గోవాడలో రూ.300 కోట్లతో డిస్టిలరీ
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:58 AM
గోవాడలో రూ.300 కోట్లతో డిస్టిలరీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, డీపీఆర్ తయారీకి పరిశ్రమ ల శాఖ కార్యదర్శిని ఆదేశించారని స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు వెల్లడించారు. శనివారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యపై తాను, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సీఎంను కలిసి గోవాడలో పరిస్థితి వివరించి డిస్టిలరీ లేదా ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు విజ్ఞప్తి చేశామన్నారు.

- డీపీఆర్ తయారు చేయాలని సీఎం ఆదేశం
- చెరకు సాగు ద్వారా నష్టాలతో ఫ్యాక్టరీ నడపడం సాధ్యం కాదు
- త్వరలోనే అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ఆధ్వర్యంలో గోవాడపై అఖిలపక్షం
- నూరు శాతం సహకార రంగంలోనే డిస్టిలరీ నిర్వహణ
- గోవాడ రైతులకు న్యాయం చేసే బాధ్యత నాదే..
- ఫ్యాక్టరీకి ఐఏఎస్ అధికారిని నియమించాలని కోరాం
- ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు
చోడవరం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): గోవాడలో రూ.300 కోట్లతో డిస్టిలరీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, డీపీఆర్ తయారీకి పరిశ్రమ ల శాఖ కార్యదర్శిని ఆదేశించారని స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు వెల్లడించారు. శనివారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యపై తాను, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సీఎంను కలిసి గోవాడలో పరిస్థితి వివరించి డిస్టిలరీ లేదా ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్ర సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కోరిన మీదట సీఎం సానుకూలంగా స్పందించి వెంటనే డీపీఆర్ తయారీకి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్‌కు ఆదేశాలిచ్చారన్నారు. గోవాడలో డిస్టిలరీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్యారంటీదారుగా ఉండి, 6 శాతం వడ్డీకి రుణం మంజూరు చేయిస్తుందని, 240 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన డిస్టిలరీ గోవాడలో ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు. గోవాడ ఫ్యాక్టరీ నిర్వహణకు కూడా ఐఏఎస్ అధికారినే ఎండీగా నియమించాలని సీంను కోరామని తెలిపారు. కేవలం చెరకు సాగు ద్వారా ఫ్యాక్టరీని నడపడం కష్టసాధ్యం కాబట్టి, ప్రత్నామ్నాయంగా మొక్కజొన్న, ఇతర పంటల ద్వారా డిస్టిలరీ నిర్వహించి గోవాడను నిలబెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ డిస్టిలరీ ఏర్పాటు పూర్తిగా సహకార రంగంలోనే నడిచేలా చూడాలని సీఎంను కోరామని ఆయన చెప్పారు. త్వరలోనే ఎంపీ సీఎం రమేశ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ అఖిలపక్ష సమావేశానికి అన్ని పక్షాలను ఆహ్వానించి గోవాడను అభివృద్ధి చే సే దిశగా అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. గోవాడను రాజకీయాలకు వేదికగా మార్చే ఉద్దేశం తనకు లేదని, ఎట్టి పరిస్థితుల్లో గోవాడ చెరకు రైతులకు న్యాయం చేయాలన్నది తన లక్ష్యమని స్పష్టం చేశారు. గోవాడకు ఆస్తులు, అప్పులు కూడా ఉన్నాయని, కేంద్రం ద్వారా డిస్టిలరీ ఏర్పాటు చేసి, మిగిలిన నిధులతో అప్పులు తీర్చి, గోవాడ సభ్య రైతులు గర్వపడేలా ఫ్యాక్టరీని తీర్చిదిద్ద్దుతామని ఆయన చెప్పారు. గోవాడ రైతులు, కార్మికులు అధైర్యపడనవసరం లేదని, ధైర్యంగా ఉండాలని, ఈ ప్రభుత్వం ఎవరికీ అన్యాయం చేయబోదన్నారు. గోవాడపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు బొత్స, ఇతర నేతలు తమ హయాంలోనే భీమసింగి, తాండవ, ఏటికొప్పాకలు మూతపడిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. త్వరలోనే వడ్డాది నుంచి మండలంలోని గంధవరానికి రహదారి అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్‌తో మాట్లాడామని, పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే రాజు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ నాగగంగాధర్ పాల్గొన్నారు.