Share News

Exam cheating: ‘చూచి’తిరా.. వైఫల్యం!

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:57 PM

Cheating in examinations జిల్లాలో విద్యాశాఖ పనితీరు అపహాస్యంగా మారింది. పదోతరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత, ట్రిపుల్‌ ఐటీ ర్యాంకుల కోసం అడ్డదారులు తొక్కుతుండడం విస్తుగొలుపుతోంది. ముఖ్యంగా విద్యార్థుల భవితను తీర్చిదిద్దాల్సిన కొందరు ఉపాధ్యాయులే ఈ అడ్డగోలు వ్యవహారానికి వత్తాసు పలకడం సిగ్గుచేటు.

Exam cheating: ‘చూచి’తిరా.. వైఫల్యం!
కుప్పిలి మోడల్‌ స్కూల్‌ ఇదే

  • పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్‌

  • ఉపాధ్యాయులే సహకరిస్తున్న వైనం

  • కొంతమంది తీరుతో విద్యాశాఖకు అప్రతిష్ఠ

  • విద్యార్థుల భవితకు తప్పని ముప్పు

  • పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయండి. ఎక్కడా లోపాలు వెలుగుచూడనివ్వొద్దు. చీఫ్‌ సూపరింటెండెంట్‌ మినహా ఎవరి సెల్‌ఫోన్లు కేంద్రాలకు అనుమతించవద్దు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించండి. సోషల్‌ మీడియాలో పేపర్‌ లీకేజీ అంటూ ప్రచారం చేసేవారిపై నిఘా పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి తలవంపులు తీసుకొచ్చే ఏ చర్యను ప్రోత్సహించవద్దు.

  • - ఈ నెల 12న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అధికారులకు చేసిన ఆదేశాలివి.

  • ...................

  • - ఈ నెల 21న ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్‌ స్కూల్‌ పరీక్ష కేంద్రంలో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులు డిబార్‌ అయ్యారు. సుమారు 400 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్న ఈ కేంద్రంలో పెద్దఎత్తున చూచిరాతలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు నాలుగు స్వ్కాడ్‌ బృందాలు శుక్రవారం తనిఖీలు చేపట్టాయి. అయితే అక్కడ ఉపాధ్యాయులే మాస్‌ కాపీయింగ్‌కు సూత్రధారులని తేలింది. దీంతో ప్రభుత్వం 15మంది ఉపాధ్యాయులపై సస్సెన్షన్‌ వేటు వేసింది.

  • ......................

  • - ఈ నెల 19న రణస్థలం మండలం పైడిభీమవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాలు చోరీకి గురయ్యాయి. ఇక్కడ 17 గదుల్లో పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా నిఘా కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే బుధవారం హిందీ పరీక్ష పూర్తయిన తర్వాత 13 సీసీ కెమెరాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో చీఫ్‌ సూపరింటెండెంట్‌ జగన్నాథరావు జే.ఆర్‌.పురం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

  • ......................

  • రణస్థలం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యాశాఖ పనితీరు అపహాస్యంగా మారింది. పదోతరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత, ట్రిపుల్‌ ఐటీ ర్యాంకుల కోసం అడ్డదారులు తొక్కుతుండడం విస్తుగొలుపుతోంది. ముఖ్యంగా విద్యార్థుల భవితను తీర్చిదిద్దాల్సిన కొందరు ఉపాధ్యాయులే ఈ అడ్డగోలు వ్యవహారానికి వత్తాసు పలకడం సిగ్గుచేటు. జిల్లాలోని కుప్పిలిలో చూసిరాతలు, పైడిభీమవరంలో సీసీ కెమెరాల చోరీ ఘటనలు విద్యావ్యవస్థకు మాయని మచ్చగా నిలిచాయి. వంద రోజుల ప్రణాళిక అంటూ విద్యాశాఖ అధికారులు కార్యాచరణ ప్రారంభించి.. తీరా పరీక్షల సమయానికి తుస్సు మనిపించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భవితకు ముప్పు తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

  • పకడ్బందీ ఏర్పాట్లు చేసినా..

  • జిల్లావ్యాప్తంగా 149 కేంద్రాల్లో ఈ నెల 17 నుంచి పదోతరగతి పరీక్షలు జరుగుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పేపర్‌ లీకేజీ, మాస్‌ కాపీయింగ్‌ నివారణపై ముందుగానే దృష్టి పెట్టింది. కలెక్టర్లు, ఎస్పీలు, డీఈవోలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు అధికారులు సమస్యాత్మక కేంద్రాలు, అనుమానిత కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో కంట్రోల్‌రూమ్‌ సైతం ఏర్పాటు చేశారు. 149 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 149 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులు, 2400 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. జిల్లా వ్యాప్తంగా 28,984 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఏర్పాట్ల పరంగా ఇబ్బందులు లేకున్నా.. ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో చూచిరాతల ఘటన మాత్రం యావత్‌ జిల్లా విద్యాశాఖ, ఉపాధ్యాయవర్గాన్ని తలదించుకునేలా చేసింది. ట్రిపుల్‌ ఐటీలో సీట్ల కోసమే ఈ ఘటనకు ప్రోత్సహించారనే వాదన వినిపిస్తోంది.

  • ట్రిపుల్‌ ఐటీ ఎంపిక కోసమే..

  • గత ఏడాది జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 93.35 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది కూడా అటువంటి మెరుగైన ఫలితాలు వస్తాయని విద్యాశాఖ అధికారులు అంచనా వేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పదోతరగతి ఫలితాల్లో మార్కులు ఎక్కువగా తెచ్చుకుంటే ట్రిపుల్‌ ఐటీలో ఇంజనీరింగ్‌ సీటు ఉచితంగా దొరికే అవకాశం ఉంటుంది. దీంతో ఎక్కువ మంది ట్రిపుల్‌ ఐటీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఏపీలో 4 ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ల్లో 4 వేల సీట్లను భర్తీ చేస్తారు. అయితే లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. ఈ నేపథ్యంలో పదో తరగతిలో ఎక్కువ మార్కులు పొందేందుకు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.

  • కుప్పిలి కాపీయింగ్‌లో ఆరుగురిపై కేసు నమోదు

  • కుప్పిలి మోడల్‌ స్కూల్‌లో జరిగిన పదో తరగతి పరీక్షల వ్యవహారంలో ఆరుగురిపై కేసు నమోదు చేశామని ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఇంగ్లిష్‌ పరీక్ష జరుగుతుండగా.. డీఈవో ఎస్‌.తిరుమల చైతన్య ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఆకస్మిక తనిఖీ నిర్వహించి చూచిరాతలకు ప్రోత్సహించిన 15 మందిపై సస్పెన్షన్‌ వేటు విధించారు. ఈ సంఘటనపై డీఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయులు ఎం.కనకరాజు(ఎస్‌ఏ ఇంగ్లిష్‌, బుడగట్లపాలెం), ఎస్‌.కృష్ణ(ఎస్‌ఏ హిందీ, కొయ్యాం), పి.నాగేశ్వరరావు (ఎస్‌ఏ మేథ్స్‌, కుప్పిలి), కె.కామేశ్వరరావు (ఎస్‌ఏ, హిందీ, కుప్పిలి), జె.పద్మకుమారి (హెచ్‌ఎం, జడ్పీహెచ్‌ఎస్‌, కుప్పిలి), బి.కృష్ణ కిశోర్‌ (బోధనేతర సిబ్బంది, కుప్పిలి)పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. వీరిపై ఛీటింగ్‌, మాల్‌ప్రాక్టీస్‌ 318/4, 61/2, 3/5, 97,98 తదితర సెక్షన్లను నమోదు చేశామన్నారు. కేసు దర్యాప్తులో మరికొన్ని పేర్లు చేరే అవకాశం ఉందన్నారు.

  • కొన్నేళ్లుగా ఈ కేంద్రంలో పరీక్షల నిర్వహణపై విమర్శలు ఉన్నాయి. ఉపాధ్యాయులే స్వయంగా మాల్‌ప్రాక్టీస్‌కు సహకరించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు నివ్వెరపోతున్నారు. ఇలాంటి సంఘటనల వల్ల కష్టపడి చదివిన విద్యార్థుల భవిత ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. మోడల్‌ స్కూల్‌లో పరీక్ష జరుగుతుండడగా, ఇక్కడికి సమీపంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో స్లిప్పులు తయారుచేశారని డీఈవో తనిఖీలో వెల్లడైంది. ఇలాంటి కేంద్రాలు జిల్లాలో మరికొన్ని ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కుప్పిలి వ్యవహారంపై విద్యాశాఖ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ లియాఖత్‌ ఆలీఖాన్‌ రంగంలోకి దిగినట్టు విద్యాశాఖ వర్గాల ద్వారా తెలిసింది.

  • నాణ్యమైన ఫలితాల కోసం కృషి

  • పదో తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. వంద రోజుల ప్రణాళికను అమలు చేశాం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాం. నాణ్యమైన ఫలితాల కోసం కృషి చేస్తున్నాం. కానీ ఇంతలోనే కుప్పిలి కేంద్రంలో చూచిరాతలు బయటపడ్డాయి. మాస్‌కాపీయింగ్‌కు సహకరించిన వారిపై చట్టపరమైనచర్యలు ఉంటాయి. ఉపాధ్యాయులు, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి.

    - తిరుమల చైతన్య, డీఈవో, శ్రీకాకుళం

Updated Date - Mar 22 , 2025 | 11:57 PM