క్యాంపు రాజకీయాఆలు
ABN , Publish Date - Mar 25 , 2025 | 02:00 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీస్ అందజేయడంతో రాజకీయం వేడెక్కింది.

మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి కూటమి నోటీస్ ఇవ్వడంతో బెంగళూరుకు కార్పొరేటర్లు తరలింపు
కుటుంబాలతో సహా వెళ్లిన 28 మంది...
కూటమి కార్పొరేటర్లకు వైసీపీ నేతల గాలం
కూటమి నేతల మల్లగుల్లాలు
29న బడ్జెట్ సమావేశం అనంతరం తమ కార్పొరేటర్లను ఎక్కడికైనా తరలించాలని యోచన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీస్ అందజేయడంతో రాజకీయం వేడెక్కింది. ఇరువర్గాలూ కార్పొరేటర్లను కాపాడుకునే పనిలో పడ్డాయి. అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు ఇన్‌చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఇంకా తేదీని నిర్ణయించకముందే వైసీపీ నేతలు తమ పార్టీ కార్పొరేటర్లను బెంగళూరు తరలించేశారు.
నాలుగేళ్ల కిందట జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక వార్డులను గెలుచుకోవడంతో 11వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన గొలగాని హరివెంకటకుమారి మేయర్ అయ్యారు. అయితే గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో కూటమి అధికారం చేజిక్కించుకోవడంతో జీవీఎంసీలో బలాబలాలు మారిపోయాయి. వైసీపీ ఆధిక్యం తగ్గిపోయి, కూటమి మెజారిటీ పెరిగింది. ఈ నేపథ్యంలో మేయర్ హరివెంకటకుమారిపై అవిశ్వాసం తీర్మానానికి కూటమికి చెందిన 70 మంది కార్పొరేటర్లు ఈనెల 22న జిల్లా కలెక్టర్‌కు నోటీస్ అందజేశారు. నోటీస్‌లో ఉన్న కార్పొరేటర్ల సంతకాలను వెరిఫై చేసి తనకు నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ జీవీఎంసీ కార్యదర్శిని ఆదేశించారు. ఆయన నోటీస్‌లో సంతకాలు చేసిన కార్పొరేటర్లతో మాట్లాడి, అవి వారే చేసినట్టు నిర్ధారించుకున్నారు. దీనిపై కలెక్టర్‌కు మంగళవారం నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అమరావతిలో మంగళవారం నుంచి రెండు రోజులపాటు జిల్లా కలెక్టర్ల సమావేశం ఉండడంతో ఆయన అందుబాటులో లేరు. కలెక్టర్ తిరిగి నగరానికి వచ్చిన తర్వాత నివేదికను అందజేస్తే, అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ సమావేశం ఎప్పుడు చేయాలనేది తేదీని నిర్ణయిస్తారు. సమావేశం నిర్వహించాలనుకున్న రోజుకు కనీసం 15 రోజులు ముందు కార్పొరేటర్లకు సమాచారం అందజేయాల్సి ఉంటుంది. దీనినిబట్టి అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ సమావేశం జరగాలంటే కనీసం మరో 20 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీ నేతలు తమ పార్టీ కార్పొరేటర్లను క్యాంపునకు తరలించడం చర్చనీయాంశంగా మారింది. అవిశ్వాసతీర్మానంపై సమావేశం మరో 20 రోజుల వరకు జరిగే అవకాశం లేదు. అంతేకాకుండా ఈనెల 29న బడ్జెట్ సమావేశం ఉన్నందున కార్పొరేటర్లంతా ఆ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఇప్పటి నుంచే కార్పొరేటర్లను బెంగళూరు క్యాంపునకు తరలించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఆ పార్టీ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
బెంగళూరు క్యాంప్‌కు 28 కార్పొరేటర్లు
వైసీపీ నేతలు తమ పార్టీ కార్పొరేటర్లను కూటమి వైపు ఆకర్షితులు కాకుండా ముందుజాగ్రత్తగా బెంగళూరు క్యాంపునకు రూపకల్పన చేశారు. వైసీపీకి 59 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ వారిలో సుమారు 30 మంది ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిపోయారు. మిగిలిన 29 మందిలో సోమవారం 28 మంది బెంగళూరు వెళ్లినట్టు సమాచారం. మూడు విడతల్లో విశాఖ నుంచి విమానంలో బెంగళూరు తరలించారు. కార్పొరేటర్లతోపాటు వారి కుటుంబసభ్యులు కూడా క్యాంపునకు వెళ్లడం విశేషం. ఇదిలావుండగా వైసీపీ కార్పొరేటర్లు పార్టీని వీడకుండా ఉండేందుకు భారీగా నజరానా ఇస్తామని ఆశ చూపినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా వైసీపీని వీడి కొన్నాళ్ల కిందట కూటమి పార్టీల్లో చేరిన వారిని తిరిగి వెనక్కి రప్పించుకునేందుకు నేతలు వ్యూహరచన చేస్తున్నారు. అందులోభాగంగా ముగ్గురు కార్పొరేటర్లతో సంప్రతింపులు జరుపుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో తమ కార్పొరేటర్లను కూడా బడ్జెట్ సమావేశం తరువాత ఎక్కడికైనా తరలిస్తేనే బాగుంటుందని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు.