isuka: అనధికారికంగా ఇసుక ర్యాంపు
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:45 PM
Unofficial sand ramp అక్కడ ఇసుక తరలింపు, స్టాక్ పాయింట్‌కు ప్రభుత్వ అనుమతులు లేవు. కానీ అధికారుల కళ్లుగప్పి.. ర్యాంప్‌ను అక్రమంగా నిర్వహిస్తూ ఇసుకను ఒడిశా ప్రాంతాలకు తరలించి అక్రమ వ్యాపారులు దోచుకుంటున్నారు.

భారీగా ఒడిశాకు నిల్వలు తరలింపు
పట్టించుకోని అధికారులు
కొత్తూరు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): అక్కడ ఇసుక తరలింపు, స్టాక్ పాయింట్‌కు ప్రభుత్వ అనుమతులు లేవు. కానీ అధికారుల కళ్లుగప్పి.. ర్యాంప్‌ను అక్రమంగా నిర్వహిస్తూ ఇసుకను ఒడిశా ప్రాంతాలకు తరలించి అక్రమ వ్యాపారులు దోచుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కొత్తూరు మండలంలో నివగాం, ఆకులతంపరలో మాత్రమే ఇసుక ర్యాంపు, స్టాక్‌పాయింట్‌కు ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ మండలంలోని పొనుటూరు, బంకి, రాయల కొండల ప్రాంతంలో వంశధార నది నుంచి ఇసుకను యంత్రాలతో రాత్రివేళ తవ్వి ట్రాక్టర్లు, లారీల్లో లోడ్ చేస్తున్నారు. బండి కొండల ప్రాంతంలో స్టాక్‌పాయింట్‌ను అనధికారికంగా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఒడిశాకు రోజూ పదుల సంఖ్యల లారీలు, ట్రాక్టర్లల్లో ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆంధ్రా నుంచి ఒడిశాకు ఇసుక తరలించరాదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. దిమిలి, రాయల, మాకవరం, పొనుటూరు గ్రామాలకు చెందిన కొంతమంది ఈ ఇసుక దందాను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇసుక అక్రమాలు తెలిసినా.. రెవెన్యూ అధికారులు, పొనుటూరు సచివాలయ సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై కొత్తూరు తహసీల్దార్ రవిచంద్ర వద్ద ప్రస్తావించగా అక్రమ స్టాక్ పాయింట్ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇసుక పాయింట్‌ను సీజ్ చేసి, అక్రమార్కులపై కేసులు నమోదుకు సిఫారసు చేస్తామని తెలిపారు.