Share News

మూఢనమ్మకాలకు గిరి‘జనులు బలి’!

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:30 PM

గిరిజనుల అమాయకత్వం.. నిరక్షరాస్యత.. ఆచార, సంప్రదాయాల నేపథ్యంలో మూఢనమ్మకాలు వారి జీవనంతో పెనవేసుకున్నాయి. మూఢనమ్మకాల పుణ్యమని పరోక్షంగా, ప్రత్యక్షంగా గిరిజనుల ప్రాణాలు బలిగొంటున్న ఘటనలు కొనసాగుతున్నాయి.

మూఢనమ్మకాలకు గిరి‘జనులు బలి’!

ఆధునిక యుగంలోనూ క్షుద్ర పూజలపై అతి విశ్వాసం

జ్వరం వచ్చినా.. పంటలు పండకపోయినా..

పశువులు వ్యాధులతో మృతి చెందినా క్షుద్ర పూజలు

చిల్లంగి, చెడుపు పెట్టారంటూ పూజారుల హత్యలు

తాజాగా అరకులోయ మండలం ఆర్‌.డుంబ్రిగుడలో

గిరిజనుడి సజీవ దహనం

గిరిజనులను చైతన్య పరచడమే ప్రత్యామ్నాయం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

గిరిజనుల అమాయకత్వం.. నిరక్షరాస్యత.. ఆచార, సంప్రదాయాల నేపథ్యంలో మూఢనమ్మకాలు వారి జీవనంతో పెనవేసుకున్నాయి. మూఢనమ్మకాల పుణ్యమని పరోక్షంగా, ప్రత్యక్షంగా గిరిజనుల ప్రాణాలు బలిగొంటున్న ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా అరకులోయ మండలం ఆర్‌.డుంబ్రిగుడ గ్రామానికి చెందిన ఎ.డొంబ్రు(60)అనే వృద్ధుడిని గ్రామస్థులు దాడి చేసి, సజీవదహనం చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. దీంతో మన్యంలో మూఢ నమ్మకాలతో గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్న వైనాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. ఏజెన్సీలో ఇటువంటి ఘటనలు కొత్తేమి కాదు. అయితే ఆయా ఘటనలు జరిగినపుడు పోలీసులు, అధికారులు కొన్ని రోజులు హడావిడి చేయడం.. ఆ తర్వాత మిన్నకుండడం సర్వసాధారణమైపోయింది.

ఒడిశా రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా మూఢనమ్మకాలను విశ్వసిస్తుంటారు. అలాగే ఒడిశా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇందుకు సంబంధించిన పూజలు, మంత్రాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు గురువులు సైతం ఉన్నారు. దీంతో మూఢనమ్మకాలను అతిగా విశ్వసించే వారంతా ఒడిశా వెళ్లి అక్కడ దిసారీ (మూఢనమ్మకాలకు పూజలు చేసే గురువు)గా శిక్షణ పొంది, తమ గ్రామాల్లో అనారోగ్య సమస్యలు మొదలుకుని, అన్ని రకాల వ్యాధులు, దోషాల నివారణకు క్షుద్ర పూజలు, ఇతరులను ఇబ్బందులకు గురిచేసే చెడుపు, చిల్లంగి వంటి వాటిని నిర్వహిస్తుంటారు. దీంతో వాటిపై నమ్మకం ఉన్న గిరిజనులు వాటి నివారణకు దిసారీని ఆశ్రయిస్తుంటారు. గిరి పల్లెల్లో అన్ని రకాల వాటికి దిసారీలు పూజలు చేస్తుంటారు. ఎవరికైనా జ్వరం వచ్చినా.. వాంతులు చేసుకున్నా.. పంటలు పండకపోయినా.. పశువులు వ్యాధులతో మృతి చెందినా.. ఊరి దోసం పేరిట పొలిమేరల్లో పూజలు చేస్తారు. అలాగే వ్యక్తిగత సమస్యలపై దిసారీ ఇంటిలోనే ప్రత్యేక పూజలు చేసి జంతు బలిని ఇస్తుంటారు. అలాగే తమ అనారోగ్య సమస్యలతోపాటు, తమకు గిట్టని వారిని అంతమొందించేందుకు సైతం గిరిజనులు దిసారీని ఆశ్రయిస్తారు. తమ సమస్య పరిష్కారమైతే దిసారీలకు డబ్బులు, బియ్యం, మేకలు, పశువులు సైతం బహుమతిగా ఇస్తుంటారు. ఇటువంటి పరిణామాల వల్లే గిరిజనులు రోగాల బారిన పడితే.. ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందకుండా దిసారీని ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదే క్రమంలో గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరూ లేదా ముగ్గురు వరుసగా మృతి చెందితే అందుకు దిసారీనే కారణమని అతడ్ని హతమార్చిన ఘటనలూ ఉన్నాయి. 2021 డిసెంబరులో ఇరు కుటుంబాల మధ్య చెడుపు చేస్తున్నారనే అనుమానంతో అనంతగిరి మండలం బగ్మారవలసలో ముగ్గురు హత్యకు గురయ్యారు. అలాగే అదే మండలం కాశీపట్నంలో 2021 అక్టోబరు నెలలో తన అన్నను చెడుపు చేసి చంపారనే నెపంలో మరో వ్యక్తిని హతమార్చిన ఘటన జరిగింది. అలాగే 2015 నవంబరులో డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ రంగిసింగిగూడలో ఓ దిసారీ ఇంటిపై స్థానికులు దాడి చేసి ఆయన్ని దహనం చేశారు. అదే తరహా ఘటన 2024 అక్టోబరు నెలలో డుంబ్రిగుడ మండలం తూటంగి పంచాయతీ ఇసుకలు గ్రామంలో జరిగింది. ఓ దిసారీని హత్య చేసి, మృతదేహాన్ని గ్రామస్థులు దహనం చేశారు. అలాగే జి.మాడుగుల మండలం గడుతూరు ప్రాంతంలోని ఇదే విషయంలో అనుమానంతో ఒక వ్యక్తిని గొడ్డలితో నరికి హతమార్చారు. 2010లో ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీ పట్నాపడాల్‌పుట్‌ ప్రాంతంలోనే తమకు చెడుపు చేయిస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి బాణం వేసి హతమార్చారు. 2012లో పాడేరు మండలం మోదాపల్లి పంచాయతీ పందొర్లు గ్రామంలో చెడుపులు చేస్తున్నారని ఆరోపణతో ఓ వ్యక్తిని హత్య చేసి బావిలో పడేశారు. గతేడాది(2024) జూన్‌ నెలలో పెదబయలు మండలం చుట్టుమెట్ట గ్రామంలో ఓ గిరి మహిళకు బూత వైద్యం చేస్తున్న క్రమంలో గురువు మహదేవ్‌, సహాయకుడుగా ఉన్న త్రినాథ్‌ అనే వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందారు. అయితే వారి మృతికి గల కారణాలపై నేటికీ స్పష్టత రాలేదు. ఇవన్నీ వెలుగులోకి వచ్చిన మచ్చుకు కొన్ని ఘటనలు మాత్రమే. ఈ తరహాలో మారుమూల ప్రాంతాల్లో వెలుగులు రాని అనేక ఘటనలు ఏజెన్సీలో నిత్యకృతం. గిరిజనులు విశ్వసిస్తున్న మూఢనమ్మకాలతో జరుగుతున్న నష్టాలపై వారికి అవగాహన కలిగించి, వాస్తవ పరిస్థితులపై ఛైతన్యం చేస్తేనే గాని ఇటువంటి ఘటనలకు సంపూర్ణంగా అడ్డుకట్ట పడదు. ఆ దిశగా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కృషిచేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Mar 22 , 2025 | 11:30 PM