సమస్యలకు సత్వర పరిష్కారం
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:40 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమంలో సమస్యలపై ప్రజలు సమర్పించే వినతులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.

అధికారులకు కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశం
మీకోసం కార్యక్రమంలో 129 వినతుల స్వీకరణ
పాడేరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమంలో సమస్యలపై ప్రజలు సమర్పించే వినతులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. మీకోసంలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సంబంధిత శాఖలకు పంపిస్తామని, వాటిని పక్కాగా పరిశీలించి, పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.
మీకోసంలో 129 వినతులు
ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)లో ప్రజల నుంచి 129 వినతులె వచ్చాయి. జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి పద్మలత, డిప్యూటీ సెషల్ డిప్యూటీ కలెక్టర్ (టీడబ్ల్యూ) లోకేశ్‌తో కలిసి గిరిజనుల నుంచి 129 అర్జీలను స్వీకరించారు. వాటిలో తాగునీరు, రోడ్లు, విద్యుత్, అటవీ హక్కు పత్రాలు, భూ సమస్యలపై అధికంగా వినతులు అందాయి. పాడేరు మండలం కిండంగి గ్రామంలో ప్రధానమంత్రి జన్‌మన్ పథకంలో నిర్మించిన ఇళ్లకు రోడ్లు నిర్మించాలని పి.కాంతమ్మ, వి.విజయలక్ష్మి, తదితరులు కోరగా, ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సర్పంచ్ భాగ్యవతి కోరారు. అలాగే అనంతగిరి మండలం లుంగపర్తి పంచాయతీ ఓనుగొండ గ్రామానికి తారురోడ్డు నిర్మించాలని గెమ్మిలి రాజు, డి.శరత్ కోరగా, జి.మాడుగుల మండలం గెమ్మిలి పంచాయతీ కొత్తడిగొంది గ్రామంలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని జి.బాలేసు వినతిపత్రం సమర్పించారు. అలాగే పెదబయలు మండలం నుర్మతి పంచాయతీ చెరువువీధి గ్రామం శ్రీపురం గ్రామానికి రోడ్డు నిర్మించాలని బీబీ.పడాల్, వంతాల వెంకటరావు కోరగా, హుకుంపేట మండలం దుర్గం పంచాయతీలో నేరేడువలస, దుర్గం, పాలమామిడి, గొడ్డుమామిడి, సరసపాడు, పాటి గరువు, బంగారంగరువు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కొత్తవి వేయాలని దుర్గం సర్పంచ్ పి.రమణమ్మ వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ శాఖ ఈఈ బాలసుందరబాబు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ జవహర్ కుమార్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈలు కె.వేణుగోపాల్, జి.డేవిడ్‌రాజు, గిరిజన సంక్షేమ విద్యా శాఖ డీడీ ఎల్.రజని, ఐటీడీఏ ఏవో ఎం.హేమలత, పశుసంవర్థక శాఖ డీడీ నరసింహులు, సచివాలయాల జిల్లా నోడల్ అధికారి పీఎస్.కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.