Share News

మహా అవినీతి

ABN , Publish Date - Apr 08 , 2025 | 01:26 AM

మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ జీవీఎంసీ జోన్‌-5 ప్రజారోగ్య విభాగం అవుట్‌సోర్సింగ్‌ సూపర్‌వైజర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

మహా అవినీతి

  • ఏసీబీ వలలో జీవీఎంసీ అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది

  • మరణ ధ్రువీకరణ పత్రం జారీకి రూ.50 వేలు డిమాండ్‌

  • రూ.20 వేలు తీసుకుంటూ పట్టుబడిన జోన్‌-5 కంప్యూటర్‌ ఆపరేటర్‌, సూపర్‌వైజర్‌

విశాఖపట్నం/జ్ఞానాపురం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి):

మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ జీవీఎంసీ జోన్‌-5 ప్రజారోగ్య విభాగం అవుట్‌సోర్సింగ్‌ సూపర్‌వైజర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ నాగేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నారాయణపురానికి చెందిన మండల శ్రీనివాసరావు ఆర్పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా విశాఖలో పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఈ ఏడాది జనవరి ఒకటిన మర్రిపాలెం రైల్వే ట్రాక్‌ వద్ద ప్రమాదవశాత్తూ మరణించారు. శ్రీనివాసరావు మరణ ధ్రువీకరణపత్రం కోసం ఆయన కుమారుడు భానుప్రకాష్‌ జీవీఎంసీ జోన్‌-5 (జ్ఞానాపురం) కార్యాలయంలో ప్రజారోగ్య విభాగంలో జనన, మరణ నమోదు విభాగంలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసే సూపర్‌వైజర్‌ బరకాల వెంకటరమణ, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ దండి సత్యసూర్యనాగపూర్ణచంద్రశేఖర్‌ను కలిశారు. దీనికి రూ.50 వేలు లంచం కావాలని డిమాండ్‌ చేశారు. అంతమొత్తం ఇచ్చుకోలేనని వేడుకుంటూ పలుమార్లు కలిశారు. చివరకు రూ.20 వేలు లంచం ఇస్తేనేగానీ పనిచేయబోమని స్పష్టం చేశారు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని భానుప్రకాష్‌ ఈనెల ఐదున ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఏసీబీ డీజీ అతుల్‌సింగ్‌ అనుమతితో కేసు నమోదుచేసిన ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ నాగేశ్వరావు సోమవారం సాయంత్రం పథకం ప్రకారం జోన్‌-5 కార్యాలయంలో మాటువేసి భానుప్రకాష్‌ నుంచి వెంకటరమణ, సత్యసూర్యనాగపూర్ణచంద్రశేఖర్‌లు లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరి నుంచి రూ.20 వేలు రికవరీ చేయడంతోపాటు సంబంధిత ఫైల్‌ను సీజ్‌ చేశారు. నిందితులు ఇద్దరిని అరెస్టు చేశామని మంగళవారం రిమాండ్‌కు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో ఏలూరు రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ రమ్య, సీఐలు కృష్ణకిషోర్‌, వెంకటరావు, లక్ష్మణరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 01:26 AM