కదలి వచ్చిన అధికారులు
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:29 AM
మొగల్తూరు గ్రామ సమస్యలన్ని పరిష్కారమవుతాయని పంచాయతీరాజ్ శాఖ కమిష నర్ మైలవరపు కృష్ణ తేజ తెలిపారు.

మొగల్తూరు, పెనుగొండలో గ్రామాభివృద్ధి సభలు నిర్వహించిన డీప్యూటీ సీఎం పేషీ అధికారులు
మొగల్తూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మొగల్తూరు గ్రామ సమస్యలన్ని పరిష్కారమవుతాయని పంచాయతీరాజ్ శాఖ కమిష నర్ మైలవరపు కృష్ణ తేజ తెలిపారు. గ్రామ సర్పంచ్ పడవల మేరీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన గ్రామాభివృద్ధి సభలో కృష్ణ తేజ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మొగల్తూరు అభి వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. తమను మొగల్తూ రులో గ్రామసభ నిర్వహించి అబివృద్ధిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారన్నారు. ప్రజలు మన వద్దకు రావడం కాదు, మనమే వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని చెప్పడంతో గ్రామ సభ ఏర్పాటు చేశామన్నారు. జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన అవకాశా న్ని గ్రామస్థులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అభివృద్ధికి దూరంగా ఉన్నాం
ఎమ్మెల్యే నాయకర్
నరసాపురం నియోజకవర్గం అభివృ ద్ధికి దూరంగా ఉందని ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్ బొమ్మిడి నాయకర్ అన్నారు. సముద్ర తీరం కావడంతో ప్రజల దాహార్తి తీరాలంటే కాలువ నీరు మా త్రమే ఆధారమని, భూమి నుంచి మంచినీరు లభ్యం కాదన్నారు. ఉప్పునీటి ప్రాంతం కావడం, ఒక పక్క సముద్రం, మరోపక్క గోదావరి, ఉప్పుటేరుల మధ్య జీవనం కొనసాగిస్తున్నామన్నారు. మొగల్తూరులో తాగునీరు, సాగునీరు, విద్య, వైద్య, రహదారి సదుపాయాలు కల్పనకు పవన్ సిద్ధంగా ఉన్నారన్నారు.
ఏమి కావాలో చెప్పండి అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను పంపించారని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్త పల్లి సుబ్బారాయుడు అన్నారు. గ్రామస్తులు సూచించిన పనులకు ప్రతిపాదనలు రూపొందించి త్వరితగతిన పరిష్కారం చేస్తారన్నా రు. విజ్జేశ్వరం నుంచి మంచినీటి ప్రాజెక్టులకు నేరుగా పైప్‌లైన్ ద్వారా నీరందించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పొత్తూరి రామరాజు కోరారు. మాజీ సర్పంచ్‌లు మామిడిశెట్టి సత్యనారా యణ, శ్రీరాజా కలిదిండి కుమార్ బాబు, పడవల సత్యనారాయణ, ఉప సర్పంచ్ బోణం నర్సింహరావు, గ్రామస్థులు, సమీప గ్రామాల సర్పంచ్‌లు, రైతులు సమస్యలపై వినతులు అందించారు. పంచా యతీ కార్యదర్శి ముచ్చర్ల నాగేశ్వరరావు, వార్డు సభ్యులు, డీపీవో అరుణశ్రీ, డీసీఎం పేషీ అధికారులు ఓఎస్‌డీ కె.వెంకటకృష్ణ, జీఆర్ మధుసూదన్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పెనుగొండలో..
పెనుగొండ, మార్చి28(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలు మేరకు పెనుగొండలో నిర్వహించిన గ్రామాభి వృద్ధి సభలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్థలు సమస్యలు ఏకరువు పెట్టారు. పవన్ కల్యాణ్ తండ్రి వెంకట్రావు స్వగ్రామం కావడంతో అభివృద్ధిపై ప్రతిపాదనలకు డీసీఎం పేషీ అధికారులను పంపించా రు. టీటీడీ కల్యాణ మండపంలో వినతిపత్రాలు స్వీకరించారు.
తొలి పారిశ్రామిక పట్టణంగా పెనుగొండకు ఖ్యాతి ఉందని, పెనుగొండలో ఇనుము ఫ్యాక్టరీ ఉన్న కాలంలో సుమారు 500 మంది కార్మికులు పని చేసేవారన్నారు. పెనుగొండను పారిశామ్రిక పట్టణంగా తీర్చిదిద్దాలని కోరారు.
పారిశుధ్యం మెరుగుదల, భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి సహకరించాలని గ్రామస్థులు కోరారు.
పెనుగొండ కళాశాల వద్ద కాల్వపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు.
పెనుగొండ – మార్టేరు కాలువగట్టు రహదారి అభివృద్ధి చే యాలని, బీడు, రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు.
సిద్ధాంతంలో పవిత్ర వశిష్ఠ నదీ తీరంలో కైలాస భూమి అభివృద్ధి చేయాలని, పెనుగొండలో శ్మశాన వాటిక, ఎస్సీ శ్మశాన వాటికల అభివృద్ధి చేయాలని కోరారు.
ప్రధాన సమస్యగా ఉన్న డంపింగ్ యార్డుకు రెండున్నర ఎరరాలు కేటాయించి నిధులు మంజూరు చేయాలని కోరారు.
పెనుగొండలో ఆధ్యాత్మిక శోభకు అనుగుణంగా గ్రీన్ సిటీగా తీర్చిదిద్ది వాసవి ఆలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు.
నివేదిక తయారుచేసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నివేదిస్తామని పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. ప్రతీ సమస్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలిస్తారని, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అన్ని పనులు జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హామీ ఇచ్చారు. సర్పంచ్ నక్కా శ్యామలా సోని శాస్త్రి, ఫారెస్ట్ ఎస్‌పీఎఫ్ కృష్ణ, పీఏ.బాలకృష్ణ, తహ సీల్దార్ అనితకుమారి, ఎంపీడీవో టి.సూర్యనారాయణ మూర్తి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.