Share News

శారద నదికి తూట్లు

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:17 AM

మండలంలోని కొత్తపల్లి వద్ద ఉన్న శారదా నదిలో భారీఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. నది గట్టుకు అతి చేరువలో పది అడుగుల లోతు మేర ఇసుక తవ్వేయడంతో ప్రమాదం పొంచి వుంది. వర్షాకాలంలో నదిలో వరద ఉధృతి అధికంగా వుంటే గట్టు కోతకు గురై గండిపడి అవకాశం వుంది.

శారద నదికి తూట్లు
కొత్తపల్లి వద్ద శారదా నది గట్టును ఆనుకొని భారీఎత్తున చేపట్టిన ఇసుక తవ్వకాలు

కొత్తపల్లి వద్ద భారీగా ఇసుక తవ్వకాలు

గట్టుకు సమీపంలో పెద్ద పెద్ద గోతులు

వర్షాకాలంలో గండ్లు పడే ప్రమాదం

ఇసుక అక్రమార్కులకు స్థానిక ఉద్యోగుల అండదండలు

కశింకోట, మార్చి 27 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని కొత్తపల్లి వద్ద ఉన్న శారదా నదిలో భారీఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. నది గట్టుకు అతి చేరువలో పది అడుగుల లోతు మేర ఇసుక తవ్వేయడంతో ప్రమాదం పొంచి వుంది. వర్షాకాలంలో నదిలో వరద ఉధృతి అధికంగా వుంటే గట్టు కోతకు గురై గండిపడి అవకాశం వుంది.

సొంతంగా ఇళ్లు నిర్మించుకునేవారు గ్రామాలకు సమీపంలోని నదులు, గెడ్డలు, వాగుల్లో నుంచి ఇసుక తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు విధించింది. స్థానిక సచివాలయంలో అనుమతి తీసుకుని, 24 గంటల్లో నిర్ణీత మొత్తంలో ఇసుక తీసుకెళ్లాలి. ఇసుక తవ్వకాలకు యంత్రాలను వినియోగించకూడదు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా మాత్రమే ఇసుక తీసుకెళ్లాలి. కానీ మండలంలోని కొత్తపల్లి వద్ద శారదా నదిలో ఇసుక అక్రమంగా తవ్వుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. యంత్రాల సాయంతో పది అడుగులకుపైగా లోతు తవ్వేస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా సమీపంలోని తేగాడ గ్రామంలో పలుచోట్ల నిల్వవ చేస్తున్నారు. ఇక్కడి నుంచి చుట్టుపక్కల గ్రామాలకు రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. దూరాన్ని బట్టి ట్రాక్టర్‌ ఇసుకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు అమ్ముతున్నారు. నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరపడం వల్ల గట్లు బలహీనంగా మారతాయని, భారీ గోతులు ప్రమాదకరంగా తయారవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇసుక కోసం తవ్విన గోతులు మునిగి చిన్నారులు మృతిచెందిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

స్థానిక ఉద్యోగుల అండదండలు

కొత్తపల్లి వద్ద శారదా నదిలో ఇసుక తవ్వకాలు స్థానిక ప్రభుత్వ ఉద్యోగులకు తెలిసే జరుగుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీఆర్‌వో, సచివాలయ సిబ్బంది, పంచాయతీ అధికారుల కళ్ల ముందే, పట్టపగలు ఇసుక తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోలేదంటే ముడుపులు బాగానే అందుతున్నాయని ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌, మైనింగ్‌ అధికారులు వెంటనే స్పందించి కొత్తపల్లి వద్ద శారదా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:17 AM