Share News

మార్చి 31 వరకు గోదావరి డెల్టాకు నీటి విడుదల

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:36 PM

సీలేరు కాంప్లెక్సులోని డొంకరాయి జలాశయం నుంచి గోదావరి డెల్టాకు నీటి విడుదలను మార్చి 31 వరకు కొనసాగిస్తామని జెన్‌కో వర్గాలు తెలిపాయి.

మార్చి 31 వరకు గోదావరి డెల్టాకు నీటి విడుదల
డొంకరాయి నుంచి గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం.

డొంకరాయి జలాశయం నుంచి

4 వేలు నుంచి 5 వేల క్యూసెక్కులకు పెంపు

సీలేరు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సులోని డొంకరాయి జలాశయం నుంచి గోదావరి డెల్టాకు నీటి విడుదలను మార్చి 31 వరకు కొనసాగిస్తామని జెన్‌కో వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం విడుదల చేస్తున్న 4 వేలు నుంచి 5 వేల క్యూసెక్కులకు పెంచామని పేర్కొన్నాయి. ధవళేశ్వరం వద్ద నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో ఇరిగేషన్‌ అధికారుల అభ్యర్థన మేరకు అదనపు నీటిని విడుదల చేస్తున్నామన్నాయి. అలాగే పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం విడుదలయ్యే మరో 4,300 క్యూసెక్కులు గోదావరి డెల్టాకు విడుదల చేస్తున్నామని ఆ వర్గాలు పేర్కొన్నాయి. డొంకరాయి జలాశయం నుంచి మార్చి21వ తేదీ వరకు నీటి విడుదల చేయాలని ఇరిగేషన్‌ అధికారులు తొలుత కోరారు. అయితే రబీ పంటలకు నీటి వినియోగం పెరగడంతో ఇరిగేషన్‌ అధికారులు మార్చి 31 వరకు కొనసాగించాలని కోరారు. ఈ మేరకు శనివారం ఉదయం నుంచి డొంకరాయి నుంచి 5 వేలు క్యూసెక్కులు, పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 4,300 క్యూసెక్కులు కలిసి 9,300 క్యూసెక్కులు గోదావరి డెల్టాకు విడుదల చేస్తున్నట్టు జెన్‌కో వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 21 వరకు డొంకరాయి స్పిల్‌వే గేట్లు నుంచి విద్యుదుత్పత్తి చేయకుండా గోదావరి డెల్టాకు 10.19 టీఎంసీలు నీటిని విడుదల చేశామని ఆ వర్గాలు తెలిపాయి. బలిమెల జలాశయంలో ఆంధ్రా వాటాగా 36.7088 టీఎంసీలు, గుంటవాడ, డొంకరాయి జలాశయాల్లో 13.5906 టీఎంసీలు కలిసి 50.2994 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ ఏడాది వేసవిలో సీలేరు కాంప్లెక్సులోని జలవిద్యుత్‌ కేంద్రాలకు నీటి కొరత లేదని స్థానిక జెన్‌కో అధికారలు తెలిపారు.

Updated Date - Mar 22 , 2025 | 11:36 PM