Share News

YSRCP: వైసీపీలో అయోమయం..

ABN , Publish Date - Jan 10 , 2025 | 01:15 AM

YSRCP: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో వింత పరిస్థితి నెలకొంది. కొన్ని నియోజకవర్గాలకు సమన్వయకర్తలు లేకపోవడం, ఉన్నచోట కూడా ఒకరిద్దరు మినహా మిగిలినవారు అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండడంతో క్యాడర్‌లో నిరాశా, నిస్పృహలు కనిపిస్తున్నాయి. సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టేందుకు ముఖ్యమైన నాయకులు విముఖత చూపుతుండడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పార్టీ పెద్దలు కొట్టుమిట్టాడుతోంది.

YSRCP: వైసీపీలో అయోమయం..
YSRCP

  • సమన్వయకర్త లేని భీమిలి.

  • గుడివాడ అమర్‌ను బాధ్యత తీసుకోవాలని కోరిన అధిష్ఠానం.

  • నిరాకరించిన మాజీ మంత్రి.

  • తనకు పెందుర్తి లేదా అనకాపల్లి జిల్లాలో

  • ఏదో ఒక నియోజకవర్గం ఇవ్వాలని కోరినట్టు సమాచారం.

  • ‘తూర్పు’లో పార్టీ కార్యక్రమాలకు దూరంగా సమన్వయకర్త ఎంవీవీ.

  • సమన్వయకర్త బాధ్యతల కోసం మేయర్‌ హరివెంకటకుమారి,

  • మొల్లి అప్పారావు ఆసక్తి.

  • వారిపట్ల అంతగా ఆసక్తి చూపని పార్టీ పెద్దలు

  • ఎవరూ లేకపోతే వారిద్దరిలోనే ఒకరికి ఛాన్స్‌ ఇవ్వాలని యోచన.

  • గాజువాక సమన్వయకర్త పదవి కోసం మాజీ ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, చింతలపూడి పోటీ.

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో వింత పరిస్థితి నెలకొంది. కొన్ని నియోజకవర్గాలకు సమన్వయకర్తలు లేకపోవడం, ఉన్నచోట కూడా ఒకరిద్దరు మినహా మిగిలినవారు అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండడంతో క్యాడర్‌లో నిరాశా, నిస్పృహలు కనిపిస్తున్నాయి. సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టేందుకు ముఖ్యమైన నాయకులు విముఖత చూపుతుండడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పార్టీ పెద్దలు కొట్టుమిట్టాడుతోంది.

సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజలకు వైసీపీ నేతలు ముఖం చూపించడం మానేశారు. తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగుతున్నప్పటికీ రైతు సమస్యలు, విద్యుత్‌ చార్జీల పెంపుపై పార్టీ ఇటీవల నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు హాజరుకాలేదు. దీంతో ప్రస్తుతం ఆయన సమన్వయకర్త బాధ్యతల పట్ల ఆసక్తిగా లేరని నేతలు, కార్యకర్తలు నిర్ధారణకు వచ్చేశారు. ఎంవీవీ స్థానంలో ఎవరికైనా బాధ్యతలు అప్పగించాలని ద్వితీయశ్రేణి నేతలంతా కోరుతుండడంతో అధిష్ఠానం సమర్థులైన వారికోసం అన్వేషణ మొదలుపెట్టింది. సమన్వయకర్త బాధ్యతలు చేపట్టేందుకు జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, నియోజకవర్గ పరిశీలకుడు మొల్లి అప్పారావు తమ ఆసక్తిని వ్యక్తంచేశారు. కానీ వారి కంటే మరెవరైనా దొరుకుతారేమోననే అధిష్ఠానం వేచి చూస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మొల్లి అప్పారావు తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ద్వారా అధిష్ఠానంపై ఒత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

భీమిలి వెళ్లడానికి నో చెప్పిన అమర్‌నాథ్‌..

భీమిలి సమన్వయకర్తగా ఇంతవరకూ పనిచేసిన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇటీవల పార్టీకి గుడ్‌బై చెప్పారు. ముత్తంశెట్టి స్థానంలో బాధ్యతలు చేపట్టాలని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు అధిష్ఠానం సూచించగా, ఆయన నిరాకరించినట్టు ప్రచారం జరుగుతోంది. తనకు పెందుర్తి లేదంటే అనకాపల్లి జిల్లాలోని ఏదైనా నియోజకవర్గం అప్పగించాలని అమర్‌ కోరినట్టు సమాచారం. దీంతో భీమిలి సమన్వయకర్తగా ఎవరైనా సమర్థుడు పేరు సూచించాలని పార్టీ నేతలను అధిష్ఠానం కోరినట్టు చెబుతున్నారు. విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ చిన్న శ్రీనుతో భీమిలి సమన్వయకర్త బాధ్యతలు చేపట్టడంపై చర్చించగా, తనకు వద్దని అవకాశం ఉంటే ఎస్‌.కోట లేదంటే ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో ఏదో ఒకటి అప్పగించాలని స్పష్టం చేసినట్టు నేతలు చెబుతున్నారు. దీంతో సమన్వయకర్తను నియమించేంత వరకూ భీమిలి బాధ్యతలను చూడాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌కు సూచించినట్టు తెలిసింది. మరోవైపు గాజువాక సమన్వయకర్త బాధ్యతల పట్ల అమర్‌నాథ్‌ ఆసక్తి చూపకపోవడంతో ఆయన స్థానంలో కొత ్తవారికి అవకాశం ఇచ్చే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు నేతలు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యతోపాటు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుటుంబసభ్యులు ఆసక్తి చూపుతున్నారని, వారిలో ఒకరికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఈనెల నుంచి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టబోతుండడంతో ఆలోగానే సమన్వయకర్తలు లేనిచోట కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్టు నేతలు చెబుతున్నారు.

Updated Date - Jan 10 , 2025 | 08:51 AM