సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:18 PM
జిల్లాలో గంజాయి నిర్మూలనకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అన్నారు.

కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
గంజాయి సమాచారాన్ని ఈగిల్ టోల్‌ఫ్రీ నంబర్: 1972కు తెలపండి
ఎస్‌పీ అమిత్‌బర్ధార్
పాడేరు, మార్చి 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయి నిర్మూలనకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అన్నారు. గంజాయి నిర్మూలన చర్యలపై వివిధ శాఖల అధికారులతో జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌తో కలిసి బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి సాగువల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలని, గంజాయి సాగును వీడిన రైతులను వ్యవసాయ, ఉద్యానవనాధికారులు ప్రోత్సహించాలన్నారు. ఆయా ప్రాంతాల్లోని రైతులకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అవసరమైన శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారులు డిఅడిక్షన్ సెంటర్లను పక్కాగా నిర్వహించాలని, విద్యాలయాలకు సమీపంలోని దుకాణాల్లో మత్తు పదార్థాలను విక్రయించకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే జూన్, జూలై నెలల్లో గంజాయి సాగు ప్రారంభించే అవకాశాలుంటాయని, అప్పటి నుంచి మరింత సమర్థవంతంగా పని చేసి పంట వేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి కేసుల్లో ఉన్న వారి బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసి, వాళ్లతో సంబంధాలున్న వారి ఖాతాలపై నిఘా పెట్టాలన్నారు.
గంజాయి సమాచారాన్ని 1972 నంబర్‌కు అందించండి
గంజాయి సాగు, రవాణా వంటి సమాచారాన్ని ఈగిల్ టోల్ ఫ్రీ నంబర్: 1972కు తెలపాలని జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్ కోరారు. ఇప్పటికే గంజాయి సాగుపై డ్రోన్లు, ఏఐ సాంకేతికతతో గుర్తించి ధ్వంసం చేశామని, గంజాయికి సంబంధించిన సమాచారాన్ని టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలపాలన్నారు. అలాగే గంజాయి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని, టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నంద్, జిల్లా ఉద్యావనాధికారి రమేశ్‌కుమార్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళి, జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు, ఐసీడీఎస్ పీడీ ఎన్.సూర్యలక్ష్మి, డీఎంహెచ్‌వో సి.జమాల్ బాషా, డీసీహెచ్‌ఎస్ కె.లక్ష్మి, ఎల్‌డీఎం మోతునాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.