శ్రీనగర్‌లో భారీ చోరీ
ABN , Publish Date - Mar 21 , 2025 | 01:04 AM
గాజువాకలోని శ్రీనగర్‌లో భారీ చోరీ జరిగింది. సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు అపరహణకు గురయ్యాయి. గాజువాక క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

15 తులాల బంగారు ఆభరణాల అపహరణ
గాజువాక, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): గాజువాకలోని శ్రీనగర్‌లో భారీ చోరీ జరిగింది. సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు అపరహణకు గురయ్యాయి. గాజువాక క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీనగర్‌లోని ఓ ఇంట్లో టి.నాగలక్ష్మి అనే మహిళ ఒకరే ఉంటున్నారు. బుధవారం రాత్రి ఓ వివాహానికి ఆమె హాజరై తిరిగి అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇంటికి వచ్చారు. ఇంట్లో బీరువా తెరిచి ఉండడంతో అనుమానంతో చూడగా, లోపల ఉంచిన 15 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో నాగలక్ష్మి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి వెనక తలుపును విరగ్గొట్టి దొంగలు చొరబడినట్టు పోలీసులు గుర్తించారు. కాగా బీరువాకు తాళాలు వేసి దానికే వదిలివేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని క్రైమ్ ఏసీపీ డి.లక్ష్మణరావు, సీఐ కె.శ్రీనివాసరావులు పరిశీలించారు. ఈ మేరకు క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.