నూకాంబికకు పట్టు వస్ర్తాల సమర్పణ
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:10 AM
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాల ప్రారంభం సందర్భంగా శనివారం ఉదయం రాష్ట్ర గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖా మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి వచ్చిన మంత్రి రవీంద్ర, ఎంపీ సీఎం రమేశ్ దంపతులు, ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబులకు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి, ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఉత్సవ ప్రత్యేకాధికారిణి కె.శోభారాణి, ఈవో వెంపల్లి రాంబాబు స్వాగతం పలికారు.

- అమ్మవారిని దర్శించుకున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు
అనకాపల్లి టౌన్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాల ప్రారంభం సందర్భంగా శనివారం ఉదయం రాష్ట్ర గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖా మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి వచ్చిన మంత్రి రవీంద్ర, ఎంపీ సీఎం రమేశ్ దంపతులు, ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబులకు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి, ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఉత్సవ ప్రత్యేకాధికారిణి కె.శోభారాణి, ఈవో వెంపల్లి రాంబాబు స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయంలోకి మంత్రి, ఎంపీ దంపతులు పట్టు వస్త్రాలు తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. కల్యాణ మండపంలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆలయ అర్చకులు ఆశీర్వాదం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీనులు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులను సత్కరించి అమ్మవారి చిత్రపటాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, కొప్పుల వెలమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా, ఆర్డీవో షేక్ ఆయీషా, డీఎస్పీ శ్రావణి, ఉత్సవ కమిటీ సభ్యులు సూరే సతీశ్, దాడి రవికుమార్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, దాడి జయవీర్, పట్టణశాఖ అధ్యక్షుడు డాక్టర్ కేకేవీఏ నారాయణరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కాగా కొత్త అమావాస్య కావడంతో జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి బాలాలయంలోని అమ్మవారిని దర్శించుకున్నారు.
రూ.10 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం
నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణాన్ని రూ.10 కోట్లతో చేపడుతున్నట్టు ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కృషి ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నూకాంబిక జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఆనందదాయకమన్నారు. దేవాలయ నిర్మాణం, అభివృద్ధి పనులు పూర్తయిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు.