అన్నదాత హ్యాపీ
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:56 AM
మండలంలో ఈ ఏడాది వరి రైతుల పంట పండింది. ఖరీఫ్‌లో వాతావరణం అనుకూలించడంతో వరిలో మంచి దిగుబడులు వస్తున్నాయి. ప్రస్తుతం మండలంలో వరి కుప్పలు నూర్పులు జోరుగా సాగుతున్నాయి. మండలంలోని రైతులు వరి సాగు అనంతరం పైరు పంటగా అపరాలను సాగు చేస్తారు. పొలాల్లో వరి కుప్పలను నూర్చడానికి దారులు లేక అపరాల పంట ముగిసే వరకు రైతులు వరి కుప్పలు నూర్పులు చేపట్టరు.

- వరిలో అధిక దిగుబడులు
- జోరుగా వరి కుప్పల నూర్పిడి పనులు
పాయకరావుపేట రూరల్, మార్చి 22(ఆంధ్రజ్యోతి):
మండలంలో ఈ ఏడాది వరి రైతుల పంట పండింది. ఖరీఫ్‌లో వాతావరణం అనుకూలించడంతో వరిలో మంచి దిగుబడులు వస్తున్నాయి. ప్రస్తుతం మండలంలో వరి కుప్పలు నూర్పులు జోరుగా సాగుతున్నాయి. మండలంలోని రైతులు వరి సాగు అనంతరం పైరు పంటగా అపరాలను సాగు చేస్తారు. పొలాల్లో వరి కుప్పలను నూర్చడానికి దారులు లేక అపరాల పంట ముగిసే వరకు రైతులు వరి కుప్పలు నూర్పులు చేపట్టరు. ప్రస్తుతం అపరాల పంట ముగియడంతో రైతులు వరి కుప్పలను నూర్పిడి చేస్తున్నారు. ఇప్పటికే గుంటపల్లి, గోపాలపట్నం, మాసాహెబ్‌పేట, పాల్తేరు, పెదరాంభద్రపురం గ్రామాలలో అధిక శాతం కుప్పలు నూర్పిడి చేశారు. మండలంలో సాగునీటి కాలువలు, చెరువులు, కింద సత్యవరం, మాసాహెబ్‌పేట, మంగవరం, గోపాలపట్నం, పెంటకోట, శ్రీరాంపురం, పెదరాంభద్రపురం, వెంకటనగరం, కేశవరం, రాజవరం, తదితర గ్రామాల్లో సుమారు మూడు వేల హెక్టార్లలో వరి పంట సాగు చేస్తున్నారు. సాధారణంగా మండలంలో వరి పంట బాగా పండితే ఎకరాకు 25 నుంచి 28 బస్తాల వరకు దిగుబడి వచ్చేది. అయితే ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచి వాతావరణం అనుకూలించి వర్షాలు పడడంతో ఎకరాకు 30 నుంచి 33 బస్తాల వరకు దిగుబడులు వస్తున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల వలన వరి పంట చివర్లో రైతులు నష్టపోయేవారు. ఈ ఏడాది వరి కోతల సమయంలో అల్పపీడనం ప్రభావం వలన ఏర్పడిన తుఫానులు రైతులను భయపెట్టినా వర్షాలు తక్కువగా పడడంతో పెద్దగా నష్టపోలేదు. దాంతో పాటు ప్రారంభం నుంచి వాతావరణం అనుకూలించడంతో రైతులు ఎరువులు, క్రిమి సంహారక మందులను కూడా తక్కువగానే వినియోగించారు. దీంతో సాగు ఖర్చు కూడా తగ్గింది. గింజలలో పొల్లు శాతం బాగా తక్కువగా ఉందని రైతులు చెబుతున్నారు.