సాగునీటి వనరులకు మోక్షం
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:46 AM
మండలంలో పది సాగునీటి వనరులకు మరమ్మతులు, నిర్వహణ పనులకు నిధులు మంజూరు చేయాలని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించి, ఖరీఫ్ ఆరంభం నాటికి పూర్తి చేస్తామని చెబుతన్నారు.

మాకవరపాలంలో వివిధ పనులకు రూ.3.16 కోట్లతో ప్రతిపాదనలు
నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభం
ఖరీఫ్ మొదలయ్యేనాటికి పూర్తిచేస్తామని జేఈ వెల్లడి
మాకవరపాలెం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): మండలంలో పది సాగునీటి వనరులకు మరమ్మతులు, నిర్వహణ పనులకు నిధులు మంజూరు చేయాలని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించి, ఖరీఫ్ ఆరంభం నాటికి పూర్తి చేస్తామని చెబుతన్నారు.
మండలంలో పలు సాగు నీటి వనరులు వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. కాలువలు, గ్రోయిన్లు వంటివి వాటికి నిర్వహణ కొరవడి పొలాలకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జి.కోడూరులో జాగారాల గెడ్డ ఆనకట్ట కింద 300 ఎకరాల ఆయకట్టు వుంది. నాలుగేళ్ల క్రితం వరద ఉధృతికి గట్టు కొట్టుకుపోయింది. దీంతో సమీపంలోని పొలాల్లో ఇసుక మేటలు వేసింది. వైసీపీ అధికారంలో వున్నంత వరకు దీనికి మరమ్మతులు చేపట్టలేదు. అలాగే తూటిపాల గుడబాల గెడ్డ గ్రోయిన్ ఐదేళ్ల కిందట వరదలకు కొట్టుకుపోయింది. దీనికింద సుమారు 400 ఎకరాల ఆయకట్టు ఉంది. గ్రోయిన్ పునర్నిర్మాణం చేపట్టకపోవడంతో రైతులు వర్షాలపై ఆధార పడి పంటలు సాగు చేసుకోవాల్సి వస్తున్నది. మామిడిపాలెం రిజర్వాయర్‌లో పూడిక పేరుకుపోయి వచ్చిన నీరు వచ్చినట్టే బయటకు పోతున్నది. చినరాచపల్లి రిజర్వాయర్ గేట్లు మరమ్మతులకు గురికావడంతో నీరు వృథాగా పోతున్నది. పంట చేతికి వచ్చే దశలో నీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. గిడుతూరు చుక్కలయ్య చెరువు సాగునీటి కాలువ పూర్తిగా పూడుకుపోయింది. ఏటా రైతులు నిధులు సమకూర్చుకొని పూడిక పనులు చేపడుతున్నారు. మాకవరపాలెం మెరక కాలువ గేట్లు మరమ్మతులకు గురికావడంతో నీరంతా వృథాగా పోతున్నది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సాగునీటి వనరుల అభివృద్ధిపై పాలకులు దృష్టి సారించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండల అధికారులు అంచనాలు తయారు చేశారు. సాగునీటి సంఘాల వారీగా మరమ్మతు పనులకు నిధులు మంజూరు కోసం రూ.3.16 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు ఇరిగేషన్ జేఈ రామన్నపాత్రుడు తెలిపారు. మాకవరపాలెం ఛానెల్‌కు రూ.19.8 లక్షలు, మల్లవరం ఛానెల్ రూ.42.8 లక్షలు, తూటిపాల ఛానెల్ రూ.39.8 లక్షలు, జి.కోడూరు ఛానెల్ రూ.63 లక్షలు, పెద్దిపాలెం ఛానెల్ రూ.20 లక్షలు, బూరుగుపాలెం ఛానెల్ రూ.39.2 లక్షలు, జంగాలపల్లి ఛానెల్ రూ.19.6 లక్షలు, పైడిపాల ఛానెల్ రూ.19.5 లక్షలు, తాడపాల ఛానెల్ రూ.19.5 లక్షలు, బయ్యవరం ఛానెల్‌కు రూ.20 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపట్టి, ఖరీఫ్ ప్రారంభంనాటికి పూర్తి చేస్తామని జేఈ చెప్పారు.