Share News

Khammam: ప్రైవేటు ఆస్పత్రిలో అదుపు తప్పిన లిఫ్ట్‌

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:30 AM

మీది అంతస్తుకు వెళ్లాల్సిన లిఫ్ట్‌ సాంకేతిక సమస్య కారణంగా ఆకస్మాత్తుగా, అతివేగంగా కిందికి పడిపోయి నేలకు ఢీకొట్టడంతో అందులోని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

Khammam: ప్రైవేటు ఆస్పత్రిలో అదుపు తప్పిన లిఫ్ట్‌

  • రెండో అంతస్తు నుంచి అత్యంత వేగంగా కిందకు పడిన వైనం

  • స్ట్రెచర్‌పైనే ప్రాణాలు విడిచిన మహిళ

  • ఖమ్మం నగరంలో విషాదం

ఖమ్మం కలెక్టరేట్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మీది అంతస్తుకు వెళ్లాల్సిన లిఫ్ట్‌ సాంకేతిక సమస్య కారణంగా ఆకస్మాత్తుగా, అతివేగంగా కిందికి పడిపోయి నేలకు ఢీకొట్టడంతో అందులోని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. లిఫ్టులో స్ట్రెచర్‌పై ఉన్న ఆమె దానిపైనే కన్నుమూసింది. ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో ఉన్న ప్రసూన ఆస్పత్రిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం వనంవారి కిష్టాపురం గ్రామానికి చెందిన సట్టు సరోజిని(63)కి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు గురువారం ఆమెను ఈ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు యాంజియోగ్రామ్‌ నిర్వహించి ఇంటికి పంపించారు. తిరిగి శుక్రవారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన సరోజినికి మళ్లీ పరీక్షలు నిర్వహించి స్టంట్‌ వేయాలని చెప్పారు. కుటుంబసభ్యులు అంగీకరించడంతో విజయవంతంగా స్టంట్‌ వేశారు.


ఆపరేషన్‌ అనంతరం ఆమెను థియేటర్‌ ఉన్న రెండో అంతస్తు నుంచి ఐసీయూ వార్డు (నాలుగో అంతస్తు)కి తరలించేందుకు స్ట్రెచర్‌పై పడుకోబెట్టి లిఫ్ట్‌లోకి తీసుకువచ్చారు. ఆమె వెంట ఇద్దరు ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. లిఫ్ట్‌లో బటన్‌ను నొక్కగానే పైకి వెళ్లడానికి బదులు, ఉన్నట్టుండి ఒక్కసారిగా రెండో ఫ్లోర్‌ నుంచి గ్రౌండ్‌ ఫ్లోర్‌కు పడిపోయింది. దీంతో స్ట్రెచర్‌పె ఉన్న సరోజిని లిఫ్ట్‌లోనే ప్రాణం విడిచింది. ఆమెతో పాటు ఉన్న ఆస్పత్రి సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. లిఫ్ట్‌ సెన్సర్లు పనిచేయక పోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఏడేళ్ల క్రితం ఈ లిఫ్ట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈనెల 7నే తగిన మరమ్మతులు చేయించినట్లు ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. అయినప్పటికీ ప్రమాదం ఎలా జరిగిందనేది అంతుబట్టడం లేదు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే సరోజిని మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు, కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పారు.

Updated Date - Mar 22 , 2025 | 04:30 AM