బంపర్ ఆఫర్..!
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:07 PM
ఆస్తిపన్ను చెల్లింపుపై టీడీపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈనెల 31వ తేదీలోపు పన్ను చెల్లించనున్న సొంతింటి యజమానులకు పురపాలక శాఖ శుభవార్త తెలిపింది. పట్టణాల్లో ఆస్తి పన్ను వడ్డీపై 50 శాతం రాయితీ ఇస్తూ జీవో ఎంఎస్.46 ఎంఏ అండ్ యూడీ 25-03-2025ను మంగళవారం విడుదల చేసింది.

ఇంటి పన్ను యజమానులకు శుభవార్త
ఆస్తిపన్ను చెల్లింపుకు 50 శాతం వడ్డీ రాయితీ
ఈ నెల 31లోపు చెల్లింపులకే అవకాశం..
ఆతర్వాత వడ్డీపై వడ్డీ జిల్లాలో
సుమారు రూ.10 కోట్ల మేర లబ్ధి
ఒంగోలు, కార్పొరేషన్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : ఆస్తిపన్ను చెల్లింపుపై టీడీపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈనెల 31వ తేదీలోపు పన్ను చెల్లించనున్న సొంతింటి యజమానులకు పురపాలక శాఖ శుభవార్త తెలిపింది. పట్టణాల్లో ఆస్తి పన్ను వడ్డీపై 50 శాతం రాయితీ ఇస్తూ జీవో ఎంఎస్.46 ఎంఏ అండ్ యూడీ 25-03-2025ను మంగళవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు దీర్ఘకాలికంగా పన్నులు చెల్లించకపోవడంతో వడ్డీల భారంతో కొందరు పన్నులు చెల్లింపుకు ఆసక్తి చూపకపోవడంతో అవన్నీ కొండలా పేరుకుపోయాయి. ఈ క్రమంలో నూరుశాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా, ఆదాయ వనరులు పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం వడ్డీపై 50 శాతం రాయితీ ఇవ్వనుండటంతో జిల్లాలో సుమారు రూ.10 కోట్లు వరకు రాయితీతో గృహ యజమానులకు లబ్ధిచేకూరనుంది.
ఏ మున్సిపాలిటీలో ఎంతెంత...
ఒంగోలులో 63,702 అస్సె్‌సమెంట్‌లు ఉండగా, 49.08 కోట్లు పన్నుల రూపంలో రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రూ.10 కోట్లు వడ్డీ రావాల్సి ఉండగా, ప్రభుత్వం ప్రకటించిన రాయితీ జీవోతోరూ.5 కోట్లు వడ్డీ తగ్గనుంది. మార్కాపురంలో 17,054 అస్సె్‌సమెంట్‌లు ఉండగా, రూ.8.56 కోట్లు, దర్శి మునిసిపాలిటీలో 9,437 అస్సె్‌సమెంట్‌లు ఉండగా, రూ.5.05 కోట్లు, గిద్దలూరు మునిసిపాలిటీలో 11,554 అస్సె్‌సమెంట్‌లు ఉండగా, రూ.4.03 కోట్లు, కనిగిరి మునిసిపాలిటీలో 9,411 అస్సె్‌సమెంట్‌లు ఉండగా, రూ.4.20 కోట్లు, చీమకుర్తిలో 6,659 అస్సె్‌సమెంట్‌లు ఉండగా, రూ.3.34 కోట్లు, పొదిలి నగర పంచాయతీలో 10,806 అస్సె్‌సమెంట్‌లు ఉండగా, రూ.3.16 కోట్లు ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది
జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు, మిగిలిన మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో కలుపుకుని మొత్తం 1,28,213 అస్సె్‌సమెంట్‌లు ఉండగా, వాటికి సంబంధించి మొత్తం రూ. 77.41 కోట్లు పన్నుల రూపంలో ఆయా మునిసిపాలిటీలకు రావాల్సి ఉంది. వాటికి అదనంగా ఇప్పటి వరకు 2 శాతం వడ్డీ జమ అవుతుంది. 50 శాతం రాయితీతోజిల్లా మొత్తంలో సుమారు రూ.10 కోట్లు మేర వడ్డీ రాయితీ లభిస్తుండటంతో గృహ యజమానులకు కొంత ఊరట కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్ ఉన్న బకాయిలను చెల్లించేందుకు ఇది మంచి అవకాశం అని, గృహ యజమానులు, వ్యాపారులు, ఇండస్ట్రీ యజమానులు చెబుతున్నారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి, వీలైనంత త్వరగా ప్రజలు వినియోగించుకునేలా, నూరు శాతం వసూలు లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఏప్రిల్ 1 దాటితే వడ్డీపై వడ్డీ..
ఆస్తి పన్ను చెల్లింపుపై వడ్డీ రాయితీ ఈనెల 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంటుందని, ఇప్పటివరకు చెల్లించకుండా, గడువులోపు కూడా చెల్లించని వారికి ఏప్రిల్ 1వ తేదీ నుంచి వడ్డీపై వడ్డీ వసూలు చేస్తామని, ఒంగోలు నగర కమిషనరు కే వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ వారంలో రోజుల్లో పూర్తి పన్నులు చెల్లించిరాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తద్వారా నూరు శాతం పన్నులు వసూలు కావడంతోపాటు, కార్పొరేషన్, మునిసిపాలిటీల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.
ముందే చెల్లించిన వారికీ ఆఫర్
ఆస్తి పన్నులు చెల్లింపుపై మంగళవారం ప్రభుత్వం 50 శాతం వడ్డీ రాయితీ ప్రకటించడంతో ఇంతకుముందే చెల్లించిన వారిలో కొంత నిరాశ చోటు చేసుకునే అవకాశం ఉండటంతో ప్రభుత్వం వారికి మరో ఆఫర్ ప్రకటించింది. జీవో విడుదలకు ముందే ఒకేసారి ఆస్తి పన్ను, వడ్డీ చెల్లించిన వారికి 50 శాతం రాయితీ ప్రకటించింది. ఆ రాయితీని 2025-26 ఆర్థిక సంవత్సరం పన్నులో వడ్డీ సర్దుబాటు చేసి చెల్లించుకోవచ్చని ప్రకటించింది. దీంతో గతంలో పన్నులు చెల్లించిన వారికి, ఈనెల 31లోపు చెల్లించేవారికి ఇది మంచి అవకాశం కానుంది.
పన్నులు చెల్లింపులు ఇలా
వడ్డీ మినహాయింపుతో ఈనెల 31వ తేదీలోపు పన్నులు చెల్లింపుకు సమీపంలోని సచివాలయంలో గాని, కార్పొరేషన్, మునిసిపాలిటీలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో, ఆన్‌లైన్‌లోని సీడీఎంఏ.ఏపి.జిఓవి.ఇన్ వెబ్‌సైట్ నందు డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్/యూపీఐ ద్వారా చెల్లించవ్చని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ మొబైల్ నెంబర్ 9552300009 ద్వారా చెల్లించవ్చని నగర కమిషనరు కే వెంకటేశ్వరరావు తెలిపారు.