coconut: కొబ్బరిపై తెగుళ్ల పంజా
ABN , Publish Date - Mar 23 , 2025 | 11:38 PM
Coconut Damage ఉద్దానం.. కొబ్బరి పంటకు ప్రసిద్ధి. నాణ్యమైన కాయలు దిగుబడికి పెట్టింది పేరు. అలాంటి కొబ్బరిపై ఇప్పుడు తెగుళ్లు పంజా విసురుతున్నాయి.

తెల్లదోమ, నల్లముట్టి దాడితో దెబ్బతింటున్న చెట్లు
మొక్క దశలోనే ఆశిస్తున్న కాండం తొలుచు పురుగు
రైతులకు తప్పని నష్టాలు
నివారణ చర్యల కోసం అధికారులకు విన్నపం
కవిటి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఉద్దానం.. కొబ్బరి పంటకు ప్రసిద్ధి. నాణ్యమైన కాయలు దిగుబడికి పెట్టింది పేరు. అలాంటి కొబ్బరిపై ఇప్పుడు తెగుళ్లు పంజా విసురుతున్నాయి. వాటి దాడితో అధిక చెట్లు నాశనమవుతున్నాయి. పచ్చని కొమ్మలు ఎండిపోతున్నాయి. ఫలితంగా దిగుబడి తగ్గి రైతులకు నష్టాలను మిగులుస్తోంది. కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట మండలాల్లో 32వేల ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి తోటలు ఉన్నాయి. అయితే వరుస తుఫాన్ల కారణంగా కొబ్బరి ఏదో ఒక తెగులు బారిన పడుతోంది. 1999లో ఏర్పడిన తుఫాన్ అనంతరం ఎర్రనల్లి సోకి కాయపరిమాణం, నాణ్యతను దిగజార్చింది. తరువాత రైతులు కొంతమేర కోలుకుంటుండగా 2018లో తితలీ తుఫాన్ తాకిడితో వారి బతుకు చిన్నాభిన్నమైంది. వేల చెట్లు నేలకొరిగాయి. మిగిలి ఉన్న చెట్లు ప్రస్తుతం ఆశిస్తున్న తెగుళ్లతో దెబ్బతింటున్నాయి.
తెల్లదోమ..
కవిటి, కంచిలి మండలాల్లో కొబ్బరి పంటను తెల్లదోమ నాశనం చేస్తోంది. ఉదయం పూట తోటల్లోకి వెళితే తెల్లదోమ విజృంభణ అధికంగా ఉంటుంది. పచ్చని కొబ్బరికమ్మలకు దిగువ భాగంలో గూడు కట్టుకొని ఉంటున్నాయి. అడుగు భాగంలో తెల్లని నూలుపోగు లాంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తున్నాయి. దీనిపై నల్లని శిలీంధ్రం సోకడంతో కొమ్మల్లో పచ్చదనాన్ని పీల్చేస్తున్నాయి. దీంతో కొన్ని రోజులకు కొమ్మలు ఎండిపోతున్నాయి. కొబ్బరితో పాటు ఆకుకూరల పంటలు, మర్రి, రావిచెట్లకు సైతం తెల్లదోమ సోకినట్లు రైతులు చెబుతున్నారు. జిల్లాలో మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా తెల్లదోమ ఆశించిందని, ఎండల తీవ్రతతో దాని ఉధృతి మరింతగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గూగోసి దోమగా పిలిచే దీనిని 2016లో కేరళ రాష్ట్రంలో తొలుత కనుగొన్నట్లు తెలిపారు. ఆ తర్వాత తమిళనాడు, మన రాష్ట్రంలోని కోనసీమ ప్రాంతంలో వాటి ప్రభావం కనిపించిందని, ప్రస్తుతం కవిటి, కంచిలి మండలాల్లో ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
నల్లముట్టి..
నల్లముట్టి తెగులు కొబ్బరి చెట్టులో పచ్చదనాన్ని హరిస్తుంటుంది. చెట్ల కొమ్మలు ఎండిపోయి ఈనెలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఈ తెగులు సోకితే పంట దిగుబడి తగ్గిపోతుంది. 1988-89లో కవిటి మండలంలోని మాణిక్యపురం, బల్లిపుట్టుగ, కుసుంపురం గ్రామాల్లోని తోటలకు నల్లముట్టి తెగులు సోకి చెట్లను నాశనం చేసింది. ఆ తర్వాత ఉద్దానం మొత్తం వ్యాపించడంతో రైతులు కొంతమేర నష్టపోయారు. తర్వాత వర్షాలు అధికంగా కురవడంతో దశలవారీగా దాని ఉధృతి తగ్గింది. ప్రస్తుతం కంచిలి మండలంలోని శ్రీరాంపురం, మఖరాంపురం, కొజ్జిరియా, సాలినపుట్టుగ తదితర గ్రామాల్లోని కొబ్బరితోటలకు నల్లమట్టి తెగులు ఆశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాండం తొలుచు పురుగు..
కొబ్బరి రైతులను భయపెడుతున్న మరో తెగులు కాండం తొలుచు పురుగు. చెట్టు కాండాన్ని తొలచి తియ్యని పదార్థాన్ని తినివేసే కొమ్ము, ఎర్రముక్కు పురుగుల ఉధృతి ప్రస్తుతం అధికంగా ఉంది. మొక్క పెరిగే దశలోనే కాండంపై నుంచి ఆశించి లోపలి భాగాన్ని తినివేస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ పురుగుల నివారణ సాధ్యం కావడం లేదని రైతులు చెబుతున్నారు. కొబ్బరి మొక్క నాటిన నుంచి పదేళ్లు దాటితే కానీ పంట దిగుబడి రాదు. అయితే, ఈ ప్రాంత ఇసుక నేలలు కావడంతో ఈ పురుగులు ఇసుకలోనే గోతులు చేసుకొని ఉంటున్నాయి. ఒక మొక్క నుంచి మరోక మొక్కకు ఆశించి నాశనం చేస్తున్నాయి. దీంతో మొక్కల సంరక్షణ భారంగా మారిందని రైతులు వాపోతున్నారు.
అధికారులు స్పందించాలి
కొబ్బరి పంటే మాకు ప్రధాన ఆదాయ వనరు. ప్రస్తుతం ఉద్దానంలో కొబ్బరి పంటకు వివిధ తెగుళ్లు ఆశించాయి. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొబ్బరి పంట కనుమరుగయ్యే అవకాశం ఉంది. అధికారులు స్పందించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలి.
- ఎ.త్రివిక్రమరావు, కొబ్బరి రైతు, కవిటి
...................
సామూహిక సస్యరక్షణ చేపట్టాలి
కొబ్బరి తోటల్లో తెగుళ్ల నివారణకు రైతులు సామూహిక సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తెల్లదోమ నివారణకు పసుపు అట్టలను చెట్లకు కట్టాలి. వేపనూనె పిచికారీ చేయాలి. రసాయన మందులు మాత్రం పిచికారీ చేయకూడదు. కాండం తొలుచుపురుగు ఆశిస్తే.. చెట్టు మొదలులో ఏర్పడిన రంధ్రం ద్వారా సన్నని ఇనుప సూదిని గుచ్చి పురుగును చంపాలి. ఆ తర్వాత సెవిడాల్ 8జీ అనే మందు పొడిని ఇసుకలో కలిపి రంధ్రాలను కప్పివేయాలి.
పి.మాధవీలత, ఉద్యానవనశాఖాధికారి, కవిటి