Nalgonda: అదనపు కలెక్టర్ పేరిట రూ.2 లక్షలు వసూలు
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:35 AM
ఇసుక కాంట్రాక్ట్ ఇప్పిస్తానని, ఏకంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పేరు చెప్పి నల్లగొండ జిల్లా డిండి ఇరిగేషన్ సర్కిల్ డివిజన్-8 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) గా పనిచేస్తున్న ఓ అధికారి రూ.2 లక్షల వసూలు చేశారు.

ఇసుక కాంట్రాక్ట్ ఇప్పిస్తానని మోసగించిన డిండి ఈఈ
నల్లగొండ జిల్లా కలెక్టర్ మందలింపు.. విచారణకు ఆదేశం
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఇసుక కాంట్రాక్ట్ ఇప్పిస్తానని, ఏకంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పేరు చెప్పి నల్లగొండ జిల్లా డిండి ఇరిగేషన్ సర్కిల్ డివిజన్-8 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) గా పనిచేస్తున్న ఓ అధికారి రూ.2 లక్షల వసూలు చేశారు. నీటి పారుదలశాఖలో కలకలం రేపిన ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా పొక్కి.. చివరకు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దృష్టికి వచ్చింది. దీనిపై అప్పట్లో నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఐలా త్రిపాఠికి ఆయన ఫిర్యాదు చేశారు.
దీంతో స్పందించిన కలెక్టర్ త్రిపాఠి.. సదరు ఈఈని, సంబంధిత కాంట్రాక్టర్‌ను పిలిపించుకుని తీవ్రంగా మందలించారు. అంతటితో ఆగక ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని నల్లగొండ సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు. వ్యవహారం ముదిరి పాకాన పడటంతో ఈఈ అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు. ఇక డిండి రిజర్వాయర్ నిర్మాణానికి సేకరించిన భూముల అన్యాక్రాంతంలోనూ సదరు ఈఈ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.