Stock Market Crashes: హర్షద్ మెహతా స్కాం నుంచి ఇప్పటి వరకు.. భారత స్టాక్ మార్కెట్‌లో 5 అతిపెద్ద క్రాష్‌లు..
ABN , Publish Date - Apr 07 , 2025 | 02:21 PM
Top Market Crashes In India: భారత ఇన్వెస్టర్లకు బ్లాక్ మండేగా నిలిచిన ఈ రోజు భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని అతిపెద్ద పతనాలలో ఒకటి. సెన్సెక్స్ ఈరోజు దాదాపు 4000 పాయింట్లు పడిపోయింది. హర్షద్ మెహతా స్కాం మొదలుకుని కొవిడ్ మహమ్మారి వరకూ కేవలం 5 సార్లే ఇలా..

Top Biggest Stock Market Crashes In India's History: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ బాంబు ప్రపంచవ్యాప్త స్టాక్ మార్కెట్లలో విధ్వంసం సృష్టిస్తోంది. ట్రంప్ నిర్ణయం వల్ల ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లో గందరగోళం నెలకొంది. ప్రపంచ ఈక్విటీలలో తీవ్ర పతనం మధ్య భారత మార్కెట్ల స్టాక్ సూచీలు బ్లడ్ బాత్ చేశాయి. ఇన్వెస్టర్లకు పీడకలనే మిగిల్చాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడటంతో భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇవాళ 'బ్లాక్ మండే'గా నిలిచింది. ఈరోజు సెన్సెక్స్ దాదాపు 4000 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ కూడా 5 శాతం క్షీణించింది. ఇది భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద పతనాలలో ఒకటి. హర్షద్ మెహతా స్కామ్, 2008 ఆర్థిక మాంద్యం సమయంలో పెట్టుబడిదారులు ఆర్థికంగా ఎలాగైతే ఎదురుదెబ్బ తిన్నారో.. అచ్చం అలాంటి పరిస్థితే ఇవాళ కూడా ఎదురైంది. ఈ రోజు ముందు వరకూ స్టాక్ మార్కెట్లో ఇలాంటి క్షీణత కేవలం 5 సార్లు కనిపించింది. వాటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
హర్షద్ మెహతా స్కామ్ క్రాష్ (1992)
1992లో హర్షద్ మెహతా కుంభకోణం బయటపడినప్పుడు భారత స్టాక్ మార్కెట్‌కు తొలిసారిగా అతిపెద్ద షాక్ తగిలింది. 4000 కోట్లకు పైగా జరిగిన ఈ కుంభకోణం బయటపడగానే సెన్సెక్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఏప్రిల్ 28, 1992న సెన్సెక్స్ 570 పాయింట్లు (12.7%) పడిపోయింది. స్టాక్ మార్కెట్లో ఒకే రోజులో జరిగిన అతిపెద్ద పతనం ఇదే.
కేతన్ పరేఖ్ స్కామ్ క్రాష్ (2001)
2001 లో కేతన్ పరేఖ్ స్కామ్ మరోసారి భారత స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. స్టాక్ మార్కెట్ బ్రోకర్ కేతన్ పరేఖ్ కుంభకోణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీని కారణంగా సెన్సెక్స్ 176 పాయింట్లు (3.7%) పడిపోయింది. ఇదే సమయంలో గుజరాత్‌లో సంభవించిన భూకంపం పెట్టుబడిదారులను మరింత గందరగోళం పెంచింది.
ఎన్నికల షాక్ క్రాష్ (2004)
2004లో మరోసారి NDA ప్రభుత్వం పగ్గాలు చేపడుతుందని స్టాక్ మార్కెట్లు ఆశించాయి. కానీ అనూహ్యంగా ఎన్నికల ఫలితాల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ(యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్) ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఓటర్ల అసాధారణ తీర్పు ఫలితంగా స్టాక్ మార్కెట్ ఆశలు అడియాసలయ్యాయి. దీంతో మే 17న సెన్సెక్స్ 11.1 శాతం (842 %) పాయింట్లు పడిపోయింది.
ప్రపంచ మాంద్యం (2008)
2008లో లెమాన్ బ్రదర్స్ పతనం వార్త ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. జనవరి 21, 2008న సెన్సెక్స్ 1,408 పాయింట్లు (7.4 %) పతనమైంది. మాంద్యం ముప్పు స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది.తరువాతి కొన్ని నెలల్లోసెన్సెక్స్ గరిష్ఠ స్థాయి నుండి 60 శాతానికి క్షీణించింది.
కోవిడ్-19 మహమ్మారి (2020)
2020లో చైనా తర్వాత ప్రపంచం మొత్తం కోవిడ్ 19 మహమ్మారి బారిన పడిందని వార్తలు వచ్చిన వెంటనే స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. మార్చి 23, 2020న సెన్సెక్స్ 3935 పాయింట్లు (13.2 %) పడిపోయింది. మార్కెట్ క్షీణతకు కారణం మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం. అన్ని స్టాక్ మార్కెట్ పతనాలలో ఇప్పటివరకూ జరిగిన అతిపెద్ద క్రాష్ ఇదొక్కటే.
2020 తర్వాత ఏప్రిల్, 2025న భారత మార్కెట్ మళ్లీ భారీ పతనాన్ని చవిచూసింది. గ్లోబల్ ఈక్విటీల పతనం, ఇండియా VIX 56.50 % పెరగడమూ ఈ రోజు స్టాక్ మార్కెట్ భారీగా కుప్పకూలిపోవడానికి కారణాలు. ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మున్ముందు ఇంకెలా ప్రభావితం చేస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.
Read Also: Stock Market: అసలు స్టాక్ మార్కెట్ నష్టాలు ఎందుకు..ఇవే కారణాలు
Stock Markets Halted: భారీ నష్టాల భయం..ఈ దేశాల స్టాక్ మార్కెట్లు నిలిపివేత, కారణమిదే..