జోరుగా రేషన్ కార్డుల ఈకేవైసీ!
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:27 PM
జిల్లాలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ప్రతి రేషన్ కార్డులోని లబ్ధిదారుని బయోమెట్రిక్‌ను విధిగా ఈకేవైసీ వేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిచింది. అందులో భాగంగా ప్రస్తుతం జిల్లాలోని ఈ ప్రక్రియను పౌర సరఫరాల అధికారులు చేపడుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా 2,98,092 కార్డులు
8,69,318 మంది లబ్ధిదారులు
ఈకేవైసీ పూర్తయింది 7,38,069 మంది,
పెండింగ్‌లో 1,31,249 మంది
ప్రతి లబ్ధిదారుని బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి
ఈనెలాఖరు వరకే గడువు
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ప్రతి రేషన్ కార్డులోని లబ్ధిదారుని బయోమెట్రిక్‌ను విధిగా ఈకేవైసీ వేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిచింది. అందులో భాగంగా ప్రస్తుతం జిల్లాలోని ఈ ప్రక్రియను పౌర సరఫరాల అధికారులు చేపడుతున్నారు.
జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో మొత్తం 22 మండలాల పరిధిలో మొత్తం 2 లక్షల 98 వేల 92 రేషన్ కార్డులుండగా, వాటిలో 8 లక్షల 69 వేల 318 మంది లబ్ధిదారులున్నారు. ఇప్పటికి 7 లక్షల 38 వేల 69 మందికి ఈకేవైసీ పూర్తిగా.. ఇంకా 1 లక్షా 31 వేల 249 మందికి చేయించాల్సి ఉంది. మార్చి నెలాఖరులోగా వారిందరినీ ఈకేవైసీ చేయించేందుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో గడువు నాటికి ఎట్టి పరిస్థితుల్లో శత శాతం రేషన్ కార్డులను ఈకేవైసీ చేయాలని జిల్లా పౌర సరఫరాలాధికారి బి.గణేశ్‌కుమార్ తెలిపారు.
బోగస్ ఏరివేతే లక్ష్యం
ఈకేవైసీ ప్రక్రియతో ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డుల ప్రక్షాళనతో పాటు బోగస్ ఏరివేతకు అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో అనర్హులకు సైతం రేషన్‌కార్డులు మంజూరు చేయడంతోపాటు కార్డులోని లబ్ధిదారులు మృతి చెందినా వారి పేర్లను తొలగించని పరిస్థితి ఉందని అధికారులు అంటున్నారు. అయితే కార్డుల్లో పేర్లు తొలగించకపోవడం.. వారి పేరిట నెల కోటా రేషన్ సరుకులు పొందుతున్న పరిస్థితులున్నాయి. ఈక్రమంలో రేషన్‌కార్డుల్లోని లబ్ధిదారులందరి బయోమెట్రిక్ నమోదు చేయడంతో దాదాపుగా కార్డులు ప్రక్షాళన జరిగి వాస్తవ లబ్ధిదారులకు మాత్రమే రేషన్ పంపిణీ చేసేందుకు అవకాశం కలుగుతుందని డీలర్లు అంటున్నారు.
ఈకేవైసీ చేయించకుంటే రేషన్‌కార్డు రద్దు?
ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న ఈకేవైసీని లబ్ధిదారులు చేయించకుంటే వారి కార్డు రద్దే అవశాలున్నాయని అంటున్నారు. ఈకేవైసీ జరగని కారణంగా ఆ రేషన్‌కార్డు రద్దు జాబితాలో చేరిపోతుంది. అందువల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులు విధిగా ఈకేవైసీ చేయించుకోవాలని సివిల్ సప్లయ్ అధికారులు కోరుతున్నారు.
ఈకేవైసీ లక్ష్యం విధిగా పూర్తి చేయాలి
జాయింట్ కలెక్టర్ డాక్ఱర్ ఎంజే.అభిషేక్‌గౌడ
జిల్లాలో రేషన్ కార్డుల లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియను ఈనెలాఖరుకు ఎట్టి పరిస్థితిల్లో లక్ష్యం పూర్తి చేయాలి. లబ్ధిదారులు ఈ విషయంలో గ్రామ సచివాలయాలు, రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలి. రేషన్ దుకాణాల డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు సైతం తమ పరిధిలోని రేషన్‌కార్డు లబ్ధిదారుల అందరి ఈకేవైసీ విధిగా చేయించాలని ఇప్పటికే సూచించారు. ఈనెలాఖరు వరకు గడువు ఉన్నందున లబ్ధిదారులు, సివిల్ సప్లయ్ అధికారులు, రేషన్ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు మరింత వేగంగా ఈకేవైసీ ప్రక్రియను చేపట్టాలని సూచిస్తున్నాం.
జిల్లాలో రెవెన్యూ డివిజన్ల వారీగా రేషన్ కార్డుల వివరాలు...
వ.సం రెవెన్యూ డివిజన్ రేషన్ దుకాణాలు కార్డుల సంఖ్య
1. పాడేరు 486 1,84,358
2. చింతూరు 82 44,189
3. రంపచోడవరం 107 69,545
---------------------------------------------------------------------------
మొత్తం 671 2,98,092
---------------------------------------------------------------------------