Share News

బడ్జెట్‌పై మహా ఉత్కంఠ

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:50 AM

జీవీఎంసీ బడ్జెట్‌ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఈనెల 29న సమావేశ నిర్వహణకు అధికారులు ఒక వైపు ఏర్పాటుచేస్తుండగా, మరోవైపు మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి కూటమి నేతలు నోటీస్‌ ఇచ్చారని వైసీపీ నేతలు తమ పార్టీ కార్పొరేటర్లను బెంగళూరు తరలించేశారు.

బడ్జెట్‌పై మహా ఉత్కంఠ

  • సమావేశంపై సందిగ్ధం

  • మేయర్‌పై అవిశ్వాసం కోరుతూ నోటీస్‌ ఇచ్చిన కూటమి

  • తమ పార్టీ కార్పొరేటర్లను బెంగళూరు తరలించిన వైసీపీ

  • అవిశ్వాస తీర్మానంపై సమావేశం రోజునే తిరిగి నగరానికి తీసుకువస్తామంటున్న నేతలు

  • మేయర్‌ గైర్హాజరైతే బడ్జెట్‌ సమావేశం ఎలా నిర్వహించాలనే అంశంపై అధికారుల సమాలోచన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ బడ్జెట్‌ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఈనెల 29న సమావేశ నిర్వహణకు అధికారులు ఒక వైపు ఏర్పాటుచేస్తుండగా, మరోవైపు మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి కూటమి నేతలు నోటీస్‌ ఇచ్చారని వైసీపీ నేతలు తమ పార్టీ కార్పొరేటర్లను బెంగళూరు తరలించేశారు. అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుచేసినప్పుడే వారందరినీ నగరానికి తిరిగి తీసుకువస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. మేయర్‌ కూడా బెంగళూరులోనే ఉండిపోతే ఈనెల 29న జరగాల్సిన బడ్జెట్‌ సమావేశం పరిస్థితి ఏమిటనే దానిపై సందిగ్ధత నెలకొంది.

జీవీఎంసీ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ సమావేశాన్ని ఈనెల 29న నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు ఇప్పటికే సభ్యులందరికీ బడ్జెట్‌ ముసాయిదాతోపాటు సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని అందజేశారు. ఈనెల 31లోపు బడ్జెట్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందకపోతే ఏప్రిల్‌ ఒకటి నుంచి జీవీఎంసీ సాధారణ ఖర్చులకు కూడా నిధులు అందుబాటులో ఉండని పరిస్థితి వస్తుంది. అందువల్లే ఆగమేఘాల మీద 29న బడ్జెట్‌ సమావేశం నిర్వహించాలని ననిర్ణయించారు. సమావేశం నిర్వహణకు అధికారులు ఒకవైపు ఏర్పాట్లు చేస్తుండగానే, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం కోరుతూ కూటమి కార్పొరేటర్లంతా జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌కు నోటీసు అందజేశారు. దీంతో వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే జీవీఎంసీలో మొత్తం ఓటింగ్‌ సభ్యులుగా ఉన్న 111 మందిలో 74 మంది ఓటెయ్యాలి. అయితే కూటమికి ఇప్పటికే 75 మంది (11 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులు, 64 మంది కార్పొరేటర్లు) బలం ఉంది. తమకు 31 మంది సభ్యుల బలం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ముందుజాగ్రత్తగా 28 మంది కార్పొరేటర్లను సోమవారం బెంగళూరు తరలించారు. మరో ముగ్గురు కార్పొరేటర్లు వివిధ కారణాలతో క్యాంపునకు రాలేకపోయినా, వారంతా పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటారని ఆశతో ఉన్నారు. ఈనెల 29న జరిగే బడ్జెట్‌ సమావేశానికి వారందరినీ తిరిగి నగరానికి తీసుకువస్తే, కూటమి నేతలు వారిని తమవైపు లాగేసుకునే అవకాశం ఉందనే భయంతో అవిశ్వాస తీర్మానం జరిగిన రోజునే వారిని నగరానికి తీసుకురావాలని భావిస్తున్నారు. అదే జరిగితే 29న జరిగే బడ్జెట్‌ సమావేశానికి మేయర్‌ హాజరు అనుమానమే. మేయర్‌ లేకుండా బడ్జెట్‌ సమావేశం నిర్వహించడానికి సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

కోరం ఉంటే...

బడ్జెట్‌ సమావేశం ఎట్టిపరిస్థితులోనూ ఈ నెలాఖరులోగా నిర్వహించక తప్పని పరిస్థితి కావడంతో మేయర్‌ లేకపోతే ఏం చేయాలనే దానిపై అధికారులు ఆలోచనలో పడ్డారు. మునిసిపల్‌ చట్టంలో ఏదైనా ఒక సమావేశానికి మేయర్‌ హాజరు కానిపక్షంలో డిప్యూటీ మేయర్లతో సమావేశాన్ని నిర్వహించుకునే అవకాశం ఉంది. కానీ జీవీఎంసీలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు కూడా వైసీపీకి చెందినవారే కావడంతో మేయర్‌ రానిపక్షంలో వారిద్దరూ కూడా గైర్హాజరవ్వడం ఖాయం. అలాంటప్పుడు ఏం చేయాలనేదానిపై అధికారులు మునిసిపల్‌ చట్టంపై అవగాహన ఉన్న సీనియర్‌ అధికారులతో చర్చిస్తున్నట్టు తెలిసింది. ఏదైనా ఒక సమావేశం నిర్వహించాలని ముందుగానే అజెండా విడుదల చేస్తే, ఆ సమావేశాన్ని అనుకున్నరోజు ఏర్పాటుచేయాల్సిందేనని చట్టంలో ఉన్నట్టు చెబుతున్నారు. సభ్యుల్లో 1/4 వంతు హాజరైతే సరిపడినంత కోరం ఉన్నట్టుగానే భావించి సమావేశాన్ని ప్రారంభించే వెసులుబాటు ఉందని నిపుణులు చెబుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. సమావేశానికి హాజరైన సభ్యులంతా కలిసి తమలో ఒకరిని ఆ రోజుకు మేయర్‌ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఎన్నుకుంటే వారు ఆ స్థానంలో కూర్చొని సమావేశాన్ని పూర్తిచేయవచ్చునంటున్నారు. దీనికి అవకాశం ఉంటే బడ్జెట్‌ సమావేశం సజావుగానే జరిగిపోతుందని, లేనిపక్షంలో ఏప్రిల్‌ ఒకటి తరువాత జీవీఎంసీ నిర్వహణ ఎలా జరుగుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Mar 26 , 2025 | 12:50 AM