Betting: పేటలో బెట్టింగ్‌లు
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:09 AM
online games ఐపీఎల్ సీజన్ వేళ.. నరసన్నపేటలో జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. పదేళ్లుగా ఈ వ్యవహారంలో ఆరితేరిన ఫకీరులు.. ధనవంతులు, వ్యాపారుల బిడ్డలను టార్గెట్ చేస్తున్నారు. వారిని ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ ఊబిలోకి దించుతున్నారు.

ఆన్‌లైన్ గేమ్‌లో రూ.30లక్షలు పొగొట్టుకున్న బీటెక్ విద్యార్థి
రోదిస్తున్న తల్లిదండ్రులు
మాయల ఫకీరుల వలలో ఎందరో బాధితులు
మూడేళ్ల కిందట నరసన్నపేటలో ఇందిరానగర్‌కు చెందిన ఇద్దరు వ్యాపారులు బెట్టింగ్‌లకు పాల్పడి.. సుమారు రూ.40లక్షలు చొప్పున పోగొట్టుకున్నారు. ఇందులో ఒక వ్యాపారి జమ్ము వద్ద విలువైన స్థలాన్ని అమ్మి కొంతమేర అప్పు తీర్చాడు.
తాజాగా పెద్దపేటకు చెందిన ఒక వ్యాపారి కుమారుడు.. బీటెక్ విద్యార్థి ఆన్‌లైన్ గేమ్‌లు, బెట్టింగ్‌ల్లో సుమారు రూ.30లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంకా డబ్బులు కావాలని.. లేదంటే చనిపోతానని బెదిరించడంతో ఆ తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇలా ఎంతోమంది వ్యాపారులు, యువత ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లకు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. ఎస్పీ ఆరా తీస్తున్నారు.
నరసన్నపేట, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఐపీఎల్ సీజన్ వేళ.. నరసన్నపేటలో జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. పదేళ్లుగా ఈ వ్యవహారంలో ఆరితేరిన ఫకీరులు.. ధనవంతులు, వ్యాపారుల బిడ్డలను టార్గెట్ చేస్తున్నారు. వారిని ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ ఊబిలోకి దించుతున్నారు. అలా వారి మాయమాటలు నమ్మి చాలా కుటుంబాలు రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని రోడ్డున పడ్డాయి. నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానంలో ఈ బెట్టింగ్ వ్యవహారం నడిపిన ఆ మాయల ఫకీరులు.. నేడు రాష్ట్రంలో పలు పట్టణాలకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రత్యేక బృందం ద్వారా యువతతో టచ్‌లో ఉంటూ ఆన్‌లైన్‌లో కోట్లాది రూపాయల్లో బెట్టింగ్‌లు సాగిస్తున్నారు. క్రికెట్ సీజన్ లేని సమయంలో పేకాట డన్‌లో నిర్వహిస్తారు. జిల్లాలో కాకుండా పేకాట ఆడేవారిని.. శని, ఆదివారాల్లో వాహనాల్లో బరంపురం, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు లేదా రిసార్ట్‌లకు తీసుకువెళ్లి.. అక్కడ పెద్ద మొత్తాల్లో పందేలు నిర్వహించేవారు. ఎస్పీగా మహేశ్వరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత .. ఈ వ్యవహారం నిర్వహణకు డెన్‌లను జిల్లా సరిహద్దు ప్రాంతాలకు మార్చారని సమాచారం. ఆన్‌లైన్ గేమ్స్ కాకుండా ఐపీఎల్ మ్యాచ్ ఆరంభం నుంచి పట్టణంలో జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. కొందరు కోడింగ్‌తో వాట్సాప్‌ల ద్వారా బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు. బెట్టింగ్ నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆరా..
బెట్టింగ్ ముఠాపై చర్యలు తీసుకోవాలంటూ నరసన్నపేటకు చెందిన టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగపు కార్యదర్శి జామి వెంకటరావు.. సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులను కోరారు. ‘నరసన్నపేటలోని పెద్దపేటలో ఒక బెట్టింగ్ ముఠా బారిన పడి ఓ బీటెక్ ఇంజనీరింగ్ విద్యార్థి సుమారు రూ.50లక్షలు పోగొట్టుకున్నాడు. ఇప్పటికీ డబ్బులు కావాలని తల్లిదండ్రులను బ్లాక్‌మెయిల్ చేస్తూ బాధపడుతున్నాడు. మీరు పెద్ద మనసుతో ఈ విషయమై చర్యలు తీసుకోవాల’ని విజ్ఞప్తి చేశారు. దీంతో జిల్లా టాస్క్‌ఫోర్స్ సభ్యులు ఆ విద్యార్థి తండ్రిని వాకబు చేశారు. తమ కుమారుడు బెట్టింగ్‌లకు పాల్పడి రూ.30లక్షల వరకూ పోగొట్టుకున్నాడని ఆయన తెలిపారు. కాగా.. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి గురువారం నరసన్నపేటలో పర్యటించారు. పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సీఐ, ఎస్‌ఐలతో చర్చించి.. బెట్టింగ్‌ల వ్యవహారంపై ఆరా తీశారు. సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఆదేశించినట్టు తెలిసింది.