దారుణం ప్రేమోన్మాది ఘాతుకం
ABN , Publish Date - Apr 03 , 2025 | 01:26 AM
నగరంలోని కొమ్మాది స్వయంకృషి నగర్‌లో ప్రేమోన్మాది దుశ్చర్య అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది. తనను ప్రేమించడం లేదని యువతిపైనా, పెళ్లికి తిరస్కరించారనే అక్కసుతో ఆమె తల్లిదండ్రులపైనా ఒక యువకుడు బుధవారం పట్టపగలు ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. దీంతో తల్లి అక్కడికక్కడే మృతిచెందగా, యువతి ప్రాణాపాయ స్థితిలో ఉంది. ప్రేమోన్మాది పలుమార్లు అతిగా ప్రవర్తించినప్పటికీ బాధిత కుటుంబం ఒకింత తేలిగ్గా తీసుకోవడమే కొంపముంచింది. సీపీ శంఖబ్రతబాగ్చి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ...ఉన్మాద లక్షణాలతో వ్యవహరించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

పట్టపగలు తల్లీ, కూతురుపై కత్తితో దాడి
ఒకరి మృతి, ప్రాణాపాయ స్థితిలో మరొకరు...
ఉలిక్కిపడిన నగరం
ఉన్మాద లక్షణాలు ఉన్న వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం
మహిళలతోపాటు తల్లిదండ్రులు కూడా
తొలిదశలోనే పోలీసులను సంప్రతిస్తే మేలు
ఉపేక్షిస్తే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలోని కొమ్మాది స్వయంకృషి నగర్‌లో ప్రేమోన్మాది దుశ్చర్య అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది. తనను ప్రేమించడం లేదని యువతిపైనా, పెళ్లికి తిరస్కరించారనే అక్కసుతో ఆమె తల్లిదండ్రులపైనా ఒక యువకుడు బుధవారం పట్టపగలు ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. దీంతో తల్లి అక్కడికక్కడే మృతిచెందగా, యువతి ప్రాణాపాయ స్థితిలో ఉంది. ప్రేమోన్మాది పలుమార్లు అతిగా ప్రవర్తించినప్పటికీ బాధిత కుటుంబం ఒకింత తేలిగ్గా తీసుకోవడమే కొంపముంచింది. సీపీ శంఖబ్రతబాగ్చి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ...ఉన్మాద లక్షణాలతో వ్యవహరించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రేమ పేరిట వేధింపులు, దాడులు నగరంలో ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. ఎక్కడైనా పరిచయం కాగానే ప్రేమ పేరుతో ఆకతాయిలు వెంటపడడం, వేధించడం చేస్తున్నారు. తాము చెప్పినట్టు వినకపోతే విచక్షణ కోల్పోయి యువతుల పట్ల తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరైతే ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారు. ఆరు నెలల కిందట న్యూపోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరిట ఒక యువతి వెంటపడిన అదే ప్రాంతానికి చెందిన యువకుడు తనను పెళ్లి చేసుకోవాల్సిందేనని ఆమెపై ఒత్తిడిచేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో గొంతుకోసి పరారయ్యాడు.
తాజాగా కొమ్మాది స్వయంకృషి నగర్‌లో మరో ప్రేమోన్మాది బీభత్సం సృష్టించాడు. రాజు, లక్ష్మి దంపతుల కుమార్తె దీపిక (20)కు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం పనసనందివాడ గ్రామానికి చెందిన దమరశింగి నవీన్ (26)కు ఆరేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రేమ పేరుతో ఆమె వెంటపడుతున్నాడు. ఆమె అంగీకరించకపోవడంతో తీవ్రస్థాయిలో బెదిరించేవాడు. ఇలాంటి పరిస్థితి ఎదురైన వెంటనే యువతి లేదంటే ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. అలా చేసినట్టయితే నవీన్‌కు పోలీసులు కౌన్సెలింగ్ చేయడం లేదంటే కేసు నమోదుచేసి కుటుంబ సభ్యుల సమక్షంలో బైండోవర్ చేయడం ద్వారా ఆమె వైపు కన్నెత్తిచూడకుండా చర్యలు తీసుకునేవారు. అప్పటికీ శృతిమించి వ్యవహరిస్తున్నా, బెదిరింపులు కొనసాగిస్తున్నా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించడం, ఇంకా తగ్గకపోతే షీట్ తెరిచి జైల్లోనే ఉండేలా చేయడం చేసేందుకు అవకాశం ఉండేది. కానీ బాధిత యువతితోపాటు ఆమె తండ్రి రాజు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు విముఖత చూపారు. కుటుంబం పరువుపోతుందనో...నిందితుడి జీవితం నాశనమైపోతుందనో భావించి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనాసరే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీనిని అలుసుగా తీసుకున్న నిందితుడు నవీన్ బుధవారం కత్తితో నేరుగా యువతి ఇంటికి వెళ్లాడు. తన పెళ్లికి నిరాకరించిన యువతి తల్లిని కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం యువతిపై కూడా కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారైపోయాడు. ఘటనా స్థలాన్ని సందర్శించిన సీపీ శంఖబ్రతబాగ్చి కూడా బాధిత కుటుంబంతో మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ నిందితుడు నవీన్ పలుమార్లు బాధితురాలితో అతిగా ప్రవర్తించడం, బెదిరించడం, బలవంతంగా శ్రీకాకుళం జిల్లాకు తీసుకువెళ్లడం వంటి చర్యలకు పాల్పడినప్పుడైనా పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. ఎవరైనా ప్రేమ పేరుతో వెంటపడినా, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసినా, తాము చెప్పినట్టు వినకపోతే ప్రాణం తీస్తామని, దాడులు చేస్తామని, కుటుంబ సభ్యుల అంతుచూస్తామని బెదిరిస్తే వెంటనే కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకువెళ్లాలని సీపీ విజ్ఞప్తిచేశారు. తల్లిదండ్రులు తమకు ఎదురైనా ఇబ్బందిని లేదా భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించినప్పుడు డయల్ 100కి లేదంటే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తే ఆకతాయిలు, దురుసుగా ప్రవర్తించే జులాయిల ఆటకట్టించేందుకు, తద్వారా బాలికలు, యువతులకు రక్షణ కల్పించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. బాధితులు కోరితే వారి వివరాలను గోప్యంగా ఉంచి చట్టపరంగా రక్షణ కల్పిస్తామని సీపీ భరోసా ఇచ్చారు.