Share News

give posting as they wish ఇచ్చినోళ్లకు నచ్చినచోట!

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:40 PM

give posting as they wish జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఇటీవల జరిగిన బదిలీల అంశం ఆశాఖలో హాట్‌టాపిక్‌ అయింది. బదిలీల ప్రక్రియలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఓ ఉద్యోగి తనకు అన్యాయం జరిగిందని ఆగ్రహించడంతో విషయం బయటకు పొక్కింది.

give posting as they wish ఇచ్చినోళ్లకు నచ్చినచోట!

ఇచ్చినోళ్లకు నచ్చినచోట!

ఎక్సైజ్‌శాఖలో ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియ

పార్వతీపురం జిల్లాకు నామమాత్రంగా కేటాయింపు

అక్కడ కుటీర పరిశ్రమలా నాటుసారా తయారీ, అమ్మకాలు

విధుల నిర్వహణ అక్కడ కత్తిమీద సామే

విజయనగరంలోనే మూడొంతులమందికి అవకాశం

అక్రమాలు జరిగాయని సీఎం, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు

జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఇటీవల జరిగిన బదిలీల అంశం ఆశాఖలో హాట్‌టాపిక్‌ అయింది. బదిలీల ప్రక్రియలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఓ ఉద్యోగి తనకు అన్యాయం జరిగిందని ఆగ్రహించడంతో విషయం బయటకు పొక్కింది. బదిలీలు జరిగిన తీరు, అక్రమాలను పేర్కొంటూ ఆయన నేరుగా ముఖ్యమంత్రికి, ఎక్సైజ్‌ కమిషనర్‌(అమరావతి), ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌, ఏసీబీ డిప్యూటీ జనరల్‌, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం మరింత కలకలం రేగింది. ఇచ్చిన వారికి నచ్చిన చోట పోస్టింగ్‌.. ఇవ్వని వారిని మాత్రం సుదూర స్టేషన్లకు వేశారన్న విమర్శలు ఉన్నాయి.

మెంటాడ, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి):

విజయనగరం జిల్లా వేపాడకు చెందిన కానిస్టేబుల్‌ టి.సన్యాసిరావుకు గతంలో బ్రెయిన్‌ సర్జరీ జరిగింది. ఆయన్ను పార్వతీపురం మన్యం జిల్లా క్రైమ్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలికి తీవ్ర గాయమైంది. ఎముక విరిగినట్టు వైద్యులు గుర్తించారు. ఇప్పుడాయాన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనన్ను పార్వతీపురానికి బదిలీ చేయడంలో ఆంతర్యం ఏమిటో. అలాగే వంగరకు చెందిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఎ.ప్రసాదు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈయన పక్షవాతానికి గురయ్యారు. ఈయన్ను కూడా మన్యం జిల్లాకు బదిలీ చేశారు. బదిలీల్లో అక్రమాలు జరిగాయనడానికి ఈ ఉదాహరణలు బలం చేకూర్చుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో కానిస్టేబుళ్లు 95, హెడ్‌ కానిస్టేబుళ్లు 56, ఎస్‌ఐలు 29, సీఐలు 22, జూనియర్‌ అసిస్టెంట్‌లు 12, ఇతర ఉద్యోగులు ఏడుగురికి బదిలీ జరిగింది. కొందరిని పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ చేస్తూ మిగతా వారిని విజయనగరం జిల్లాలోనే ఉంచారు. అయితే బదిలీ ప్రక్రియపై చాలా విమర్శలు వచ్చాయి. అన్యాయంగా బదిలీ అయినవారు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. అధికారుల ఆదేశాలను ప్రశ్నించే సాహసం చేయలేక మిన్నకుండిపోయారు. అడిగినంత ఇచ్చుకోలేకే బదిలీ అయ్యామని వాపోతున్నారు.

విజయనగరం జిల్లాతో పోల్చిచూస్తే పార్వతీపురం మన్యం జిల్లాలో ఎక్సైజ్‌ శాఖాపరమైన క్రైమ్‌ రేటు చాలా ఎక్కువ. గిరిజన జిల్లా కావడంతో జిల్లాలో నాటుసారా తయారీ విక్రయాలు అధికం. ముఖ్యంగా సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ తదితర ఎక్సైజ్‌ సర్కిళ్ల పరిధిలో నాటుసారా కుటీర పరిశ్రమను తలపిస్తుంది. దీన్ని కట్టడిచేసేందుకు దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం పాక్షికమే. అక్కడ ఎక్సైజ్‌ సిబ్బందికి విధుల నిర్వహణ కత్తి మీద సామే. పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి ప్రతిరోజూ ఇక్కడకు దిగుమతి అవుతున్న వేలాది లీటర్ల నాటుసారా ఎక్సైజ్‌ సిబ్బందికి పులిమీద పుట్రలా దాపురించింది. ఈ నేపథ్యంలో పార్వతీపురం జిల్లాలోని ఎక్సైజ్‌ సర్కిళ్లలో యువత, దేహదారుధ్యం ఉన్న వారిని మాత్రమే నియమించాల్సి ఉంటుంది. దీనివల్ల కొంతైనా ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్నవారు, దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని అక్కడ నియమిస్తే సారా కట్టడి అసాధ్యమై ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుంది.

- పార్వతీపురం మన్యం జిల్లాకు తాజా బదిలీల్లో కేవలం 14 మందినే కేటాయించారు. అదికూడా వయసు పైబడినవారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని అధికంగా బదిలీ చేసినట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఉద్యోగులు తెలిపారు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో దేహదారుఢ్యం కలిగిన యువ ఉద్యోగులకు కొదువలేదు. 2014 బ్యాచ్‌ ఉద్యోగులు 78 మంది ఉండగా వారిలో కేవలం 14 మందిని మాత్రమే పార్వతీపురానికి కేటాయించి మిగిలిన వారిని విజయనగరం జిల్లా పరిధిలోనే బదిలీ చేసినట్టు బోగట్టా. దీనివెనుక మతలబు ఏమిటన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. బదిలీల్లో చోటుచేసుకున్న సిత్రాల వెనుక పెద్దమొత్తం చేతులు మారినట్టు ఆ శాఖలో చర్చించుకుంటున్నారు.

వైరల్‌ అవుతున్న ఉద్యోగి లేఖ

విజయనగరంలో పనిచేస్తున్న ఓ సీనియర్‌ ఉద్యోగి బదిలీల్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఏసీబీ డీజీ, ఎక్సైజ్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వక ఫిర్యాదును పోస్టు ద్వారా పంపారు. విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా అందులో పేర్కొన్నారు. ఈ లేఖ ఇప్పుడు ఎక్సైజ్‌ సిబ్బంది గ్రూపుల్లో చక్కర్లు కొడుతుండగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

నిబంధనల మేరకే బదిలీలు

శ్రీనాథుడు, సూపరింటెండెంట్‌, జిల్లా ఎక్సైజ్‌ ప్రొహిబిషన్‌

ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో నిబంధనల మేరకే బదిలీలు జరిగాయి. అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఈ ప్రక్రియను పూర్తిచేశాం. ప్రమోషన్లు పొందినవారిని పార్వతీపురం మన్యం జిల్లాలో ఖాళీలు ఉన్నచోట నియమించాం. ఎవరికీ అన్యాయం జరగకుండా చూశాం. కొంతమంది ఆరోపణలు చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. వాటిని పరిశీలిస్తున్నాం. బదిలీల్లో అక్రమాలకు చోటేలేదు. ప్రక్రియ మొత్తం పారదర్శకంగా నిర్వహించాం. అనుమానాలకు ఆస్కారమే లేదు.

విచ్చలవిడిగా సారా తయారీ.. దిగుమతి

జియ్యమ్మవలస, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస, కొమరాడ, పాచిపెంట, మక్కువ, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట మండలాల్లో విచ్చలవిడిగా సారా తయారు చేస్తున్నారు. కొందరు స్థానికులు కుటీర పరిశ్రమలా చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. అక్కడ తయారు చేయడం.. జిల్లాలోని ఇతర ప్రాంతాలకు తరలించడం పరిపాటిగా మారింది. ఈ తతంగంపై స్థానిక ఎక్సైజ్‌ అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పార్వతీపురం డివిజన్‌ పరిధిలో సారాకు కేరాఫ్‌ అడ్రాస్‌గా ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని రెండు గ్రామాలున్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలానికి ఆనుకుని ఒడిశా రాష్ట్రంలోకి ముఖద్వారంలా చెప్పుకుంటున్న సందుబడి గ్రామం ఒకటైతే, కొమరాడ మండలంలో రాష్ట్రాల సరిహద్దు గ్రామం కెరడ మరొకటి. ఈ రెండు గ్రామాల నుంచి సారాను కొందరు అక్రమంగా రవాణా చేస్తున్నారు. కురుపాం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సర్కిల్‌ కార్యాలయ పరిధిలో ఈ ఏడాదిలో చాలా కేసులు నమోదయ్యాయి.

--------------------

Updated Date - Apr 03 , 2025 | 11:40 PM