జీదారుడితో మాట్లాడి పరిష్కరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్‌కలెక్టర్ వెంకటత్రివినాగ్, జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేషు, ఒంగోలు, కనిగిరి ఆర్డీవోలు లక్ష్మీప్రసన్న, కేశవర్తనరెడ్డి, సర్వే అధికారి గౌస్‌బాషా పాల్గొన్నారు.