Share News

కదిలిన వైద్య బృందం

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:25 PM

మండలంలోని దేవరాపల్లి పంచాయతీ పెదపాడు, చీడిగొంది గ్రామాల్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు చింతపల్లి ఏరియా ఆస్పత్రి చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ జి.ప్రభావతి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు.

కదిలిన వైద్య బృందం
పెదపాడులో చిన్నారులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ ప్రభావతి

పెదపాడు, చీడిగొందిలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు

చిన్నారులకు వైద్య పరీక్షలు

పరిస్థితి విషమంగా ఉన్న 12 మంది బాలలు చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలింపు

గూడెంకొత్తవీధి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దేవరాపల్లి పంచాయతీ పెదపాడు, చీడిగొంది గ్రామాల్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు చింతపల్లి ఏరియా ఆస్పత్రి చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ జి.ప్రభావతి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండు గ్రామాల్లో పరిస్థితి విషమంగా ఉన్న 12 మంది బాలబాలికలను అంబులెన్సులో ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. పెదపాడు గ్రామంలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మరణించడం, బాలబాలికలు వ్యాధులతో బాధపడుతూ వైద్యం కోసం ఎదురుచూస్తుండడంతో ‘పెదపాడులో విషాదం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడంతో కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ స్పందించారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జమాల్‌ బాషాను కలెక్టర్‌ ఆదేశించారు. డీఎంహెచ్‌వో ఆదేశాలతో జీకేవీధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అచ్యుత్‌, ఏరియా ఆస్పత్రి చిన్నపిల్లల వైద్యనిపుణులు జి.ప్రభావతి, వైద్య సిబ్బంది గ్రామాన్ని సందర్శించారు. పెదపాడు, చీడిగొంది గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పెదపాడు గ్రామంలో నలుగురు, చీడిగొందిలో ఎనిమిది మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రత్యేక అంబులెన్సులో చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ 12 మంది చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా పెదపాడు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన చిన్నారులకు ఎంఎల్‌హెచ్‌పీ మందులు అందజేసిందని, తల్లిదండ్రులు మందులు పట్టకుండా గురువు వద్దకు తీసుకొని వెళ్లి సంప్రదాయ వైద్యం చేయించడం వల్ల వ్యాధి తీవ్రమై మరణించినట్టు వైద్యులు గుర్తించారని డీఎంహెచ్‌వో తెలిపారు. గిరిజనులు చిన్నారులకు నాటు వైద్యం, పసర మందులు పట్టరాదని, వ్యాధి సోకిన వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చి మెరుగైన వైద్యం పొందాలని ఆయన సూచించారు. ఈ ప్రత్యేక వైద్యశిబిరంలో పీహెచ్‌ఎన్‌ ద్వారకబాయి, ఎంఎల్‌హెచ్‌పీ లింగేశ్వరి, ఏఎన్‌ఎం బాలమ్మ, హెచ్‌ఏ సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 11:25 PM