ఆగిన చెరకు రవాణా
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:07 AM
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు రవాణా డబ్బులు పూర్తిస్థాయిలో చెల్లించే వరకు లారీలను నడిపేది లేదంటూ ఆపరేటర్లు స్పష్టం చేశారు. గురువారం ఉదయం కాటాల నుంచి ఫ్యాక్టరీకి చెరకు తీసుకువచ్చిన వచ్చిన లారీల నుంచి అన్‌లోడ్ చేయకుండా ఆవరణలోనే వుంచేశారు. మరోవైపు కాటా నుంచి చెరకు తీసుకురావడాన్ని ఆపేశారు.

చార్జీలు బకాయిలు మొత్తం చెల్లించాలని లారీ ఆపరేటర్లు డిమాండ్
రెండు రోజుల నుంచి చెరకును అన్‌లోచ్ చేయని పరిస్థితి
చోడవరం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు రవాణా డబ్బులు పూర్తిస్థాయిలో చెల్లించే వరకు లారీలను నడిపేది లేదంటూ ఆపరేటర్లు స్పష్టం చేశారు. గురువారం ఉదయం కాటాల నుంచి ఫ్యాక్టరీకి చెరకు తీసుకువచ్చిన వచ్చిన లారీల నుంచి అన్‌లోడ్ చేయకుండా ఆవరణలోనే వుంచేశారు. మరోవైపు కాటా నుంచి చెరకు తీసుకురావడాన్ని ఆపేశారు. ఫ్యాక్టరీ ఆవరణలో రెండు రోజుల నుంచి లారీల్లోనే వున్న చెరకు ఎండిపోతుండగా, కాటాల వద్ద నుంచి చెరకు తరలించే అవకాశం కూడా లేకపోవడంతో అక్కడ కూడా చెరకు ఎండిపోతున్నది. లారీ ఆపరేటర్ల ఆందోళనతో గురువారం రాత్రి స్పందించిన ఫ్యాక్టరీ అధికారులు... ఫిబ్రవరి నెలాఖరు వరకు రవాణా చార్జీలు రూ.18 లక్షలు చెల్లించారు. అయితే ఇప్పటి వరకు చెరకు రవాణా చేసిన చార్జీలు సైతం చెల్లించాలని ఆపరేటర్లు పట్టుబట్టారు. అంతవరకు లారీల నుంచి చెరకు అన్‌లోడింగ్ చేసేది లేదని స్పష్టం చేశారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం ఫ్యాక్టరీ ఎండీ వి.సన్యాసినాయుడు, సీఐ బి.అప్పలరాజు, లారీల ఆపరేటర్లతో మాట్లాడారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో కాటాల నుంచి చెరకును ఫ్యాక్టరీకి తీసుకురావడానికి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.