చీడికోటలో దాహం కేకలు
ABN , Publish Date - Mar 20 , 2025 | 11:02 PM
మండలంలోని మఠం భీమవరం పంచాయతీ చీడికోట గ్రామస్థులు తాగునీటికి అల్లాడిపోతున్నారు. గత్యంతరం లేక గ్రామానికి కిలో మీటరు దూరం నుంచి ఊటనీరు తెచ్చుకుని తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ కలుషిత జలాలను తాగి వ్యాధుల బారిన పడుతున్నారు.

నిరుపయోగంగా మంచినీటి బోరు
కొన్నేళ్లుగా గ్రామస్థులకు ఊటనీరే దిక్కు
కలుషిత జలాల వల్ల అనారోగ్యంపాలు
గత ప్రభుత్వంలో పలుమార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోని వైనం
కూటమి సర్కారుపైనే ఆశలు
కొయ్యూరు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): మండలంలోని మఠం భీమవరం పంచాయతీ చీడికోట గ్రామస్థులు తాగునీటికి అల్లాడిపోతున్నారు. గత్యంతరం లేక గ్రామానికి కిలో మీటరు దూరం నుంచి ఊటనీరు తెచ్చుకుని తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ కలుషిత జలాలను తాగి వ్యాధుల బారిన పడుతున్నారు.
చీడికోట గ్రామంలో సుమారు 44 ఇళ్లలో 250 మంది జనాభా నివాసమంటున్నారు. ఈ గ్రామంలో దశాబ్దం క్రితం బోరు తవ్వించి దానికి మోటారు బిగించి ప్లాస్టిక్ ట్యాంకులో నీరు నిల్వ చేసేవారు. అయితే కొన్నాళ్లకే బోరు, మోటారు మూలకు చేరాయి. దీంతో వారికి తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో గ్రామానికి తాగునీటి వసతి కల్పించాలని గ్రామస్థులు పలుమార్లు వినతులు సమర్పించారు. అయినా ప్రయోజనం లేకపోయింది.
ఊటనీరే దిక్కు
గ్రామానికి కిలో మీటరు దూరంలో ఉన్న ఊటనీరు గొయ్యిలో నుంచి నీరు సేకరించి గ్రామస్థులు తెచ్చుకుంటున్నారు. ఈ కలుషిత జలాల వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. అయినా మరో దారి లేక ఈ నీళ్లనే తాగుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ కష్టాలు తీరతాయని వీరు ఎంతో ఆశ పడ్డారు. అయితే అధికారులు ఇప్పటి వరకు ఈ గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. దీనిపై మండల ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ సాయికృష్ణను వివరణ కోరగా చీడికోట గ్రామంలో తాగునీటి సమస్య విషయం తన దృష్టికి రాలేదన్నారు. వెంటనే గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షిస్తామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.