Share News

మూగ జీవాలకు తాగునీటి తొట్టెల నిర్మాణం

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:26 AM

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో రూ.50 లక్షల 25 వేల వ్యయంతో పశువులకు 150 తాగునీటి తొట్టెలను నిర్మిస్తున్నామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరితో కలిసి మండలంలో చింతలవీధి పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామంలో పశువుల తాగునీటి తొట్టె నిర్మాణానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు.

మూగ జీవాలకు తాగునీటి తొట్టెల నిర్మాణం
పాడేరు మండలం కుమ్మరిపుట్టులో తాగునీటి తొట్టె నిర్మాణానికి శంకు స్థానం చేసి గునపంతో పనులు ప్రారంభిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

- కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

- జిల్లాలో 150 నిర్మాణానికి రూ.50 లక్షల 25 వేలు మంజూరు

పాడేరు, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో రూ.50 లక్షల 25 వేల వ్యయంతో పశువులకు 150 తాగునీటి తొట్టెలను నిర్మిస్తున్నామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరితో కలిసి మండలంలో చింతలవీధి పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామంలో పశువుల తాగునీటి తొట్టె నిర్మాణానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పశు సంపద పరిరక్షణలో భాగంగా వాటికి తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పశువులకు వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తాగునీటి తొట్టెల నిర్మాణం చేపడుతున్నామన్నారు. జిల్లాకు 150 నీటి తొట్టెలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఒక్కొక్క తాగునీటి తొట్టెకు రూ.33,550 వ్యయం చేస్తామని, .పాడేరు మండలంలో ఆరు తొట్టెలను నిర్మిస్తామన్నారు. తాగునీటి తొట్టెల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఉపాధి హామీ పథకం అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. నిర్మాణాల్లో తగిన నాణ్యత పాటించాలని, పశువులు నీళ్లు తాగేందుకు అనువుగా ఉండేలా వాటిని నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ డాక్టర్‌ విద్యాసాగర్‌, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, ఉపాధి హామీ ఏపీవో వై.వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 12:26 AM