జిల్లా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
ABN , Publish Date - Mar 30 , 2025 | 10:34 PM
జిల్లా ప్రజలంతా ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆకాంక్షించారు.

జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్
అర్చకులకు, పండితులకు ఘన సత్కారం
ఆర్భాటంగా విశ్వావసు నామ ఉగాది వేడుకలు
పాడేరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజలంతా ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆకాంక్షించారు. స్థానిక మోదకొండమ్మ ఆలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన విశ్వావసు నామ ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమాన్ని అందించి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతోనే పాలన సాగిస్తుందన్నారు. ఉగాది వేడుకలను ప్రతి జిల్లా కేంద్రంలోనూ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. అలాగే ఏజెన్సీలోని గిరిజన అర్చకులను మరింతగా ప్రోత్సహించాలని, ఆలయాల నిర్మాణానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా పండితులు సాయి ప్రశాంతశర్మ పంచాంగ శ్రవణం చేసి, ఈ ఏడాది రాశి ఫలాలు, ఆదాయ, వ్యయాలను వివరించారు. పలువురు తెలుగు పండితులు కవి సమ్మేళనం నిర్వహించారు. అలాగే కలెక్టర్ దినేశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి, సబ్‌కలెక్టర్ శార్యమన్‌పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, తదితరులు ఉగాది పచ్చడిని ఆరగించారు.
అర్చకులు, తెలుగు పండితులకు ఉగాది సత్కారాలు
విశ్వావసు నామ ఉగాది వేడుకల్లో భాగంగా గిరిజన ప్రాంతంలోని ప్రధాన అర్చకులు, కవి సమ్మేళనం నిర్వహించిన తెలుగు పండితులను జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తదితరులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అలాగే అరకులోయ వెంకటేశ్వరస్వామి ఆలయం అర్చకులు బాలగణేశ్‌కు, పాడేరు మండలం సూకూరు రామలింగేశ్వర ఆలయం అర్చకులు రామకృష్ణ పరమహంసకు, జి.మాడుగుల మండలం వంతాల రామాలయం అర్చకులు వంతల అప్పలనాయుడుకు, పాడేరు మండలం రాయిగెడ్డ రామాలయం అర్చకులు కించే సత్యనారాయణలకు ఉగాది కానుకలుగా ఒక్కొక్కరికి రూ.10,116 చొప్పున అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సబ్‌కలెక్టర్ శార్యమన్‌పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళీ, జిల్లా ఉద్యానవనాధికారి రమేశ్‌కుమార్‌రావు, డ్వామా పీడీ డాక్టర్ విద్యాసాగరరావు, మైక్రో ఇరిగేషన్ పీడీ రహీమ్, తహసీల్దార్ వి.త్రినాఽధరావునాయుడు, సర్పంచ్ కొట్టగుళ్లి ఉషారాణి, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, మోదకొండమ్మ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటినాయుడు, దేవదాయ శాఖ అధికారులు, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.