Share News

ఇంకెన్నాళ్లీ ఘీంకరింపు!

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:27 PM

జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట ఏనుగులు బీభత్సం సృష్టిస్తూ.. ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నా.. వాటి తరలింపు చర్యలు మాత్రం ముందుకు కదలడం లేదు. ఇదొక ఎన్నికల హామీగానే మారింది.

  ఇంకెన్నాళ్లీ ఘీంకరింపు!
తోటపల్లి - గుణుపూర్‌ ప్రధాన రహదారిపై సంచరిస్తున్న ఏనుగులు (ఫైల్‌)

- మన్యం వాసులను వీడని గజరాజుల బెడద

- దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్య

- ఇప్పటివరకు 27 మంది మృతి, ముగ్గురికి గాయాలు

- వివిధ సంఘటనల్లో ఏనుగులూ మృత్యువాత

- వాటి తరలింపునకు అడుగులు పడని వైనం

- రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు

- త్వరగా జిల్లాకు కుంకీలను తెప్పించాలని విన్నపం

జియ్యమ్మవలస, మార్చి 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట ఏనుగులు బీభత్సం సృష్టిస్తూ.. ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నా.. వాటి తరలింపు చర్యలు మాత్రం ముందుకు కదలడం లేదు. ఇదొక ఎన్నికల హామీగానే మారింది. దీంతో జిల్లావాసులకు ఏనుగుల బెడద తప్పడం లేదు. జిల్లావాసులను గజరాజులు ఏళ్ల తరబడి వేధిస్తున్నాయి. పార్వతీపురం, పాలకొండ డివిజన్లలో ఓ వైపు పంటలను నాశనం చేస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏటా ఆస్తి, ప్రాణనష్టాలతో అలజడి సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం పార్వతీపురం, భామినిలో రెండు గుంపులుగా సంచరిస్తున్న ఏనుగుల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటివరకు వాటి వల్ల ‘మన్యం’లో 27 మంది మరణించారు. ముగ్గురు గాయాలపాలయ్యారు. వివిధ సంఘటనల్లో ఏనుగులూ కూడా మృత్యువాత పడ్డాయి. వాటి తరలింపు విషయంలో గత వైసీపీ సర్కారు హామీలతోనే కాలయాపన చేసిన నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపైనే ‘మన్యం’ వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తక్షణమే కుంకీలను జిల్లాకు రప్పించి.. ఈ ప్రాంతం నుంచి గజరాజులను తరలించాలని వారు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

ఒడిశా రాష్ట్రంలోని లఖేరీ అభయారణ్యం నుంచి 1998 అక్టోబరు 2న తొలుత జిల్లాలోని కురుపాం మండలం పనసభద్ర గ్రామ పరిధిలోకి 11 ఏనుగులు ప్రవేశించాయి. పాలకొండ రేంజ్‌ పరిధిలోకి 2007లో గజరాజుల గుంపు ప్రవేశించింది. ఏటా అవి అనేక ఎకరాల్లో పంటలు నాశనం చేస్తూ అటు రైతులు, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా వాటి తరలించే విషయంలో, పునరావాసం కల్పించడంలో అడుగులు పడడం లేదు. మరోవైపు పంట నష్టపరిహారం చెల్లింపుల్లోనూ రైతులకు నిరాశే ఎదురవుతోంది. మొత్తంగా ఏనుగుల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు రక్షణ లేకుండాపోతోంది.


గజరాజుల కారణంగా మరణాలు పరిశీలిస్తే..

  • 1998, అక్టోబరు 5న కురుపాం మండలం పనసభద్ర గ్రామానికి చెందిన పత్తిక దండు

  • 1999, మే 30న అదే మండలం పొలంగూడ గ్రామానికి చెందిన కె.సోంబేరి, ఆగస్టు 28న బొడ్లగూడకు చెందిన ఎం.శాంతమ్మ

  • 2007 ఆగస్టు 13న అడ్డంగూడ కు చెందిన బి.సొంబ, ఆగస్టు 21న వాడబాయి గ్రామానికి చెందిన టి.పరిసి, టి.డ్రింబమ్మ, టి.ధర్మారావు, అక్టోబరు 11న నాగరకుంటుబాయికి చెందిన టి.ప్రభాకరరావు

  • 2008 ఏప్రిల్‌ 15న గడసింగుపురం గ్రామానికి చెందిన ఎస్‌.యర్రన్న

  • 2019 జనవరి 12న పార్వతీపురం మండలం నాయుడుపేటకు చెందిన ఎన్‌.పకీరు, మే 21న జియ్యమ్మవలస మండలం పెదకుదమ గ్రామానికి చెందిన కె.కాశిందొర, డిసెంబరు 6న ఇదే మండలం బాసంగి గ్రామానికి చెందిన గంట చిన్నమ్మి

  • 2020 అక్టోబరు 29న కొమరాడ మండలం గుమడ గ్రామానికి చెందిన వై.నారాయణరావు, నవంబరు 13న ఇదే మండలం పరుశురాంపురం గ్రామానికి చెందిన ఆర్‌.లక్ష్మునాయుడు, డిసెంబరు 7న దళాయిపేటలో ఒక ఆవు దూడ

  • 2021 మే 6న కళ్లికోటకు చెందిన ఎ.అప్పన్నలు మృతి చెందారు.


ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో..

  • 2007 అక్టోబరు 14న సీతంపేట మండలం చిన్నబగ్గకు చెందిన పసుపురెడ్డి అప్పారావు

  • 2007 అక్టోబరు 14న సీతంపేట మండలం దోనుబాయికి చెందిన సిరిపోతుల మరియమ్మ

  • 2007 అక్టోబరు 19న వీరఘట్టానికి చెందిన కుంభిడి నాగరాజు

  • 2007 అక్టబరు 21న వీరఘట్టం మండలం సంతనర్సిపురం వాసి తెంటు శ్రీనివాసరావు

  • 2008 జనవరి 21న వీరఘట్టం మండలం చలివేంద్రికి చెందిన కొండగొర్రి సాంబయ్య

  • 2019 జూన్‌ 17న సీతంపేట మండలం ఈతమానుగూడకు చెందిన సవర గైరమ్మ

  • 2019 జూన్‌ 17న సీతంపేట మండలం పెద్దమండకు చెందిన సవర పోడమ్మ

  • మన్యం జిల్లాగా ఏర్పడిన తరువాత..

  • 2023 జనవరి 19న భామిని మండలం తాలాడకు చెందిన గోపిశెట్టి చిన్నారావు

  • 2023 ఫిబ్రవరి 6న భామిని మండలం సవరతిడ్డిమికి చెందిన లోకొండ లక్ష్మీనారాయణ

  • 2024 ఆగస్టు 26న పార్వతీపురం మండలం వన్నాం గ్రామానికి చెందిన వాన శివుడు

  • బలిజిపేట మండలంలో ఒకరు మృతి చెందారు.


గాయపడిన వారు

  • 2019 జనవరి 25న కొమరాడ మండలం కళ్లికోటకు చెందిన బి.గంగులు

  • 2019 సెప్టెంబరు 11న సీతానగరం మండలానికి చెందిన ఎస్‌.సింహాచలం

  • 2019 మార్చి 14న గరుగుబిల్లి మండలం నందివానివలసకు చెందిన వి.శ్రావణ్‌కుమార్‌లు గాయపడ్డారు.

ఏనుగుల మృత్యువాత

  • 2008-09లో జియ్యమ్మవలస మండలం గడసింగుపురం పంచాయతీ సీమలవానివలస వద్ద అప్పటి ప్రభుత్వం ఆపరేషన్‌ గజ నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా ఒడిశాకు ఏనుగుల తరలింపునకు శ్రీకారం చుట్టారు. కానీ ఆ తరలింపు మార్గమధ్యంలో మూడు ఏనుగులు చనిపోయాయి. దీంతో కార్యక్రమాన్ని మధ్యలో విరమించారు.

  • 2023 మే 12న పాలకొండ రేంజ్‌ పరిధిలో బాలేరు బీట్‌ కాట్రగడ్డ-13 గ్రామం వద్ద నాలుగు ఏనుగులు మృతి చెందాయి. ఇందులో మూడు నుంచి నాలుగు సంవత్సరాల గున్న ఏనుగు ఒకటి ఉంది.

  • అంతకముందు కొమరాడ మండలం అర్తాం వద్ద విద్యుత్‌ షాక్‌తో ఒక ఏనుగు మృతి చెందింది.

  • ఆ తరువాత కొమరాడ మండలం కళ్లికోట వద్ద నాగావళి నదిలో మట్టిలో కూరుకుపోయి మరో ఏనుగు మృత్యువాత పడింది.

  • జియ్యమ్మవలస మండలం బిత్రపాడు పంచాయతీ సమీపంలో అనారోగ్యంతో మరో ఏనుగు మృతి చెందింది.


సంరక్షణ కేంద్రాలు ఏమైనట్లు..?

జిల్లా పరిధిలో ఏనుగుల సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల అటవీ అధికారులతో పాటు ఫారెస్ట్‌ రేంజర్లు బృందం 2010లో తమిళనాడు రాష్ట్రం మధురైలో ఎలిఫెంట్‌ కన్జర్వేషన్‌ అండ్‌ కేర్‌ సెంటర్‌ (ఈసీసీసీ)ని సందర్శించారు. ఏనుగుల రక్షణ సాధ్యాసాధ్యాలను తెలుసుకున్నారు. దీని ఆధారంగా దాదాపు 100 నుంచి 200 హెక్టార్లలో ఏనుగుల శిబిరం ఏర్పాటు చేయాల్సి ఉందని భావించారు. ఇందులో 75 నుంచి 100 హెక్టార్లలో నీటి వనరులు, ఏనుగుల నివాసానికి అనువైన భూభాగం ఏర్పాటు, మిగిలిన ప్రాంతంలో వాటికి ఆహారం అందించడం, చెరకు, గడ్డి, పండ్ల జాతి మొక్కల పెంపకం, అటవీ జాతుల విస్తీర్ణం, దానికి అనువైన వెదురు ఆవాసాలను పెంచడం, ఇనుప రైలింగ్‌తో కంచె , దానికి ఇరువైపులా కందకాలు ఏర్పాటు , నీటి లభ్యతకు సోలార్‌ బోర్లు, లేకపోతే భారీ ఊట చెరువుల నిర్మాణం చేయాల్సి ఉందని తెలుసుకున్నారు.

  • ఏనుగుల సంరక్షణ ఆవాసాలుగా మార్చేందుకు పార్వతీపురం మండలం తోటపల్లి (నాగావళి నది) ప్రాంతం, జియ్యమ్మవలస మండలం వట్టిగెడ్డ రిజర్వాయర్‌, కురుపాం మండలంలోని బోడికొండ , మక్కువ మండలంలో జంతికొండ, పార్వతీపురం మండలం అర్తాం రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతాలను పరిశీలనలోకి తీసుకున్నారు. కానీ దీనికి గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత, అనువైన అదనపు స్థం రెవెన్యూశాఖ సమకూర్చలేకపోవడం వంటి ఇతర కారణాల వల్ల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు తీవ్ర జాప్యం జరిగింది.

  • చివరికి సీతానగరం మండలం అమ్మాదేవి కొండ చుట్టూ కందకాలు తవ్వే పనుల్లో అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. దీనికీ కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

  • ఇక ఏనుగుల సమస్య పరిష్కారానికి కాంపెన్సేటరీ అఫారెస్టింగ్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ (కంపా), ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌ పథకాలను అధికారులు తెరపైకి తెచ్చినా కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయడం లేదు.


పంట నష్టాలపై తీవ్ర వ్యతిరేకత

  • ఏనుగుల కారణంగా సంభవిస్తున్న పంట నష్టాలపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై జారీ చేసిన జీవో ఎంఎస్‌ నంబరు 57/2014 చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ జీవో ప్రకారం.. వరి, చెరకు, అరటి నష్ట పరిహారం కింద ఎకరాకు రూ. 6 వేలు, మామిడి, కొబ్బరి పూర్తిగా నాశనమైతే చెట్టుకు రూ. 1500 చొప్పున ఇవ్వడానికి నిర్ణయించారు. అయితే ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని రైతులు పలు సందర్భాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలియజేశారు. ఇటీవల కుదమ రెవెన్యూ పరిధిలో చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ చిరంజీవి చౌదరి కలెక్టర్‌తో కలిసి పర్యటించినప్పుడు కూడా రైతులు పంట నష్టాలపై వేడుకున్నారు. కాగా పంట నష్టాల అంచనా వేయడంలో అటవీ, రెవెన్యూ, ఉద్యాన శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. అయితే ఎప్పుడూ అటవీశాఖే నష్టాలను అంచనా వేసి పరిహారం ఇస్తుండడంతో రైతులకు నష్టమే మిగులుతోంది.

  • పంట నష్టాల విషయంలో అటవీశాఖ ఉద్యోగి ఒకరు ఏనుగులు సంచరించిన ప్రాంతాలకు వెళ్లి రైతులకు దరఖాస్తులు ఇస్తారు. వాటిపై రెవెన్యూ, ఉద్యాన శాఖల అధికారుల సంతకాలు చేయించిన తర్వాత రైతుల నుంచి మళ్లీ వాటిని సేకరించి అటవీశాఖ కార్యాలయానికి తీసుకెళ్తారు. అయితే సిబ్బంది కొరత నేపథ్యంలో ఇలా ఒక ఉద్యోగిని ఈ పని కోసం కేటాయించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా ఇందుకోసం ప్రత్యేక యాప్‌ ఏర్పాటు చేస్తే రైతులకు మేలు చేసినట్లవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.

23ppmp8.gif

నష్టపోయిన ఇలాంటి పంటలెన్నో


ఏడాదిన్నరలోగా పరిష్కరిస్తాం

ఏనుగుల తరలింపు అనేది ఒక సాహసోపేత నిర్ణయం. ప్రస్తుతం వాటి పునరావాసం ఏర్పాటుకు దృష్టి సారించాం. జిల్లాలో ఏనుగుల బెడదను పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మరో ఏడాదిన్నలోగా కచ్చితంగా పరిష్కారం ఉంటుంది.

- మణికంఠేశ్‌, జిల్లా అధికారి, ఎలిఫెంట్‌ మానటరింగ్‌ యూనిట్‌, పార్వతీపురం మన్యం

23ppmp7.gif

కుదమ ప్రాంతంలో పర్యటించిన సీసీఎఫ్‌కు వివరిస్తున్న రైతులు (ఫైల్‌)

Updated Date - Mar 27 , 2025 | 11:27 PM