just come and go తనిఖీకి వచ్చారు.. వెళ్లారు
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:07 AM
Came for inspection.. Went జిల్లాలో సామాజిక తనిఖీ ప్రక్రియ దారి తప్పుతోంది. ప్రభుత్వ పథకాల అమలులో చోటుచేసుకునే అవినీతిని వెలికితీసి అక్రమార్కుల నిగ్గుతేల్చేందుకు దోహదపడాల్సిన ఈ ప్రక్రియ...తనిఖీ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మధ్య కుదిరే రహస్య ఒప్పందం పుణ్యమాని తూతూ మంత్రంగా నడుస్తోంది. అవకతకవలు కళ్లెదుటే కనిపిస్తున్నా అంతా భేష్ అంటూ అధికారులకు చేరుతున్న నివేదికలు తనిఖీలో డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నాయి.

తనిఖీకి వచ్చారు.. వెళ్లారు
మొక్కుబడిగా సోషల్ ఆడిట్ ప్రక్రియ
డీఆర్పీలు, ఎఫ్‌ఏల మధ్య రహస్య అవగాహన
గ్రామ సభలను గాలికొదిలేసిన వైనం
మరుగునపడుతున్న అవినీతి, అక్రమాలు
జిల్లాలో సామాజిక తనిఖీ ప్రక్రియ దారి తప్పుతోంది. ప్రభుత్వ పథకాల అమలులో చోటుచేసుకునే అవినీతిని వెలికితీసి అక్రమార్కుల నిగ్గుతేల్చేందుకు దోహదపడాల్సిన ఈ ప్రక్రియ...తనిఖీ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మధ్య కుదిరే రహస్య ఒప్పందం పుణ్యమాని తూతూ మంత్రంగా నడుస్తోంది. అవకతకవలు కళ్లెదుటే కనిపిస్తున్నా అంతా భేష్ అంటూ అధికారులకు చేరుతున్న నివేదికలు తనిఖీలో డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నాయి.
మెంటాడ, మార్చి 24(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో మెంటాడ, దత్తిరాజేరు, వేపాడ తదితర మండలాల్లో సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నారు. మండలానికి ముగ్గురు డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్లకు (డీఆర్పీలకు) బాధ్యతలు అప్పగించారు. డీఆర్పీలు ఆడిట్ ముగిశాక పంచాయతీల వారీగా గ్రామసభలు నిర్వహించి పథకాల అమలు తీరుతెన్నులు, లబ్ధిదారుల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు నమోదు చేసుకుంటారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో గ్రామసభలు ముగిశాక మండల స్థాయిలో సామాజిక తనిఖీ చేపట్టి పంచాయతీలవారీగా వెల్లడైన అక్రమాలు, అవినీతికి బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తారు. వాటికి అనుగుణంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు జరుగుతున్న సోషల్ ఆడిట్ మొక్కుబడి తంతును తలపిస్తోంది. పంచాయతీ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయడం లేదు. మండలానికి కేవలం ముగ్గురు డీఆర్పీలను నియమించి మమ అనిపించగా, ఇదే అదనుగా వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇతర పథకాలను పూర్తిగా గాలికొదిలేసి ఒక్క ఉపాధి హామీ పథకానికే పరిమితమవుతున్నారు. ఉపాధి పనులు ఎన్నిచోట్ల జరిగాయి?ఎంత ఖర్చు చేశారు?వేతనదారులకు సమావేశాలు నిర్వహిస్తున్నారా?లేదా? ఇంతటితో ఆడిట్ ముగించేస్తున్నారు. గ్రామసభ ఊసేలేదు. ఇచ్చిన ఫిర్యాదు పట్టించుకోవడంలేదు.
వారు, వీరు ఒక్కటై..
ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, డీఆర్పీలు రహస్య ఒప్పందం కుదుర్చుకుని పథకాన్ని అభాసుపాలు చేస్తున్నారు. తాము ఏమేం అడుగుతామో డీఆర్పీలు ఫీల్డ్ అసిస్టెంట్లకు స్ర్కిప్ట్ ఇస్తే వారు వాటిని పట్టుకొని ముందుగా ఎంపిక చేసుకున్న ఇళ్లలోని వారికి తర్ఫీదు ఇచ్చి ఆతర్వాత డీఆర్పీని తీసుకువెళ్తున్నారు. వారు పాఠం అప్పజెప్పినట్టుగా ప్రశ్నలకన్నా ముందే జవాబులిచ్చేస్తున్నారు. అంతే ఆ గ్రామంలో సామాజిక తనిఖీ పూర్తయినట్టే. తర్వాత వెళ్లే గ్రామంలో మళ్ళీ అదే తంతు. ముగ్గురు డీఆర్పీలు మండలంలోని పంచాయతీల సంఖ్యను మూడు వాటాలుగా విభజించుకొని క్షేత్ర సహాయకుల సహకారంతో ఈ ప్రహసనాన్ని నడిపిస్తున్నారు.
అధికారికి రాజభోగమే
గ్రామాల్లో సోషల్ ఆడిట్ జరిగినన్ని రోజులూ డీఆర్పీకి భోజనాలు, ’’ఇతరత్రా’’ వసతులను ఫీల్డ్ అసిస్టెంట్లు ఏర్పాటు చేసి పూర్తయ్యాక తమకు అనుకూల నివేదికలు ఇచ్చేందుకు డీఆర్పీలకు తృణమో పణమో ముట్టజెపుతున్నారు. గతంలో పంచాయతీకి రూ.10 వేలు రుచిమరిగిన ఆడిట్ సిబ్బంది, ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు.
అన్నింటా అక్రమాలు
గత వైసీపీ హయాంలో ఉపాధి, పింఛన్లు, ఇరిగేషన్, సీసీ కాలువలు, డ్రైన్లు, శ్మశానవాటికలో షెడ్లు, సచివాలయాలు, ఆర్బీకే, గ్రావెల్ రోడ్లు, జగనన్న కాలనీలకు లేఅవుట్‌లు ఇలా ఒకటేమిటి....అన్నిట్లోనూ అక్రమాలు రాజ్యమేలాయి. నాటి అవకతవకలు, అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై సోషల్ ఆడిట్ జరగకపోవడం విచారకరం. విచిత్రమేమంటే సామాజిక తనిఖీల్లో ఇటువంటి ఫిర్యాదులేవీ తమ దృష్టికి రాలేదని డీఆర్పీలు చెబుతుండడం గమనార్హం.