Share News

నేడే ఐపీఎల్‌ సమరం

ABN , Publish Date - Mar 24 , 2025 | 01:12 AM

పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మధ్య సోమవారం సాయంత్రం జరగనున్న ఐపీఎల్‌ టీ-20 మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది.

నేడే ఐపీఎల్‌ సమరం

  • ఢిల్లీ క్యాపిటల్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌

  • ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం

  • సర్వాంగ సుందరంగా ముస్తాబైన స్టేడియం

విశాఖపట్నం (స్పోర్ట్సు), మార్చి 23 (ఆంధ్రజ్యోతి):

పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మధ్య సోమవారం సాయంత్రం జరగనున్న ఐపీఎల్‌ టీ-20 మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. నిర్వాహకులు ఇప్పటికే స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సీజన్‌లో రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్‌. ఇక్కడి స్టేడియాన్ని రెండు మ్యాచ్‌లకు హోం గ్రౌండ్‌గా చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి విజయం సాధించాలనే సంకల్పంతో సిద్ధమవుతోంది. క్రీడాభిమానులకు మరికొద్ది గంటల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌ మజాను అందించేందుకు ఏసీఏ వీడీసీఏ స్టేడియం సిద్ధంగా ఉంది.

ప్రత్యేక ఆకర్షణగా రిషబ్‌ పంత్‌, అక్షర్‌పటేల్‌

సోమవారం జరగనున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు సారఽథ్యం వహిస్తున్న రిషబ్‌ సంత్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథి అక్షర పటేల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌లో అక్షర పటేల్‌, కేఎల్‌ రాహుల్‌, కులదీప్‌ యాదవ్‌, మిచెల్‌ స్టార్స్‌, డూప్లెసిస్‌ మినహా మిగిలినవారిలో స్టార్‌ ఆటగాళ్లు తక్కువ. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌లో రిషబ్‌ పంత్‌, మిచెల్‌ మార్స్‌, డేవిడ్‌ మిల్లర్‌ వంటి సీనియర్‌ క్రికెటర్లున్నారు. ప్రవేశ ద్వారాల వద్ద వైఫైతో కూడా స్కానర్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రేక్షకులు టికెట్‌పై ఉన్న బార్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి లోపలికి ప్రవేశించాలి. తోపులాటకు తావివ్వకుండా మ్యాచ్‌ ప్రారంభానికి రెండు గంటల ముందుగానే ప్రేక్షకులను అనుమతించనున్నారు.

భారీ బందోబస్తు

క్రికెట్‌ మ్యాచ్‌ భద్రతకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకుంది. వీరు స్టేడియం లోపల సేవలందిస్తారు. కాగా ఇరుజట్ల ఆటగాళ్లు ఆదివారం ముమ్మర సాధన చేశారు. సాయంత్రం 4,30 గంటల ప్రాంతంలో ఎల్‌ఎస్‌జే, డీసీ ఆటగాళ్లు స్టేడియానికి చేరుకుని బ్యాటింగ్‌, బౌలింగ్‌ నెట్‌ ప్రాక్టీసు చేశారు.

స్టేడియంలోకి ప్రవేశం ఇలా..

మధురవాడ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): క్రికెట్‌ మ్యాచ్‌కు ప్రేక్షకులు, అధికారులు, క్రికెటర్లు స్టేడియంలోకి ప్రవేశించడానికి 20 గేట్లు ఏర్పాటు చేశారు. గేట్‌ నంబరు 1 నుంచి క్రికెటర్లు, మ్యాచ్‌ అఫీషియల్స్‌, ఏసీఏ, బీసీసీఐ, ప్రభుత్వ అధికారులు, ఈస్ట్‌, వెస్ట్‌ పెవిలియన్‌, 1 నుంచి 18 కార్పొరేట్‌ బాక్సులకు ప్రవేశం కల్పించారు. 2వ గేటు నుంచి సౌత్‌వెస్ట్‌ అప్పర్‌, 19 నుంచి 26 కార్పొరేట్‌ బాక్సులకు వెళ్లేవారికి ప్రవేశం ఉంటుంది. 3వ గేటు సౌత్‌వెస్ట్‌ అప్పర్‌, 4- బి స్టాండ్‌, 5-ఎ స్టాండ్‌, 6-సి స్టాండ్‌, 7-డి, డి1 స్టాండ్‌లు, 8-ఇ, ఇ1 స్టాండ్లు, 9-ఎఫ్‌, ఎఫ్‌1 స్టాండ్లు, 10-జి స్టాండు ద్వారా ప్రవేశం కల్పిస్తారు. 11- కామెంటేటర్స్‌, బీసీఆర్‌ రూం, మీడియా, 12-హెచ్‌ అండ్‌ జె స్టాండ్స్‌, 13-ఐ స్టాండ్‌, 14-కెస్టాండ్‌, 15- ఎం స్టాండ్‌, 16ఎ-ఎం1 స్టాండ్‌, 16-ఎల్‌ స్టాండ్‌, 17-ఎన్‌ స్టాండు, 18- ఓ స్టాండ్‌, 19-సౌత్‌ఈస్ట్‌ లోవర్‌, 20- సౌత్‌ఈస్ట్‌ అప్పర్‌ 27 నుంచి 34 వరకు ఉన్న కార్పొరేట్‌ బాక్సులకు ప్రవేశం కల్పిస్తారు. ప్రేక్షకులు కెమెరాలు, మ్యాచ్‌బాక్సులు, లైటర్లు, సిగరెట్లు, వాటర్‌ బాటిళ్లు, మండే స్వభావంగల వస్తువులు, పొగాకు ఉత్పత్తులు, టిఫిన్లు, పదునుగా ఉన్న వస్తువులు, తినుబండారాలు, గొడుగులు, క్రేకర్స్‌, జంతువులు, రేడియో, ఆల్కహాల్‌, కర్రలు, లేజర్‌లైట్లు, బెలూన్లు, గ్లాస్‌బాటిళ్ళు, పెర్‌ఫ్యూమ్స్‌, స్ర్పే బాటిళ్లు, సిరంజిలు, విజిల్స్‌, హారన్స్‌, స్పోర్టింగ్‌ బాల్స్‌, రోలర్‌ స్కేటర్లు, ప్రమోషనల్‌ ప్రొడక్ట్స్‌, ల్యాప్‌ట్యాప్‌లు, పెన్నులు, పెన్సిళ్లు తీసుకురాకూడదు.

ఆర్టీసీ 50 ప్రత్యేక బస్సులు

ద్వారకాబస్‌స్టేషన్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియంలో సోమవారం జరగనున్న ఐపీఎల్‌ టి-20 క్రికెట్‌ మ్యాచ్‌కు ఆర్టీసీ 50 ప్రత్యేక బస్సులు నడపనుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాభిమానులను తరలించేందుకు, మ్యాచ్‌ ముగిసిన తరువాత వారిని ఆయా ప్రాంతాలకు చేర్చేందుఉ బస్సులు అందుబాటులో ఉంటాయి. రాత్రి 7.30 నుంచి 11 గంటల వరకు మ్యాచ్‌ జరుగుతుందని, దీంతో సాయంత్రం 5.30 నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు తెలిపారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 11 నుంచి 1 గంట వరకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. గాజువాక, పాతపోస్టాఫీస్‌, సింహాచలం, కూర్మన్నపాలెం, తగరపువలస ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 01:12 AM