Share News

పాడేరు మన్యంలో ఇంజనీరింగ్‌ కాలేజీ

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:27 PM

గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాలని, ప్రతి జిల్లాకు ఒక ఇంజనీరింగ్‌ కాలేజీ ఉండాలనే ఆలోచనతో పాడేరు మన్యంలోనూ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు.

పాడేరు మన్యంలో ఇంజనీరింగ్‌ కాలేజీ
108 సూర్య నమస్కారాల బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు

గిరిజన విద్యాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాలి

కలెక్టర్ల సదస్సులో సీఎం నారా చంద్రబాబునాయుడు వెల్లడి

తలసరి ఆదాయ సూచికలో రాష్ట్రంలో మూడో స్థానంలో జిల్లా

అరకులోయలో మరిన్ని హోటళ్ల నిర్మాణం జరగాలన్న సీఎం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాలని, ప్రతి జిల్లాకు ఒక ఇంజనీరింగ్‌ కాలేజీ ఉండాలనే ఆలోచనతో పాడేరు మన్యంలోనూ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబునాయుడు అల్లూరి జిల్లాకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. మన్యంలో ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో ఉన్న ఉన్నత విద్యామండలి సెక్రటరీ కోన శశిధర్‌ను సీఎం ఆదేశించారు. ఏజెన్సీలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, విశాఖపట్నం కేంద్రంగా పారిశ్రామికాభివృద్ధి జరగాలని, దాని ఆధారంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ క్రమంలో ప్రతినిధులు, అతిథులకు అవసమైన హోటళ్లను అరకులోయ ప్రాంతంలో నిర్మించాలని సీఎం సూచించారు. వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరగాలని, ఉత్పాదకత మరింతగా పెంచాలన్నారు.

సగటు తలసరి ఆదాయంలో రాష్ట్రంలో మూడో స్థానం

రాష్ట్రంలో సగటు తలసరి ఆదాయ సూచికలో జిల్లా మూడో స్థానంలో ఉందని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. జిల్లాలో గతేడాది సగటు తలసరి ఆదాయం రూ.లక్షా 79 వేల 391 కాగా, ఈ ఏడాది 2 లక్షల 5 వేల 919లకు పెరిగిందన్నారు. దీంతో అల్లూరి జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. ఏజెన్సీ జిల్లాలు ముందుంటే శ్రీకాకుళం జిల్లా వెనుకబడి ఉండడం ఏమిటని ప్రశ్నించారు. అలాగే పబ్లిక్‌ పీపుల్స్‌ పార్టిసిపేషన్‌(పీపీపీ) సూచికలో అల్లూరి జిల్లా 25వ స్థానంలో ఉందని, దానిని మరింత ముందుకు తీసుకురావాలని సీఎం సూచించారు. స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యం దిశగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని, సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్లకు ప్రత్యేకించి సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, టూరిజం మంత్రి కందుల దుర్గేశ్‌, అధికారులతో కలిసి సమీక్షలు నిర్వహించి అల్లూరి జిల్లా అభివృద్ధికి అవసరమైన కృషి చేయాలన్నారు.

108 సూర్య నమస్కారాల బ్రోచర్‌ ఆవిష్కరణ

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్‌ 7న అరకులోయలో 20 వేల మంది గిరిజన విద్యార్థులతో నిర్వహించే 108 సూర్య నమస్కారాల కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కలెక్టర్ల సదస్సులో బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని సీఎం చంద్రబాబునాయుడును కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆహ్వానించారు. గిరిజన విద్యార్థులతో చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఈ సందర్భంగా కలెక్టర్‌ను సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, మంత్రులు అచ్చెన్నాయుడు, నారా లోకేశ్‌, గుమ్మడి సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 11:27 PM