Nagpur : ‘సమాధి’ రాజకీయం
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:15 AM
మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ పరివార్ సంస్థలు నిర్వహించిన నిరసన ప్రదర్శనకు, పలు అసత్యప్రచారాలు కూడా తోడై నాగపూర్ తీవ్ర మతహింసను చవిచూసింది.

మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ పరివార్ సంస్థలు నిర్వహించిన నిరసన ప్రదర్శనకు, పలు అసత్యప్రచారాలు కూడా తోడై నాగపూర్ తీవ్ర మతహింసను చవిచూసింది. దీనిని ఖండిస్తూ, ఔరంగజేబు సమాధి వర్తమానంలో ఒక అనవసరపు అంశంగా ఆరెస్సెస్ వ్యాఖ్యానించడం అత్యధికులకు ఆశ్చర్యం కలిగించింది. నాగపూర్ ఆరెస్సెస్ కేంద్రస్థానం కావడమే కాక, ఔరంగజేబు సహా మొగల్ చక్రవర్తులంతా పరివార్ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాగపూర్ కార్యాలయం పెద్దలకు తెలియకుండానే ఈ వివాదం రేగి, ఇంత హింసాకాండ జరిగిందని అధికులకు ఎందుకో నమ్మకం కలగడం లేదు. చిన్ననిప్పురవ్వచాలు, కాస్తంత గాలితోడైతే ఎన్ని కొంపలనైనా తగలబెట్టవచ్చును. నాగపూర్ హింస కార్యకారణసంబంధాలకంటే, మొత్తంగా మొగల్స్ చుట్టూ ఎంతోకాలంగా సాగుతున్న మత రాజకీయం, వారి సమాధులు, నిర్మాణాలు నిరంతర లక్ష్యాలుగా మారుతూండటం ప్రధానంగా గమనించాలి. ఎవరో అంటిస్తే తప్ప, మత హింస తనకుతానుగా రాజుకోదు. ఈ హింస వెనుక లోతైన, ముందస్తు కుట్ర ఉన్నదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. ఆయన ఎవరిని లక్ష్యంగా చేసుకొని, ఏ కోణంలో ఆ మాటన్నారో తెలియదు కానీ, పెద్దగా ప్రాచుర్యం లేకుండా పడివున్న ఓ మూడువందల ఏళ్ళకు పైబడిన సమాధిని తొలగించాలని పరివార్ కార్యకర్తలు డిమాండ్ చేయడం వెనుక మాత్రం స్పష్టమైన ఆదేశాలు, నిర్దేశిత లక్ష్యాలూ ఉన్నాయి. ఇటీవలే పేరుమార్చిన ఔరంగాబాద్‌కు సమీపంలోని ఖుల్దాబాద్‌లో పెద్దగా పోల్చుకోవడానికి కూడా గొప్ప ఆనవాళ్ళు లేని ఆ కట్టడం వారిని ఆగ్రహంతో ఊపేస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రే ఆ కట్టడంమీద అంత ద్వేషం ప్రకటించినప్పుడు కర్తవ్యనిర్వాహకులను, కరసేవకులను తప్పుబట్టి ప్రయోజనం లేదు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఉన్నందున, ఖర్మకాలి దానిని కాపాడవలసివస్తున్నదన్న రీతిలో ఫడ్నవీస్ నిండుసభలో వ్యాఖ్యానించారు.
ఆ కట్టడం ఊసెత్తడమే మహాపాపం అన్నట్టుగా ఎంతో తేలికగా మాట్లాడారు. ఇక, ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత ఘట్టాలతో కూడిన ఒక నవల ఆధారంగా తయారైన ఛావా సినిమా మీద ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను లోతుగా గమనించినప్పుడు, నాగపూర్ హింసకు కారణమని ఆయన ఈ సినిమాను తప్పుబట్టినట్టు కనబడదు. పైగా, ఆయన ఈ చిత్రాన్ని అమితంగా ప్రశంసించారు, అందులో చెప్పినవన్నీ నిజాలేనని, చూపినవన్నీ చారిత్రక సత్యాలేనని నిర్ధారించారు. ఆ సినిమా చూసి, అసలు చరిత్రను తెలుసుకొని గుండెలు రగిలినందునే ఈ హింస జరిగిందన్న రీతిలో మాట్లాడారు. నాగపూర్ హింసకు ఎంతో ముందునుంచే సదరు చిత్రం చుట్టూ రాజకీయం నడవడం, ప్రధాని సహా బీజేపీ పెద్దలంతా చిత్రాన్ని మెచ్చుకోవడం, దాని విజయోత్సవ వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొని ప్రోత్సహించడం చూశాం. అందులో ఉన్నది చరిత్ర కాదని, కల్పన అని, ఔరంగజేబు క్రూరుడు కాదని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ ఆజ్మీ వ్యాఖ్యానిస్తే, మరాఠా వారసత్వాన్ని అవమానించిన ద్రోహి అంటూ మహాయుతి నాయకులంతా ఆయనను సభనుంచి గెంటివేయడమూ తెలిసిందే. మొన్నటివరకూ ముఖ్యమంత్రిగా ఉన్న శిందేకు ఏకంగా ఈ సందర్భంలో ఒసామా బిన్ లాదెన్ కూడా గుర్తుకొచ్చాడు. ఔరంగజేబు సమాధిని కూల్చాలన్న డిమాండ్ పైస్థాయి బీజేపీ నేతలతోనే పుట్టింది. రాణేలు, శిందేలు, భోసాలేలు పద్ధతిప్రకారం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే, మా అందరిదీ ఒకేమాట, కానీ, కాంగ్రెస్ ఏలుబడిలో ఏఎస్‌ఐ రక్షణ దక్కడంతో దానిని విధిలేక కాపాడవలసి వస్తున్నదని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పిన తరువాత, అది ఒక సందేశంగా, నెరవేర్చాల్సిన లక్ష్యంగా దిగువస్థాయికి చేరడం సహజం. తీవ్ర హింస, విధ్వంసం, వందలాది అరెస్టులతో ప్రస్తుతానికి పరిస్థితులు సద్దుమణిగినట్టు కనిపిస్తున్నప్పటికీ, త్వరలోనే ఔరంగజేబు సమాధికి బాబరీమసీదు గతే పడుతుందన్న హెచ్చరికలు భవిష్యత్ పరిణామాలకు సంకేతాలు. దేశ ఆర్థిక రాజధానినీ, పారిశ్రామికంగా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాన్నీ ఇటువంటి వివాదాలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత దేవేంద్ర ఫడ్నవీస్ మీద ఉంది.