స్టీల్‌ప్లాంట్ మార్గంలో అదుపు తప్పిన కారు
ABN , Publish Date - Mar 21 , 2025 | 01:03 AM
స్టీల్‌ప్లాంట్ ప్రధాన మార్గంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం అక్కడ ఉన్నవారిని తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వివరాలిలా ఉన్నాయి.

రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఇద్దరికి గాయాలు
ఉక్కుటౌన్‌షిప్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంట్ ప్రధాన మార్గంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం అక్కడ ఉన్నవారిని తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన జి.రాహుల్ అనే యువకుడు కారులో కూర్మన్నపాలెం నుంచి స్టీల్‌ప్లాంట్ మార్గంలో వెళ్తుండగా కణితి జంక్షన్ వద్ద అదే మార్గంలో ద్విచక్ర వాహనంపై ముందు వెళ్తున్న టౌన్‌షిప్ సెక్టార్-6 ప్రాంతానికి చెందిన కె.కోటేశ్వరరావు (61)ను ఢీకొన్నాడు. దీంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొని మళ్లీ రోడ్డుపై బోల్తా పడింది. ఈ క్రమంలో అదే మార్గంలో మరో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పెదగంట్యాడ సమీపంలోని వెంపళ్లనగర్‌కు చెందిన ఇందల అప్పారావు (51)ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారులిద్దరికీ గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిద్దరూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారును అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.