ఉగాది తరువాత జీఎం కార్యాలయ పనులు
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:04 AM
విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయ (జనరల్ మేనేజర్) భవన నిర్మాణానికి టెండర్లు పిలిచామని, ఉగాది తరువాత ఆ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని డీఆర్‌ఎం లలిత్ బొహ్రా తెలిపారు.

డీఆర్‌ఎం లలిత్ బొహ్రా
వన్‌టౌన్‌లోని పాత స్టేషన్‌ను వినియోగంలోకి తెచ్చే యత్నం
విశాఖపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):
విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయ (జనరల్ మేనేజర్) భవన నిర్మాణానికి టెండర్లు పిలిచామని, ఉగాది తరువాత ఆ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని డీఆర్‌ఎం లలిత్ బొహ్రా తెలిపారు. దొండపర్తిలోని కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు కొన్ని న్యాయపరమైన అడ్డంకులు వల్ల ఆగాయని, ప్రస్తుతం ఇబ్బంది ఏమీ లేదని, అవి కూడా త్వరలోనే మొదలవుతాయన్నారు. వన్‌టౌన్‌లో ఒక పాత స్టేషన్ ఉందని, దానిని వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ఒకటి, రెండు రైళ్లను అక్కడ ఆపే అవకాశం ఉందన్నారు. వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ల ఫ్రీక్వెన్సీ పెంపు, బెంగళూరుకు ఎక్స్‌ప్రెస్ వంటి అంశాలపై విలేకరులు ప్రశ్నించగా, తాను ఇటీవలె విధుల్లో చేరానని, అన్నింటిపై పూర్తి అవగాహన వచ్చాక తగిన చర్యలు చేపడతామన్నారు.
5న భద్రాచలానికి ప్రత్యేక బస్సులు
ద్వారకా బస్‌స్టేషన్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):
శ్రీరామనవమిని పురస్కరించుకొని భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. వచ్చే నెల ఆరో తేదీన సీతారాముల కల్యాణం జరగనున్న నేపథ్యంలో ఐదో తేదీ ఉదయం 6.00 గంటల నుంచి బస్సులు ప్రారంభమవుతాయన్నారు. ప్రతి రెండు గంటలకు ఒక ప్రత్యేక బస్సు ఆపరేట్ చేయాలని ప్రణాళిక తయారు చేశామని, ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా అవసరమైనన్ని ఆపరేట్ చేస్తామని ఆయన వెల్లడించారు. విశాఖ నుంచి సూపర్ లగ్జరీ సర్వీస్‌లో సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లేందుకు రూ.600, రాజమండ్రి మీదుగా భద్రాచలం వెళ్లేందుకు రూ.700 చార్జీగా నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. ఆర్టీసీ వెబ్‌సైట్, రిజర్వేషన్ కౌంటర్, ఆథరైజ్డు ఏజెన్సీల నుంచి సీట్లు రిజర్వు చేసుకోవచ్చునని ఆర్‌ఎం తెలిపారు.