Share News

సారా నిర్మూలనకు నవోదయం 2.0

ABN , Publish Date - Mar 20 , 2025 | 10:54 PM

సారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యమని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. సారా నిర్మూలనపై ఎక్సైజ్‌, పోలీస్‌, రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

సారా నిర్మూలనకు నవోదయం 2.0
ఎక్సైజ్‌ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

పాడేరులో సారా నిర్మూలన ప్రచార రథం ప్రారంభం

పాడేరు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): సారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యమని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. సారా నిర్మూలనపై ఎక్సైజ్‌, పోలీస్‌, రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని, సారా నిర్మూలనకు గ్రామస్థులు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిల్లో ప్రత్యేకాధికారులను నియమిస్తామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో సారా నిర్మూలన చర్యలు చేపట్టాలన్నారు. సారా తయారీదారులకు గ్రామస్థులు సహకరిస్తే, ఆయా గ్రామాలకు ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయని ప్రజలకు వివరించాలన్నారు. సారా తయారీని విడిచిపెట్టిన వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, సారా తయారీకి బెల్లం సరఫరాదారులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలన్నారు. అలాగే సారా తయారు చేసే గ్రామాలను ఏ కేటగిరీగా, పంపిణీ చేసే గ్రామాలను బీ కేటగిరీగా, సారా వినియోగించే గ్రామాలను సీ కేటగిరీగా విభజించాలన్నారు. ఆయా గ్రామాలపై దాడులు చేసి నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. సారా వినియోగం వల్ల కలిగే నష్టాలను, చెడు ప్రభావాన్ని వినియోగదారులకు వివరించాలన్నారు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో సారా తయారీ, వినియోగం లేదని అధికారులు నిర్ధారించి, వాటిని సారా రహిత గ్రామంగా ప్రకటించాలన్నారు. సారా తయారీపై 14405 టోల్‌ఫ్రీ నంబరుకు సమాచారం అందించాలన్నారు. జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ మాట్లాడుతూ గంజాయి మాదిరిగానే సారా నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు సమన్వయంతో పని చేయాలని, గ్రామాల్లోని మహిళా సంఘాల సహకారం తీసుకోవాలన్నారు. అనంతరం ఎక్సైజ్‌ శాఖ సమకూర్చిన ప్రచార రథాన్ని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ శాఖఅసిస్టెంట్‌ కమిషనర్‌ ఎన్‌.సుజిత్‌సింగ్‌, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పి.నాగరాహుల్‌, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌, పాడేరు సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, రంపచోడవరం సబ్‌కలెక్టర్‌ కల్పశ్రీ, జిల్లా పంచాయతీ అధికారి బి.లవరాజు, జిల్లా గ్రామ సచివాలయాల నోడల్‌ అఽధికారి పీఎస్‌ కుమార్‌, టీడబ్ల్యూ డీడీ ఎల్‌.రజని, ఎక్సైజ్‌, పోలీస్‌, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 10:54 PM