Share News

7న మెగా యోగాసనాల అభ్యాసన

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:03 PM

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్‌ 7వ తేదీన నిర్వహించే మెగా యోగాసనాల అభ్యాసన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

7న మెగా యోగాసనాల అభ్యాసన
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ వెల్లడి

20 వేల మంది విద్యార్థులతో నిర్వహించేందుకు సన్నాహాలు

పాడేరు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్‌ 7వ తేదీన నిర్వహించే మెగా యోగాసనాల అభ్యాసన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. మెగా యోగాసనాల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అరకులోయ మండల కేంద్రంలో ఏప్రిల్‌ 7న 20 వేల మంది విద్యార్థులతో మెగా యోగాసన అభ్యాసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అందుకు గానూ అరకులోయ డిగ్రీ కళాశాల మైదానాన్ని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలతో పాటు పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. విద్యార్థుల రవాణాకు అవసరమైన బస్సులను నడిపేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని, మైదానంలో తాగునీటి సదుపాయాలు, రవాణా, విద్యుత్‌, స్టేజ్‌ ఏర్పాట్లు, పార్కింగ్‌ ప్రదేశాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలందించేందుకు వైద్య శిబిరంతో పాటు ఐదు అంబులెన్సులను అక్కడ సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజాప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని, వారికి ప్రత్యేకంగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి యోగాసన అభ్యాసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ కోరారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌(టీడబ్ల్యూ) లోకేశ్‌, డీఎస్‌పీ సహబాజ్‌ అహ్మద్‌, జిల్లా పంచాయతీ అధికారి బి.లవరాజు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ కె.వేణుగోపాల్‌, ఏఈఈ అభిషేక్‌, జిల్లా సివిల్‌ సప్లై అధికారి బి.గణేశ్‌, టీడబ్ల్యూ డీడీ ఎల్‌.రజని, యోగ గురువు పతంజలి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 11:03 PM