Share News

ఉపాధిలో అక్రమాలు

ABN , Publish Date - Mar 22 , 2025 | 01:03 AM

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలు జరుగుతున్నాయి. మట్టి పనులకు రాకుండానే హాజరైనట్టు మస్తర్లు వేసి నిధులు స్వాహా చేస్తున్నారు. రహదారుల పక్కన పచ్చదనం కోసం మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నట్టు రికార్డుల్లో చూపుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మొక్కలకు నీరు పోసేవారు లేక ఎండిపోయాయి.

ఉపాధిలో అక్రమాలు
బుచ్చెయ్యపేట మండలంలో వెదుళ్లగెడ్డ వంతెన నుంచి రాజాం వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా ఆలనాపాలనా లేని మొక్కలు

మొక్కల పేరుతో పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగం

రహదారుల పక్కన పచ్చదనం పెంచాలని ప్రభుత్వ నిర్ణయం

20230-24లో జిల్లాలోని 12 మండలాల్లో 7,095 మొక్కలు నాటించిన అధికారులు

రెండేళ్లపాటు సంరక్షణకు ఒక్కో మొక్కకు రూ.305 చొప్పున చెల్లింపు

ప్రతి 200 మొక్కల పర్యవేక్షణకు ఒక ఉపాధి కూలీ నియామకం

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

క్షేత్రస్థాయిలో పదో వంతు కూడా కానరాని మొక్కలు

సామాజిక తనిఖీల్లో వెలుగు చూస్తున్న అక్రమాలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలు జరుగుతున్నాయి. మట్టి పనులకు రాకుండానే హాజరైనట్టు మస్తర్లు వేసి నిధులు స్వాహా చేస్తున్నారు. రహదారుల పక్కన పచ్చదనం కోసం మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నట్టు రికార్డుల్లో చూపుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మొక్కలకు నీరు పోసేవారు లేక ఎండిపోయాయి.

ఉపాధి హామీ పథకం కింద రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంచడానికి మొక్కలు నాటించి, వాటికి నీరు పోసి సంరక్షించేలా చర్యలు చేపట్టాలని డ్వామా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 2023-24లో అనకాపల్లి మండలంలో 850 మొక్కలు, గొలుగొండలో 975, కె.కోటపాడులో 480, కశింకోటలో 625, కోటవురట్లలో 625, మాడుగులలో 2,600, మాకవరపాలెంలో 300, నర్సీపట్నంలో 75, నాతవరంలో 175, రాంబిల్లిలో 300, సబ్బవరంలో 200, ఎలమంచిలిలో 115 మొక్కల చొప్పున మొత్తం 7,095 మొక్కలను సుమారు 18 కిలోమీటర్ల పొడవున నాటించారు. వీటికి రోజూ నీరు పోయడంతోపాటు పశువులు తినకుండా రక్షణ ఏర్పాట్లు చేయాలి. గోతులు తీయడం, మొక్కలు నాటడం, వాటిని నీరు పోయడం, సంరక్షించడం వంటి పనులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. నిబంధనల ప్రకారం మొక్క నాటినప్పటి నుంచి రెండేళ్ల వరకు మొదటి సంవత్సరంలో 40 సార్లు, రెండో సంవత్సరంలో 25 సార్లుచొప్పున మొత్తం 65 సార్లు నీటిని అందించాలి. ఒకసారి మొక్కకు నీరు పెట్టినందుకు సంరక్షకునికి రూ.4.7 వంతున రెండేళ్లలో రూ.305 వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రతి 200 మొక్కల సంరక్షణకు స్థానిక ఉపాధి కూలీని ఒకరిని నియమించి, మొక్కల సంరక్షణ. ఎరువులు వేయడం, రెండు పర్యాయాలు కంచె వేసినందుకు కొంత మొత్తం కేటాయిస్తారు. ఇది సుమారు రెండు వేల రూపాయల వరకు వుంటుంది. జిల్లాలోని 12 మండలాల్లో 2023-24లో ఏడువేలకుపైగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, ఇతర పనులకు నిధులు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో చూపారు. కానీ వీటిలో ప్రస్తుం పదో వంతు మొక్కలు కూడా కనిపించడంలేదు.

అనకాపల్లి, కశింకోట మండలాల్లో 2023-24లో ఉపాఽధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై ఇటీవల జరిగిన సామాజిక తనిఖీల్లో సిబ్బంది చేతివాటం బయటపడింది. తుమ్మపాల, భట్లపూడి, మామిడిపాలెం, మాకవరం, మెట్టపాలెం, ఆర్‌వీపాలెంలలో అప్పుడు నాటిన మొక్కలు ఇప్పుడు కనిపించడం లేదని తేల్చారు. కశింకోట మండలం జమాదులపాలెంలో, బుచ్చెయ్యపేట మండలంలో వెదుళ్లగెడ్డ నుంచి రాజాం వెళ్లే రహదారి పక్కన నాటిన మొక్కల్లో సగానికిపైగా ఎండిపోయినట్టు తెలిసింది. జిల్లాలోని ఇతర మండలాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

ఉపాధి హామీ పథకం నిధులతో ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మొక్కలు నాటిస్తుండగా, వాటి సంరక్షణ, ఎదుగుదల ఎలా వుందో పైస్థాయి అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. కనీసం పర్యవేక్షించడం కూడా చేయడంలేదు. దిగువస్థాయి సిబ్బంది ఇచ్చే నివేదికలపై సంతకాలు పెడుతూ బిల్లులు మంజూరు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా సామాజిక తనిఖీలు జరిగినప్పుడు ఆ శాఖ ఉన్నతాధికారులే పర్యవేక్షకులుగా వ్యవహరిస్తుండడంతో ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలు వెలుగులోకి రావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉపాధి హామీ పథకం పనుల్లో జరుగుతున్న అక్రమాలపై అందిన ఫిర్యాదులపై విచారణ జరిపిస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం వుంది.

Updated Date - Mar 22 , 2025 | 01:03 AM