కచ్చితమైన గణాంకాలేవీ?
ABN , Publish Date - Mar 23 , 2025 | 11:34 PM
Accurate Statistics ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047లో భాగంగా పీ4(ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం) ద్వారా ఆంరఽధాను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ధృడ సంకల్పంతో ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా పీ4 సర్వే చేస్తోంది.

జిల్లాలో ఏఎస్‌వో పోస్టులు సగానికిపైగా ఖాళీ
30 మండలాలకుగానూ ఉన్నది 14 మందే
పీ-4 సర్వేలో వారే కీలకం
ఔట్‌సోర్సింగ్ విధానంలోనైనా భర్తీ చేయాలని డిమాండ్
శ్రీకాకుళం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047లో భాగంగా పీ4(ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం) ద్వారా ఆంరఽధాను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ధృడ సంకల్పంతో ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా పీ4 సర్వే చేస్తోంది. ప్రణాళిక శాఖకు చెందిన ఉప గణాంకాధికారులు, సహాయ గణాంకాధికారులు క్షేత్రస్థాయిలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ప్రస్తుతం ఐదుగురు ఉద్యోగులను సచివాలయాల నుంచి డిప్యూటేషన్‌పై తీసుకుని నియోజకవర్గ విజన్‌ప్లాన్‌లు తయారీకి సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కోసం కమిటీలు కూడా వేశారు. కాగా.. మండల స్థాయిలో డేటా క్రోడీకరించేది ఒకే ఒక ఉద్యోగి ‘సహాయ గణాంకాధికారి(ఏఎస్‌వో)’ మాత్రమే. వీరు అందించే సమాచారం చాలా కీలకం. కాగా ఇటువంటి కీలక పోస్టులు రాష్ట్రంలో సుమారు 285 ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో ముప్పై మండలాలకు కేవలం 14 మంది ఏఎస్‌వోలు మాత్రమే పనిచేస్తున్నారు. అంటే సగం మంది కూడా లేకపోవడంతో పనిభారం పెరుగుతోందని, కచ్చితమైన గణాంకాలు లభించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించే ఏఎస్‌వో.. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఆదేశాలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వహించాలి. రెవెన్యూ వర్షమాపిని ద్వారా సంగ్రహించిన వర్షపాతం వివరాలను ప్రతిరోజు ఉదయం 8.30 గంటలకు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో స్థూల ఉత్పత్తిని లెక్కించేందుకు ప్రైమరీ సెక్టార్(వ్యవసాయం), ఇండస్ట్రీయల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్‌ల నుంచి డేటాని సేకరించడం వీరి ముఖ్య విధి. వీటితోపాటు జనాభాగణన, కేంద్ర సంస్థ ఎన్‌ఎస్‌ఎస్‌వో(జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్)కి అనుబంధంగా రాష్ట్రంలో సామాజిక ఆర్థిక గణన, పారిశ్రామిక సర్వేలు చేయాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల జీవనప్రమాణాలపై, సంక్షేమ పఽథకాల లబ్ధిదారుల అభిప్రాయాలపైనా సర్వేలు చేస్తారు. పంటల బీమాకు సంబంధించి పంటకోత ప్రయోగాలు మండల వ్యవసాయ అధికారితో కలిసి పర్యవేక్షిస్తారు. అవకతవకలకు వీలులేకుండా పంటకోత ప్రయోగాలు, దిగుబడి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుంటారు. కాగా ఈ పోస్టులు.. ఏళ్ల తరబడి ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. ప్రతి ఏఎస్‌వోకి అదనపు మండలాల బాధ్యతలు ఉండటం వల్ల పనిభారంతో కచ్చితమైన గణాంకాలు సకాలంలో ప్రభుత్వానికి అందజేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. కచ్చితమైన గణాంకాలు లేకపోవడం వల్ల ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా నిజమైన పేదవారికి అవి అందక ఎప్పటికీ పేదరికం తగ్గదు. గ్రామస్థాయిలో కచ్చితమైన గణాంకాల సమాచారాన్ని విశ్లేషణ చేసి.. ప్రణాళికలు తయారుచేస్తే కొన్నేళ్లలో పేదరికాన్ని ఎనభై శాతం తగ్గించేందుకు అవకాశముంటుంది. తద్వారా ప్రభుత్వ లక్ష్యం.. ఆశయం నెరవేరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైనా గ్రూప్ 2 అధికారి హోదాలో చేరినా తమకు పదోన్నతి కల్పించడం లేదని ఏఎస్‌వో ఆవేదన చెందుతున్నారు. అదనపు పనిభారంతో అవస్థలు పడుతున్నామని, ఖాళీ పోస్టులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలోనైనా భర్తీ చేయాలని కోరుతున్నారు. సచివాలయంలో మిగులు ఉద్యోగులను ఏఎస్‌వోలకు సహాయకులుగా నియమించి గ్రామస్థాయిలో ప్రణాళిక శాఖను పటిష్ఠం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.