drinking water: తాగునీటి సమస్య తలెత్తకూడదు
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:10 AM
drinking water: వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారు లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా, మండల, నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షించారు.

-ఉపాధి కూలీలకు పని గంటలు మార్చాలి
-పాఠశాలల్లో ప్రతి రెండు గంటలకు వాటర్ బెల్
-కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశం
విజయనగరం కలెక్టరేట్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారు లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా, మండల, నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని గ్రామాల్లో ఉన్న బోరుబావులను తనిఖీ చేయాలని, పని చేయని వాటిని వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. వేసవి ప్రణాళికను ఇప్పటికే వేసుకున్నట్లు చెప్పారు. ‘విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. ఏప్రిల్, మే నెలల్లో వేసవి తీవ్రత అధికంగా ఉండి, వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకో వాలి. వేసవి తాపానికి గురి కాకుండా కూడళ్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి. తాగునీరు, మజ్జిగను ఉంచాలి. అవి కలుషితం కాకుండా చూసుకోవాలి. ఉపాధి పనులు చేసే కూలీలకు ఎండ తీవ్రత తగలకుండా పని వేళలను మార్చాలి. ఉదయం 6.30 గంటల నుంచి 9.30 గంటలకు లోపు, సాయంత్రం 5 నుంచి 7 గంటల లోపు పని చేసేలా చూడాలి. పని చేసే చోట నీడ కోసం షామియానాలు వేయాలి. పశువులకు గ్రాసం సమస్య లేకుండా చూడాలి. ఉపాధి వేతనదారుడికి సరాసరి వేతనం రూ.300 అందేలా చూడాలి. వేసవిని దృష్టిలో పెట్టుకుని పాఠశాలల్లో ప్రతి రెండు గంటలకు ఒక సారి వాటర్ బెల్ కొట్టాలి. ఈ నెల 30, 31 తేదీల్లో సెలవులు ఉన్నందున ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్ సొమ్మును 29న విత్‌డ్రా చేసి, 1న తేదీన ఉదయం 7 గంటలకు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో శ్రీనివాస్ మూర్తి పాల్గొన్నారు.