Y Ramakrishnudu: గత ప్రభుత్వంలో పెరిగిన ఆర్థిక అసమానతలు
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:49 AM
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిందని శాసన మండలి సభ్యుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. బుధవారం శాసనమండలిలో దవ్యవినిమయ బిల్లుపై ఆయన మాట్లాడారు.

రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారు: యనమల
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిందని శాసన మండలి సభ్యుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. బుధవారం శాసనమండలిలో దవ్యవినిమయ బిల్లుపై ఆయన మాట్లాడారు. ‘విద్య, వైద్యం, పౌష్టికాహారాన్ని ప్రజలకు అందించడంలో గత ప్రభుత్వం విఫలమయ్యింది. రోడ్లు పాడయ్యాయి.. మంచినీరు అందలేదు.. ఆర్థిక అసమానతలు పెరిగాయి.. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వమే’ అని యనమల చెప్పారు. ‘రాష్ట్రానికి ఇది క్లిష్ట సమయం. గత ఐదేళ్ల సంక్షోభాన్ని చక్కదిద్దే బాధ్యత ఈ ఒక్క బడ్జెట్‌పైనే ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘గత ప్రభుత్వంలో డబ్బులు ఖర్చు చేశారుకానీ అవుట్‌పుట్ రాలేదు. ఆర్థిక విధ్వంసం జరిగింది.
మైన్స్, ఎక్సైజ్.. ఇలా అన్ని రకాల సంపదను ప్రైవేటుకు అప్పజెప్పి ప్రభుత్వ ఖజానాకు డబ్బు రాకుండా చేసి, జేబులు నింపుకున్నారు. దీనివల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. రాష్ట్రాన్ని దివాళా తీయించి, అప్పులు తప్ప వేరే మార్గం లేకుండా చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పు రూ.14 లక్షల కోట్ల వరకు ఉంటుంది. అప్పులపై వడ్డీ భారమే రూ.30 వేల కోట్లు ఉంది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దడం కష్టమే. అయితే కేంద్ర ప్రభుత్వ సాయం, చంద్రబాబు సమర్థతతో అధిగమిస్తారన్నారు. వడ్డీ రేట్లు తగ్గించమని బ్యాంకులను కోరాలి. రుణాల చెల్లింపు 20 ఏళ్లు వాయిదా వేసిలా కేంద్ర ప్రభుత్వాని అడగాలి’ అని యనమల సూచించారు.