Share News

Only if there are recommendations..! సిఫార్స్‌ ఉంటేనే..!

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:00 AM

Only if there are recommendations..! వేపాడ మండలానికి చెందిన ఓ యువకుడు ఐటీఐ వరకు చదువుకుని ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా యంత్రాల విడిభాగాలు విక్రయించే వ్యాపారం చేసుకుంటున్నాడు. 50 శాతం రాయితీ ఇచ్చే బీసీ కార్పొరేషన్‌ రుణం తీసుకుంటే వ్యాపారం మరింత విస్తరించవచ్చునని దరఖాస్తు చేసుకున్నాడు.

Only if there are recommendations..! సిఫార్స్‌ ఉంటేనే..!

సిఫార్స్‌ ఉంటేనే..!

బ్యాంకు గ్యారెంటీ, ప్రజాప్రతినిధుల ప్రాపకం కోసం ప్రదక్షిణలు

బీసీ, ఈడబ్ల్యూసీ కార్పొరేషన్‌ రుణాల కోసం అగచాట్లు

ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తుండడంతో పెరిగిన పోటీ

2883 మంది లబ్ధిదారులను గుర్తించాలని లక్ష్యం

జిల్లా వ్యాప్తంగా ఇంటర్యూలు

రూ.54 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం

శృంగవరపుకోట, ఏప్రిల్‌4 (ఆంధ్రజ్యోతి):

వేపాడ మండలానికి చెందిన ఓ యువకుడు ఐటీఐ వరకు చదువుకుని ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా యంత్రాల విడిభాగాలు విక్రయించే వ్యాపారం చేసుకుంటున్నాడు. 50 శాతం రాయితీ ఇచ్చే బీసీ కార్పొరేషన్‌ రుణం తీసుకుంటే వ్యాపారం మరింత విస్తరించవచ్చునని దరఖాస్తు చేసుకున్నాడు. ఎంపీడీవో కార్యాలయంలో ఇటీవల జరిగిన ఇంటర్వ్యూకు వెళ్లాడు. తీరా ఇంటర్వ్యూలో ఈ మండల పరిధిలో వున్న బ్యాంకు నుంచి గ్యారెంటీ చూపిస్తేనే దరఖాస్తు పరిశీలిస్తామని అధికారులు చెప్పడంతో తెల్లముఖం వేశాడు. ఇతనికి పక్క మండలం శృంగవరపు కోటలోని ఓ బ్యాంకులో ఖాతా ఉంది. ఆ బ్యాంకు పేరునే దరఖాస్తులో పొందుపరిచాడు. చేసేదిలేక స్థానికంగా వున్న బ్యాంకు అధికారులను కలిసి ఖాతా తెరవడంతో పాటు బీసీ కార్పొరేషన్‌ రుణం పొందేందుకు గ్యారెంటీ ఇవ్వాలని కోరాడు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో దిగాలు చెందుతున్నాడు. ఈ సమస్య ఆ యువకుడు ఒక్కడిదే కాదు. జిల్లా వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్‌ రుణాల మంజూరుకు ప్రయత్నిస్తున్న చాలా మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇంట ర్య్వూ సమయంలో బ్యాంకు గ్యారెంటీ ఉంటేనే దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఆపై ప్రజాప్రతి నిధుల సిఫార్స్‌లకు కూడా అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రచారం జరగడంతో వారి ప్రాపకం కోసమూ పాట్లు పడుతున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల దరఖాస్తులపై సంతకాలు పెట్టి ఇంటర్య్వూలకు పంపించడంతో వీటిని చూసిన మిగిలిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు గ్యారెంటీ, ప్రజాప్రతినిధుల సిఫార్స్‌ లేకుంటే రుణం అందేలా లేదని నిరాశతో ఇంటిముఖం పడుతున్నారు.

ఫ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్‌ ద్వారా వెనకబడిన తరగతులకు చెందిన యువతతో పాటు అగ్రకులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలను అందించేందుకు నిర్ణయించింది. ఇలా బ్యాంకుల నుంచి పొందిన రుణంలో 50శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. దీన్ని లబ్ధిదారులు చెల్లించనవసరం లేదు. మిగిలిన 50 శాతం బ్యాంకులకు వాయిదాల పద్ధతిలో చెల్లించాలి.

ఫ జిల్లా వ్యాప్తంగా 2883 మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యం పెట్టుకున్నారు. రూ.5347.98 లక్షలను రుణాలుగా బ్యాంకుల ద్వారా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకుల నుంచి రూ.2673.99 లక్షలు, ఏపీ వెనకబడిన సంక్షేమశాఖ మరో రూ.2673.99 లక్షలను కేటాయించనున్నాయి.

అధిక పోటీ

బీసీ సంక్షేమ శాఖ ఇస్తున్న సొమ్ము పూర్తిగా రాయితీ. రుణం పొందిన లబ్ధిదారుడు తిరిగి చెల్లించనవసరం లేదు. బ్యాంకు నుంచి పొందిన సొమ్మును మాత్రం వ్యాపారం ద్వారా వచ్చే లాభాల నుంచి వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు చెల్లించాలి. ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఈవిధంగా ప్రోత్సహించేందుకు మార్చి 10 నుంచి జిల్లాలో దరఖాస్తులు ఆహ్వానించారు. రవాణా వాహనాలు, వ్యవసాయ సంబంధిత పనిముట్లు, ట్రాక్టర్‌ వంటి వాటితో పాటు జనరిక్‌ మందుల షాపు పెట్టుకునేందుకూ అవకాశం ఉంది. అలాగే మేదర, కమ్మ, శాలివాహన వంటి సామాజిక వర్గాలకు వృత్తిపరమైన రుణాలను అందించనుండడంతో ఈ రుణాల కోసం యువత బాగానే మొగ్గుచూపింది. 19,616 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.

స్థానిక బ్యాంకుల వద్దకు పరుగులు

స్థానికంగా వున్న బ్యాంకుల వద్దకు నిరుద్యోగ యువత పరిగెత్తుతున్నారు. ఖాతాలను తెరిచి బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని అడుగుతున్నారు. వారి నుంచి సరైన స్పందన ఉండడం లేదు. మరోవైపు బ్యాంకు అధికారులను ఒప్పించి గ్యారెంటీ తీసుకొచ్చే సమయానికి ఎక్కడ రుణాల మంజూరు అర్హత జాబితా తయారు చేసేస్తారోనన్న భయం కూడా వీరిని వెంటాడుతోంది. దీనికి తోడు ప్రజాప్రతినిధుల సిఫార్స్‌ల భయం ఉండనే వుంది. ప్రజాప్రతినిధులు సిఫార్స్‌ ఉన్నా కూడా బ్యాంకు గ్యారెంటీ ఉండాలి. రెండూ ఉన్న లబ్ధిదారులకు మాత్రమే బీసీ కార్పొరేషన్‌ రుణాలు అందుతాయన్న ప్రచారం జరుగుతోంది.

ఫొటో రైటప్‌: 2కోట1,2: శృంగవరపుకోట మండల ప్రజా పరిషత్‌ కార్యాలయ అవరణలో జరిగిన బీసీ కార్పొరేషన్‌ ఇంటర్యూలకు హాజరైన దరఖాస్తుదారులు

-------------------

నాయకుల ఒత్తిళ్లు.. అధికారుల అగచాట్లు

మెంటాడ, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): బీసీ రుణాల జాతర మండల స్థాయి అధికారులకు ప్రాణసంకటంగా పరిణమించింది. టీడీపీ నేతల సిఫార్సులు ఓ వైపు, స్థానిక సంస్థల్లో పవర్లో ఉన్న వైసీపీ నేతల ఒత్తిళ్లు మరోవైపు.. అలానే జనసేన నేతల సిఫార్సుల మధ్య అధికారులు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. ఎవరిమాట కాదంటే ఎట్నుంచి ఏమవుతుందోనన్న ఆందోళన వారిలో నెలకొంది. దరఖాస్తుల ప్రక్రియను ముగించిన అధికారులు ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపికలో భాగంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. సిఫార్సులకు అతీతంగా ఎంపిక చేయాలని యంత్రాంగం భావించినప్పటికీ వారికి ఒత్తిళ్లు తప్పడం లేదు. ఇంటర్వ్యూ సమయంలో తమ వర్గీయులను ఎంపిక చేయాలని టీడీపీ,వైసీపీ,జనసేన నాయకులు పట్టుబడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 95 శాతం స్థానిక సంస్థలు వైసీపీ ప్రాబల్యంలో ఉన్నాయి. గత లోకల్‌ బాడీ ఎలక్షన్‌ టైమ్‌లో అప్పటి అధికార వైసీపీ నయానా భయనా అన్ని స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. పంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌ వరకు అన్నింటా ఆ పార్టీ అధికారం చెలాయిస్తోంది. ఈనేపథ్యంలోనే ప్రస్తుతం బీసీల రుణాల జాతరలో సింహభాగం తమకే దక్కాలన్నట్టుగా హడావుడి చేస్తున్నారు. తమ వారికే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంకోవైపు కూటమి నేతలు సహజంగానే తమవారిని పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఇలా రెండు అధికార కేంద్రాల మధ్య నలిగిపోతున్నామని అధికారులు వాపోతున్నారు.

Updated Date - Apr 05 , 2025 | 12:01 AM