మెడికల్ షాపుల్లో తనిఖీలు
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:02 AM
నగరంలోని మెడికల్ షాపులు, మందులు సరఫరా చేసే ఏజెన్సీలలో ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో శుక్రవారం విస్తృత స్థాయిలో సోదాలు జరిగాయి.

ఈగల్ టీమ్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు కలిసి బృందాలుగా ఏర్పడి సోదాలు
మత్తు ఇంజక్షన్లు విక్రయంపై ఆరా
విశాఖపట్నం/మహారాణిపేట/గాజువాక, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని మెడికల్ షాపులు, మందులు సరఫరా చేసే ఏజెన్సీలలో ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో శుక్రవారం విస్తృత స్థాయిలో సోదాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈగల్ టీమ్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు కలిసి బృందాలుగా విడిపోయి గాజువాక, జ్ఞానాపురం, అల్లిపురం, ఎంవీపీ కాలనీ, అల్లిపురం...ఇలా అనేకచోట్ల తనిఖీలు చేశారు. మందుల పేరుతో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయా? అని పరిశీలించారు. సాధారణంగా అల్ర్పాజోలమ్, ట్రమడోల్ వంటి ఇంజెక్షన్లు మత్తును కలిగిస్తాయి. వీటిని డాక్టర్ చీటీ లేకుండా విక్రయించకూడదు. అలాంటివేమైనా జరుగుతున్నాయా?...అని అధికారులు పరిశీలించారు. అయితే ఎక్కడా అలాంటివి బయటపడినట్టు అధికారులు ప్రకటించలేదు. గాజువాకలో మోహినీ థియేటర్ సమీపాన గల ఎస్‌ఎస్‌వీ మెడికల్ షాపులో రాత్రి తొమ్మిది గంటల వరకు సోదాలు జరిగాయి. అయితే మార్చి నెలాఖరు, ఆర్థిక సంవత్సరం చివరి రోజులు కావడంతో గడువు ముగిసిన మందులను పక్కనపెట్టి ఏజెన్సీలకు వెనక్కి పంపిస్తారు. అధికారులు వాటిని పట్టుకొని నిర్వాహకులను గద్దించినట్టు సమాచారం. కౌంటర్ సేల్స్, ఇతర అంశాలపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు సమాచారం తీసుకున్నారు. అయితే ఎక్కడా మత్తుమందులు పట్టుకున్నట్టు అధికారులు వెల్లడించలేదు.
‘రేషన్ బియ్యం మాఫియా’పై ఆరా
పౌర సరఫరాల శాఖా మంత్రి దృష్టికి వ్యవహారం
సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఆదేశాలు
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
గాజువాక, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):
రేషన్ బియ్యం మాఫియాపై విజిలెన్స్ అధికారులు దృష్టిసారించారు. ‘రేషన్ మాఫియా’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న విషయాన్ని పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన స్పందించి సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. మరోవైపు విజిలెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. గాజువాక ప్రాంతంలో రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నది ఎవరు?, ఎక్కడకు తరలిస్తున్నారు?, ఎవరెవరు సహకరిస్తున్నారు?...అనే సమాచారం సేకరించే పనిలో ఉన్నారు.