Share News

విద్యుత్‌ అంతరాయాలకు చెక్‌

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:51 AM

వేసవిలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా ఈపీడీసీఎల్‌ అధికారలు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచడంతోపాటు, కొత్త ట్రాన్స్‌ఫారాలు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

విద్యుత్‌ అంతరాయాలకు చెక్‌
పెదబొడ్డేపల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌

నర్సీపట్నం ఈఈ పరిధిలో నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు

ట్రాన్స్‌ఫారాల లోడ్‌ పెంపు

కొత్తగా 55 ట్రాన్స్‌ఫారాలు ఏర్పాటు

మూడుచోట్ల సబ్‌ స్టేషన్ల నిర్మాణం

వేసవిలో డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే చర్యలు

నర్సీపట్నం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): వేసవిలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా ఈపీడీసీఎల్‌ అధికారలు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచడంతోపాటు, కొత్త ట్రాన్స్‌ఫారాలు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఈపీడీసీఎల్‌ నర్సీపట్నం ఈఈ పరిధిలోని 13 మండలాల్లో కేటగిరి-1 గృహ వినియోగ సర్వీసులు 2,23,868, కేటగిరి-2 వాణిజ్య సర్వీసులు 23,934, కేటగిరి-3 పారిశ్రామిక సర్వీసులు 913, ప్రభుత్వ కేటగిరీ సర్వీసులు 4, స్థానిక సంస్థల సర్వీసులు 6,487 ఉన్నాయి. ప్రతి నెలా విద్యుత్‌ కనెక్షన్లు, తద్వారా విద్యుత్‌ వినియోగం పెరుగుతూ వస్తున్నది. ఇళ్లు, పరిశ్రమల్లో విద్యుత్‌ వినియోగం పెరిగిపోయి ట్రాన్స్‌ఫారాల మీద అధిక లోడు పడుతున్నది. దీంతో పీక్‌ అవర్స్‌లో పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా ఆపాల్సి వస్తున్నది. ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్‌ అవుతుండడంతో ఇళ్లకు కూడా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది.

గత ఏడాది వేసవి ఆరంభంలో (మార్చి నెల) 36.97 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదైంది. ఏప్రిల్‌లో ఇది 40.86 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. మే నెలలో 36.61 మిలియన్‌ యూనిట్లు, జూన్‌లో 30.72 మిలియన్‌ యూనిట్లు చొప్పున వేసవి నాలుగు నెలల్లో 145.16 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ వినియోగం జరిగింది. పెరుగుతున్న వినియోగంతో ఈ ఏడాది వేసవిలో 160 మిలియన్‌ యూనిట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. విద్యుత్‌ వినియోగం పెరిగినప్పుడు ట్రాన్స్‌ఫారాల సామర్థ్యం సరిపోకపోతే వాటి మీద అధిక లోడు పడుతుంటుంది. దీనిని నివారించడానికి రూ.2 కోట్లతో 16 కేవీ నుంచి 100 కేవీ కెపాసిటీగల 55 కొత్త విద్యుత్‌ ట్రాన్స్‌ఫారాలను ఏర్పాటు చేశారు. పదిచోట్ల ట్రాన్స్‌ఫారాల సామర్థ్యం పెంచారు.

కొత్తగా మూడు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు

కె.కోటపాడు మండలం చౌడువాడలో రూ.4 కోట్లతో 5 ఎంవీఏ సామర్థ్యంతో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చోడవరం మండలానికి కూడా 5 ఎంవీఏ సబ్‌ స్టేషన్‌ మంజూరైంది. దీనిని నరసయ్యపేటలో ఏర్పాటు చేస్తారు. ఇదే తరహాలో మాడుగుల మండలం కింతలిలో కూడా సబ్‌స్టేషన్‌ నిర్మిస్తారు. ఇక్కడ సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేసే స్థలానికి అప్రోచ్‌ రోడ్డు వేయాల్సి ఉంది. రోడ్డు అందుబాటులోకి వస్తే వెంటనే పనులు మొదలు పెడతామని ఈఈ వీడీవీ రామకృష్ణారావు తెలిపారు. గత ఏడాది కోటవురట్ల, నాతవరం, రావికమతంలో అదనంగా 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫారాలు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్‌ లోఓల్టేజీ, ఇతర సమస్యలను అధిగమించామని ఆయన చెప్పారు.

Updated Date - Mar 26 , 2025 | 12:51 AM